‘‘ఇది ఈరోజు హఠాత్తుగా మీద పడిన ప్రమాదం కాదు.2014న పట్టం గట్టుకున్న భా.జ.పా. వెనువెంటనే ఇందుకు సంబంధించిన పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించింది.నూతన విద్యా విధానం- 2020 గా అది మన ముందుకు చర్చకు వచ్చే వరకు మెజారిటీ బుద్దిజీవుల అనుమానాలు నిజమవుతాయని విశ్వసించ లేకపోయాము.సాంఘిక శాస్త్రాల మటుమాయం,దాని వెనుక దాగున్న భాషల పెను విధ్వంసం,దేశమంతా ఒకే భాష పేరిట పెట్టిన చిచ్చు దక్షిణాది,ఉత్తరాదిల మధ్య ఉద్రిక్తత లను రెచ్చగొట్టేందుకు ఒడిగట్టనుంది.’’
నొప్పి తెలియకుండా సూదిమందేసే విద్య బాగా తెలిసిన సంఘ పరివారం దేశంలోని భిన్న సంస్కృతులను,ఆ సంస్కృతులతో ముడిపడి వున్న భిన్న భాషలవిధ్వంసానికి ఒడిగట్టి చాపకింద నీరులా తనపని తానుచేసుకుపోతూ వస్తున్నది.తాజాగా హింది దివస్ సందర్భంగా సెప్టెంబర్,14న దేవనాగరి లిపి గల హిందీ భాషను ఆర్టికల్ 343(1) కింద అధికార భాషగా ప్రకటించింది. అధికార భాషల తీర్మానం.1968 మేరకు దేశవ్యాప్తంగా హిందీని అధికార వినియోగానికి వ్యాప్తి చేయనున్నట్టు ప్రకటించారు. ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయంగా హిందీ భాష ని అమలు చేయటం సంబంధించి అమిత్ షా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ ప్రకటించిన తమ 112 పేజీల రిపోర్ట్ రాష్ట్రపతి కార్యాలయానికి అందచేయనుంది.ఈ రిపోర్ట్ అమలు దేశంలో సృష్టించే సంక్షోభానికి యావత్ భారత విద్యారంగమే కాదు, భాషలతో ముడిపడి వున్న ఆయా రాష్ట్రాల సంస్కృతులూ బలి కానున్నాయి.
ఇది ఈరోజు హఠాత్తుగా మీద పడిన ప్రమాదం కాదు.2014న పట్టం గట్టుకున్న భా.జ.పా. వెనువెంటనే ఇందుకు సంబంధించిన పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించింది. నూతన విద్యా విధానం- 2020 గా అది మన ముందుకు చర్చకు వచ్చే వరకు మెజారిటీ బుద్దిజీవుల అనుమానాలు నిజమవుతాయని విశ్వసించ లేకపోయాము. సాంఘిక శాస్త్రాల మటుమాయం, దాని వెనుక దాగున్న భాషల పెను విధ్వంసం, దేశమంతా ఒకే భాష పేరిట పెట్టిన చిచ్చు దక్షిణాది,ఉత్తరాదిల మధ్య ఉద్రిక్తత లను రెచ్చగొట్టేందుకు ఒడిగట్టనుంది.
ఏ సమాజమైనా తమ సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాలకు అందించాలని కోరుకుంటారు.ఈ ప్రయత్నంలో విఫలమైన అనేక గొప్పగొప్ప సమాజాలు చరిత్రలో కనిపించకుండా అదృశ్యమయ్యాయి. సమాజం తన ఉనికిని పది కాలాలపాటు పదిలంగా కాపాడుకోవటంలో అక్కడి భాషాసంస్కృతులు ప్రధానమ వుతాయి.భాషతో ముడిపడివుండే సంస్కృతి, ఆచారవ్యవహారాలు, ఆహారపుటలవాట్లు, వస్త్రధారణ, పండుగలు, విశ్వాసాలు, నమ్మకాలు, జానపదసాహిత్యం, కళలు,ఆ సమాజానికి ప్రాణా ధారాలుగా నిలుస్తాయి. చరిత్ర లిఖితపూర్వక నిక్షిప్తం చేసే క్రమంలో ఈ అంశాలన్నీ సజీవ సాక్షీ భూతాలవుతాయి.
ఈ క్రమంలో పాలకులు,వారిని పోషించే కార్పొరేట్ వ్యాపార వాణిజ్య శక్తులు తాము బలపడటానికి అడ్డంకిగా వుండే ప్రజాస్వామిక సంస్కృతి ని కూల్చేసేందుకు తమదైన శైలిలో ప్రయత్నిస్తాయి. గతంలోని ఫ్యూడల్ వ్యవస్థ, భూస్వామ్య వర్గాల ప్రతినిధులే రాజకీయ నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా ,వ్యాపార వాణిజ్య కార్పొరేట్లుగా బహుముఖాలు కలిగి సమాజాన్ని తమ చెప్పుచేతలలో వుంచుకోవటానికి చేసే ప్రయత్నాలు చేస్తూ రకరకాల ముసుగులతో రంగంలో దిగటం నేటి ప్రజాస్వామ్య లక్షణంగా పరిణామం సంతరించుకుంది. అందుకే యేళ్ళ తరబడి సమాజ ఐక్యతకు ఊతమయ్యేటి అక్కడి ప్రజాస్వామిక సంస్కృతిని అభివృద్ధి,లేదా సంస్కరణల పేరిట విధ్వంసం చేయటానికి పూనుకు ంటారు.కార్పొరేట్ సామ్రాజ్య విస్తరణ నేపధ్యంలో వస్తుమయ వాణిజ్య సంస్కృతి ప్రవేశం పేరిట జరిగిన విధ్వంస రూపాలు చూశాము.ఉద్దేశపూర్వక విధ్వంసాలే అయినప్పటికినీ మనం వాటినంత సులభంగా గుర్తుబట్టే అవకాశాలుండక పోవచ్చు. ఏం జరిగిందో తెలుసుకునే లోపలే, అభివృద్ధి పేరిట పలు రూపాలు దాల్చి చేయాల్సిన విధ్వంసమంతా చేసుకు పోతుంది.
భాషపై దాడి..
కొఠారీ కమిషన్ ,1986 లో వచ్చిన జాతీయ విద్యా విధానం సూచించినట్టు ప్లస్ టూ వరకూ మాతృభాష లోనే బోధించాలనే పేర్కొన్న త్రిభాష విధానం అమలులో నిర్లక్ష్యానికి గురైంది. భారత రాజ్యాంగాన్ని సమ్మూలంగామార్చాలని ఉవ్విళ్ళూరుతూ రాజ్యాంగం స్థానంలో మనుధర్మాన్ని ప్రతిష్టించాలనే తమ ఎజెండా అమలు చేసేందుకు బి.జె.పి.ప్రభుత్వ కార్యాచరణకు తుది రూపమే ఈ రిపోర్ట్. అమిత్ షా ప్రకటించిన ఈ పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ ఫలితంగా అన్ని రాష్ట్రాల్లో అక్కడి మాతృభాషలు కాలగర్భాన కలిసిపోనున్నాయి.ఇప్పుడు దేవనాగరి లిపి కలిగిన హిందీ భాషను అధికారభాషగా తెస్తూ అన్ని స్థాయిల్లో హిందీని దేశమంతా చుట్టేందుకు అధికారికంగా ముందుకుతెచ్చింది. ఇది దక్షిణాది రాష్ట్రాలకు గొడ్డలిపెట్టు వంటిది. తమిళనాడు సి.ఎం, స్టాలిన్,కర్నాటక సి.ఎం. సిద్దరామయ్య తీవ్రంగా వ్యతిరేకిస్తూ తమ అభిప్రాయాలను ప్రకటించారు.
ఎనిమిది ఈశాన్యరాష్ట్రాలు మాతృభాషలలో ప్రాథమికవిద్య బోధిస్తున్నాయి.30 శాతం ప్రజలు తమ స్థానిక భాషలలోనే మాట్లాడుతున్నారు.ఈ కొండ ప్రాంతాలలో నివసించే గిరిజనుల ఆవాసాలలో ఒకే పాఠశాలలో 30 కి మించిన స్థానికభాషలను వాటితో ముడిపడి వుండే సంస్కృతిని బోధిస్తున్నాయి బహుళ భాషల పాఠశాలలు అక్కడి పిల్లలలో భాషా సామర్థ్యాలను విజయవంతంగా సాధిస్తున్నాయి.ఈ రిపోర్ట్ ఫలితంగా ప్రస్తుతం ఆ రాష్టాలలో 22 వేల మంది హిందీ టీచర్ల నియమాకానికి, ఆయా రాష్ట్రాలలోని స్థానిక భాషల,మాండలికాల సారస్వాతాన్ని హిందీ భాషలోకి అనువదించి పదవ తరగతి వరకు హిందీ భాషా బోధనను తప్పనిసరి అమలు కోసం కార్యాచరణకు సిద్దం చేస్తున్నారు.
అమిత్ షా కమిటీ రిపోర్ట్ లో ఏముంది?
ఇంగ్లీష్ స్థానంలో హిందీని అధికార భాషగా అమలు చేయటం,మరో పదిహేనేళ్ళలో పూర్తిగా ఇంగ్లీష్ ను లేకుండా చేయటమే లక్ష్యంగా ఈ రిపోర్ట్ అమలు కానుంది.ప్రధానమైన మూడు అంచెలలో ఒకటి,రిపోర్ట్ అమలుకోసం రాబోయే జూలైలో ఒక సమావేశం ఏర్పాటు చేసి,అంశాలవారిగా అమలు కోసం అధికార భాషల కమిటీ కార్యదర్శి సభ్యులందరికీ సమాచారం అందించటం.రెండవది,ఎలిమెంటరీ స్థాయి నుండి 9 వ తరగతి వరకు హిందీ భాషపై క్రమంగా ప్రాథమిక అవగాహన కల్పించటం, భాషాభివృద్ది కోసం పరీక్షల నిర్వహణ, మూడవది, హిందీ భాషా నిఘంటువును విస్తరింప చేసి రేపటి నూతన అవసరాలకు తగ్గట్టుగా పూర్తిగా మార్చి ప్రచురించటం, రాష్ట్రపతికి పంపటానికి ముందే 30 మంది కమిటీ సభ్యులు ఏకాగ్రీవంగా ఆమోదించారు. ఈ కార్యక్రమ అమలుకోసం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నారు.అన్ని రంగాల్లో సాధించినట్టుగానే భాష అమలు విషయంలో కూడా స్వావలంబన అవసరమని ‘‘స్వదేశీ- స్వభాష మరియు స్వరాజ్’’ అనేవే స్వాతంత్య్ర సాధనకు మూలస్థంభాలై దోహదపడ్డాయని ఈ సందర్భంగా అమిత్ షా సమర్ధించుకున్నారు. వైద్య, సాంకేతిక రంగాల విద్యాబోధనలో మెడికల్ కళశాల సిలబస్,ఇంజనీరింగ్ సిలబస్,ఐఐటిలు,కేంద్రీయ విద్యాలయాలు సివిల్స్ పరీక్షల సిలబస్ యావత్తు హిందీ భాషలోనే వుండబోతున్నాయని ప్రకటించారు. హిందీ భాష అమలులో నిర్లక్ష్యం చేయటం పై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు వెనుకాడమని స్పష్టం చేశారు.
అమలు ఫలితాలు ఎలా వుంటాయి
2010లో వచ్చిన విద్యాహక్కు చట్టం,1986లో వచ్చిన జాతీయ విద్యా విధానం,1968 లో వచ్చిన కొఠారీ కమిషన్ తదితర కమిటీల సిఫారుసులను బుట్ట దాఖలు చేస్తూ ఒకే దేశం-ఒకే భాష అనే నినాదం అమలు కోసం ఆమిత్ షా నేతృత్వంలో వెలువరించిన పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ రాష్ట్రపతికి చేరనుంది.భారత రాజ్యాంగం లో పొందు పరచిన భిన్నత్వంలో ఏకత్వం అనే ప్రధాన అంశాన్ని ఈ రిపోర్ట్ సమాధి చేరనుంది.భారత రాజ్యాంగం మేరకు విద్య ఉమ్మడి జాబితాలో వుంది. కేంద్రం పరిధిలో పదో శాతం,రాష్ట్రాల పరిధిలో 90 శాతం గా వున్నది.ఇంకా వివరంగా చెప్పాలంటే రాజ్యాంగం లోని 5వ,6వ షెడ్యూళ్ళ ప్రకారం గిరిజన పాలనా మండళ్ళకు, పంచాయితీలకు, జిల్లా పరిషత్ లకు వివిధ అధికారాలు కట్టబెట్టింది. ప్రజాస్వామ్య విలువలను, సమాఖ్య స్ఫూర్తినీ తుంగలో తొక్కి కేంద్రం విద్యపై ఆధిపత్యం చెలాయించటం,ఎడ్యుకేషన్ కమిషన్ అఫ్ ఇండియాను ఏర్పాటు ఏ ప్రయోజనాలకోసమనేది ఇప్పుడు తేటతెల్లమవుతూన్నది. రాజ్యాంగం గుర్తించిన అధికార భాషలనే కాకుండా వేల సంఖ్యలో గల అనేక స్థానిక భాషలు, దేశవ్యాప్తంగా గల గిరిజన భాషలు వాటితో ముడిపడి వున్న సంస్కృతి విధ్వంసం జరుగనుంది.భాషా ప్రయుక్త రాష్ట్రాల ఒప్పందం లక్ష్యాలకు ఈ రిపోర్ట్ పాతర పెట్టనుంది. మాతృభాషలో ప్రాథమిక,సెకండరీ స్థాయి విద్యను అభ్యసించని విద్యార్థులు చదువులకు దూరమవటం మినహాయించి మరో మార్గం లేదు.
గ్లోబలైజేషన్ నేపధ్యంలో అంతర్జాతీయ స్థాయిలో మన భారతీయ విద్యార్థులు అన్ని రంగాలలో వెనుకబడిపోవటం జరుగుతుంది. మన విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రగతి సాధించటం ఇక మనం ఆశించలేము. దేవనాగరి లిపిలో హిందీ ప్రవేశం వెనుకనే మృతభాష సంస్కృతం ప్రవేశం వుంటుందనటంలో ఆశ్చర్యంలేదు.’’తొల్లిటి కథలే ఇతిహాసాలని’’ వాటి రచయితలే పేర్కొన్న విషయాన్ని మరుగున పడేసి ఇతిహాసాలు, వేదసాహిత్యాలే రేపటి విశ్వవిద్యాలయాల సిలబస్, కరికులంగా మార్చే కుట్రకు ఈ రిపోర్ట్ అమలు నాందీ ప్రస్తావన అనుకోక తప్పదు.కాల్పనిక ,పౌరాణిక గాధలే రేపటి పాఠ్యాంశాలై విద్యార్థుల మెదళ్ళలో మతం మత్తు నింపి ‘‘ఒకే దేశం-ఒకే మతం’’నినాదానికి చేరువ చేయటానికి కుట్ర జరుగుందని అనుకోక తప్పదు.ప్రపంచంలోనే అత్యధికంగా యువతను కలిగిన భారత్ లో రేపటి యువతరం శాస్త్రీయ విద్యను పొందటం ఇకపై దుర్లభం! అత్యంత ప్రాచీన భాషలుగా ప్రఖ్యాతి గాంచిన తెలుగు,తమిళ తో పాటు దక్షిణాది భాషలైన కన్నడ,మళయాల భాషలు మాట్లాడే రాష్ట్రాలలో హిందీ భాష పై వ్యతిరేకత ఇప్పటికే వుంది.రెండవ భాషగా అమలుచేయటమే ఇబ్బందిగా భావిస్తున్నారు. ఒకే దేశం-ఒకే భాష నినాదంతో హిందీ దక్షిణాది రాష్ట్రాలలో అమలు చేసేందుకు రానున్న అమిత్ షా రిపోర్ట్ జాతీయస్థాయిలో అనేక సంక్షోభాలకు దారితీయనుందని తెలుస్తూంది.
ఆయా భాషలతో ముడిపడి వున్న మన సంస్కృతి వైభవం అంతరించిపోయే అవకాశాలున్నాయి.వేల సంవత్సరాల క్రితం వైదిక మత వ్యాప్తికి,నేటి కాలపు మృతభాష సంస్కృతం,దేవనాగరీ లిపి గల హిందీ వ్యాప్తి జరగటం వెనుక హిందూ ఫాసిస్టు శక్తుల రహస్య ఎజెండా దాగివుంది.రేపటి విద్య పిడికెడు మంది అగ్రవర్ణాలకు మాత్రమే అందుబాటులో వుండేందుకు సంఘపరివారం ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నంగా భావించటంలో ఆశ్చర్యంలేదు.వేదాలు,వేదాంగాలు వంటి ఉపనిషత్తులు,పురాణాలు పాఠ్య గ్రంధాలుగా మారి తొంబయిశాతం సామాన్య నిమ్న,దళిత,గిరిజన ప్రజలకు విద్యను దూరం చేసి అజ్ఞాన భారతాన్ని నిర్మించాలని బి.జె.పి.కంటున్న కలలకు ఆచరణవేగం పెరిగింది.అంతేకాదు,తద్వారా దేశంలోని విభిన్నసమాజాల సంస్కృతిని పతనం చేసి వాటి స్థానంలో మనుధర్మాన్ని పునఃప్రతిష్టించి రేపటి భారతాన్ని వేదకాలంలోకి తీసుకెళ్ళే కుట్ర జరుగుతుందని భావించక తప్పదు.ప్రధాని మోడీకి ఆప్తుడైన అమిత్ షా భారతీయ సంస్కృతి పునాదులపై ప్రపంచస్థాయి మహాజ్ఞాన శక్తిగా దేశాన్ని పునర్నర్మించేందుకు నూతన విద్యా విధానం దోహదపడుతుందని పేర్కొన్నారు.’’ దేశమంతా ఒకే భాష,ఒకే సంస్కృతి’’ అనే నినాదం ఇవ్వటం ఈ చర్చను బలపరుస్తుందని భావించాలి.’’కులాల పార్లమెంట్, హిందూ కారిడార్’’ల ఏర్పాటు లక్ష్యంగా రాజకీయాలను వేడెక్కిస్తూ,ఇందుకు గాను కార్పొరేట్ బహుళజాతి కంపెనీల సాయం అందుకుంటున్నది. ప్రతిఫలంగా వారి ఆస్తులు ఒక రోజుకు రెండువేల కోట్ల పెరుగుదల సూచీతో వారిని ప్రపంచ కుబేరులలో మొదటిస్థానంలో నిలిపేందుకు చేస్తున్న కృషిలో ఈ రిపోర్ట్ పాత్రప్రధానమని గుర్తెరుగాలి..
ముసిరిన నల్లని మేఘాలు కురియక మానవు.పాలకుల ముసుగులు తీసేసుకొని బాహాటంగా ఈ దేశ రాజ్యాంగాన్ని, రాజ్యాంగం ఇచ్చిన సమైఖ్యతను భంగపరుస్తూ ఒకే భాష పేరిట సృష్టిస్తున్న పెను విధ్వంసం ఆయా రాష్ట్రాల సాంస్కృతిక అస్థిత్వాలకు సమాధి కట్టకమానదు.ఈ విధ్వంసాన్ని నిరోధించే శక్తుల సమీకరణ కావల్సిన అవసరం తక్షణమే వుంది.వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థి, ఉపాధ్యాయసంఘాలు, జాతీయ విద్యా పరిరక్షణణ కమిటీ ఆధ్వర్యాన ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు,వేర్వేరు స్థాయిల్లో నిరసన పోరాటాలు ఉదృతం చేస్తూ మెజారిటీ ప్రజల గొంతుకై ఐక్య ఉద్యమాల ద్వారా ఈ రిపోర్ట్ అమలును అడ్డుకోవల్సిన అవసరముంది..
– అజయ్




