ఐటి కారిడార్‌లో జంకుతున్న ప్రతిపక్షాలు

అభ్యర్థులను ప్రకటించేందుకు సతమతం..!

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌25: అధికార పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకువెళుతుంటే ప్రతిపక్ష పార్టీల నుంచి టికెట్‌ ఆశిస్తున్న ఆశావహుల్లో అయోమయం నెలకొంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వారిని కాదని కొత్త వారికి టికెట్లు ఖరారు చేస్తుండడంతో ఆశావహులు కంగుతింటున్నారు. ఐటీ కారిడార్‌లో అత్యంత కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాలుగా పేరున్న శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌లలో ఇప్పటికీ పోటీ చేసే అభ్యర్థులు ఎవరో ఆయా పార్టీలు ప్రకటించలేదు. కాంగ్రెస్‌, ‌బీజేపీలు ఇప్పటికే మొదటి లిస్టును ప్రకటించినా అందులో ఈ రెండు నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను ప్రకటించకపోవడం ఆశావహులకు కంటి ద కునుకు లేకుండా చేస్తోంది. ఎన్నో ఏళ్ల నుంచి పార్టీలో ఉంటూ ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆశతో ఎదురు చూస్తున్న వారు నిరాశతో ఉన్నారు.

దీనికి కారణం ఇటీవల కాలంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఏకంగా టికెట్లు కేటాయిస్తుండడమే. మల్కాజిగిరి ఎమెల్యేకు కాంగ్రెస్‌ ‌పార్టీలో ఒకేసారి రెండు టికెట్లను కేటాయించడాన్ని స్థానిక నాయకులు ఊహించుకొని ఆందోళనకు గురవుతున్న పరిస్థితి ఈ రెండు నియోజకవర్గాల్లో నెలకొంది. మరోవైపు ఒక్కో నియోజకవర్గంలో 3 నుంచి 5 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిని కాదని కొత్తగా నాయకులు పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉండడంతో టికెట్‌ ‌దక్కుతుందో లేదోనన్న భయం వారిని వెంటాడుతోంది. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో ఉన్న శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలు ఐటీ కారిడార్‌లో అత్యంత కీలకమైనవే కాకుండా అత్యధిక ఓటర్లు ఉన్న నియోజక వర్గాలుగా గుర్తింపు పొందాయి. మెజారిటీ ఓటర్లు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి సెటిల్‌ అయిన వారు ఉండగా, ఇందులో ఐటీ ఉద్యోగులు, ఉత్తర భారత దేశానికి చెందిన వారు చాలా మందే ఉన్నారు. ఇలాంటి చోట ఓటర్ల ఆలోచన ఎలా ఉంటుందో తెలియక ప్రతిపక్ష పార్టీల నుంచి టికెట్‌ ఆశిస్తున్న వారు సతమతమవుతున్నారు. అదేసమయంలో శేరిలింగంపల్లి నుంచి అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా, సిట్టింగ్‌ ఎమ్మెల్యే అరికెపూడిగాంధీ, రాజేంద్రనగర్‌ ‌నుంచి ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్‌లు ఐటీ కారిడార్‌లో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చెబుతూ ప్రజల్లో తిరుగుతున్నారు.

ఈ రెండు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థులే ప్రత్యర్థి పార్టీలకు అందనంత వేగంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరవుతూ ఉంటే కాంగ్రెస్‌, ‌బీజేపీల నుంచి అభ్యర్థులెవరో తెలియని ఆయా పార్టీల క్యాడర్‌లో నెలకొంది.  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌ ‌కేంద్రంగా జరిగిన అభివృద్ధిని చూస్తే అత్యధికంగా ఐటీ కారిడార్‌ ‌పరిధిలోనే జరిగింది. ఈవిషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారు. కొత్తగా వందలాది ఐటీ కంపెనీలతో పాటు ఫ్లైఓవర్లు, అండర్‌ ‌పాస్‌లు, లింకురోడ్లు, తాగునీరు, విద్యుత్‌ ఇలా ఎన్నో అంశాల్లో అభివృద్ధి ఐటీ కారిడార్‌ ఎక్కువ జరగడంతో అధికార పార్టీపై ప్రజల్లో ఎంతో సానుకూలత ఉంది. అలాంటి చోట తమ భవిష్యత్‌ ఎలా ఉంటుందో అన్న ఆలోచన ఒకవైపు ఉంటే టికెట్‌ ఎప్పుడు ఎవరికి ఇస్తారో అన్న దానిపైనే ఎక్కువగా ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నికల గడువు సపిస్తున్నా టికెట్లు ఖరారు కాకపోవడం ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు ప్రతికూలంగా మారతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టికెట్‌ ‌ఖరారైన తర్వాత ప్రజల వద్దకు వెళ్లేందుకు సరిపడా సమయం లేకపోతే గెలుపు అంత సులువు కాదనే అభిప్రాయం ఆయా పార్టీల నాయకుల నుంచే వ్యక్తమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *