హైదరాబాద్: నవంబర్ 19: మెదక్ జిల్లాలోని టేక్మల్ సబ్-ఇన్‌స్పెక్టర్‌ను అవినీతి ఆరోపణలపై పకడ్బందీగా అరెస్టు చేసిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) శ్రీ బి. శివధర్ రెడ్డి బుధవారంనాడు అభినందించారు. ఆయన ఏసీబీ డీజీ చారు సిన్హాతో పాటు, ఏసీబీలోని ఇతర అధికారులు మరియు సిబ్బందిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ అవినీతిపరులైన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించవద్దని ఏసీబీకి సూచించారు. లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టేక్మల్ పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన అనంతరం స్థానిక ప్రజలు సంబరాలు చేసుకున్న సంఘటనపై పోలీసు అధికారులు, సిబ్బంది తమ పనితీరుపై స్వీయ సమీక్ష చేసుకోవాలని డిజిపి సూచించారు. లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారి అరెస్టుపై స్థానిక ప్రజలు పటాకులు కాల్చి బహిరంగంగా సంబురాలు జరుపుకొనే సంఘటన ప్రజల నుండి ఒక బలమైన సందేశాన్ని పంపుతుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అభిప్రాయపడ్డారు. ఆ సంఘటన పోలీసుల పట్ల ప్రజల విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందన్నారు.
ప్రజలు అవినీతిని ఏ మాత్రం ఉపేక్షించరని, పోలీసుల నుండి వారు శాంతిభద్రతలను, చక్కని పోలీసింగ్ ను కోరుకుంటారని, ప్రజలను పీడించేవారి పట్ల నిర్దయగా ఉంటారని ఈ సంఘటన రుజువు చేసిందని ఆయన అన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఎవరైనా అవినీతికి పాల్పడితే వారి పైన పర్యవేక్షణ చేసే అధికారుల లోపమేనని భావిస్తానని, వారి మీద కూడ చర్యలు తీసుకుంటామని డిజిపి హెచ్చరించారు. పోలీసు అధికారులు మరియు సిబ్బంది నీతి, నిజాయితీలో పని చేయాలన్నారు.




