ముంబై, డిసెంబర్ 24 : ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్లను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. 2009 ఆగష్టులో వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ ధూత్ నాయకత్వంలోని.. వీఐఈఎల్ కంపెనీకి రుణాలు మంజూరు చేయడంలో అవినీతికి, అవకతవకలకు పాల్పడినట్టు నమోదైన కేసులో వీరిని అదుపులోకి తీసుకున్నారు. కస్టడీ కోసం వీరిద్దరికీ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఈ అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే.. 2018లో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో బాధ్యతల నుంచి చందా కొచ్చర్ వైదొలిగారు. చందా కొచ్చర్..
బ్యాంక్ నిబంధనలకు విరుద్దంగా రూ.300 కోట్ల రుణం మంజూరు చేసినట్లు సీబీఐ గుర్తించింది. అందుకు ప్రతిగా వేణుగోపాల్ ధూత్ ఒక కంపెనీ కొనుగోలు కోసం దీపక్ కొచ్చర్‌కు 2009 సెప్టెంబరు 8న… రూ.65 కోట్లు బదిలీ చేసినట్టు సీబీఐ తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది. వీటిపై విచారణ జరిపిన సీబీఐ ఈ వ్యవహారం ద్వారా చందాకొచ్చర్ ఫ్యామిలీ లబ్ది పొందిందని అభియోగాలు మోపింది. ఈ క్రమంలో కొచ్చర్ దంపతులను అరెస్టు చేశారు.



