ఎస్‌ఎన్‌డీపీ జాడెక్కడ…?

వర్షా కాలం..ఈ పేరు వింటేనే పీర్జాదిగూడ, బోడుప్పల్‌ లోతట్టు ప్రాంతాల ప్రజల వెన్నులో వణుకుపుడుతుంది.. గత నాలుగేళ్ళ క్రితం ఏకధాటిగా కురిసిన భారీ వర్షాల ఫలితంగా వరద నీటి ముంపుతో పడిన అవస్థలు, అష్టకష్టాలు, అనుభవాల నుంచి ఇప్పటికీ తేరుకోలేక్నపోతున్నారు. ఇళ్లల్లో వరద నీరు చేరి రోజుల తరబడి ఉండిపోయిన ఆ భయానక చేదు జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ నివాసితులు హడలిపోతున్నారు.

వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం చూపేందుకు ఎస్‌ఎన్‌డీపీ ద్వారా స్ట్రామ్‌ వాటర్‌ డ్రైన్‌ లైన్‌ పనులు ప్రారంభించిన ఏడాదిలోపు పూర్తి చేస్తామన్న గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. మళ్ళీ భారీ  వర్షాలతో వరదలు ముంచెత్తితే తమ పరిస్థితి ఏందంటూ ప్రజలు హైరానా పడుతున్నారు. రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త సర్కార్‌ దృష్టి సారించి స్ట్రామ్‌ వాటర్‌ డ్రైన్‌ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.  

మేడిపల్లి, ప్రజాతంత్ర, జూన్‌ 10 : పీర్జాదిగూడ, బోడుప్పల్‌ జంట మున్సిపల్‌ కార్పొరేషన్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు వర్షా కాలం అడుగిడడంతో బేంబేలెత్తుతున్నారు. గత నాలుగేళ్ళ క్రితం ఎడతెరిపిలేకుండా కురిసిన వానలకు భారీ వరదలతో చెరువులకు గండ్లు పడి వంపు ప్రాంతాలన్నీ చాలా రోజులు నీటి ముంపులో కాలం వెల్లదీశాయి. ఆ సమయంలో అప్పటి పాలకులు వరద ముంపుకు శాశ్వత పరిష్కారానికి ఎస్‌ఎన్‌డీపీ (స్ట్రాటెజిక్‌ నాలా డెవలప్‌మెంట్‌ ఫోగ్రామ్‌) ద్వారా రూ. 110 కోట్ల భారీ వ్యయంతో స్ట్రామ్‌ వాటర్‌ డ్రైన్‌ లైన్‌ నిర్మాణం చేపడతామని ప్రకటించి ప్రాజెక్ట్‌ పనులను ప్రారంభించారు. ఎస్‌ఎన్‌డీపీ పనులు  ఏడాది లోనే పూర్తి చేసి వరద ముంపుకు శాశ్వత ముగింపు పలుకుతామని హామీలు గుప్పించినా నేటికీ తూతూ మంత్రంగానే పనులు జరగడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా పరిస్థితి కొనసాగుతుంది. గత నాలుగేళ్ళ క్రితం కురిసిన భారీ వర్షాలతో పీర్జాదిగూడ, బోడుప్పల్‌లోని పలు లోతట్టు ప్రాంతాలు రోజుల తరబడి జలదిగ్భందలో ఉండిపో యాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ పథకం ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాకపోవడంతో లోతట్టు ప్రాంతాల నివాసితులు తీవ్ర ఆందోళనకు గురవుతు న్నారు. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచు కొస్తుందోననే భీతితో క్షణమొక యుగంలా గడుపుతున్నారు.

ఈ ప్రాజెక్ట్‌ పూర్తయితే జంట కార్పొరేషన్ల లోతట్టు ప్రంతాల నివాసితులతో పాటు మరింత అభివృద్ధికి ఆస్కారముంటుందని ఆశించిన వారికి భంగపాటే ఎదురయ్యింది. వరదలు వొచ్చి తమ ప్రాంతాలు నీట మునిగినప్పుడు నాయకులు, ప్రజాప్రతినిధులు హడావుడి చేసి ఫోటోలకు ఫోజులివ్వడం తరువాత అది మరుగు పరచడం షరా మామూలే అన్నట్లుగా ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలు ఎదుర్కుంటున్న సమస్య తీవ్రత గుర్తించి పనులు ఆఘమేఘాలపై కొనసాగించాలనే తాపత్రయం, చిత్తశుద్ధి కలిగిన నాయకులు ఏ ఒక్కరూ అగుపడడం లేదంటూ స్థానికులు ఆగ్రహం చేస్తున్నారు. అధికార కాంగ్రెస్‌ పార్టీ స్థానిక నాయకులు ఇటీవల ఎస్‌ఎన్‌డీపీ పనుల పునరుద్ధరణ కోసం ఆందోళనలు, నిరసనలు చేయడం కొసమెరుపు. అయితే అధికార పార్టీ నాయకుల నిరసనలపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకులు నిరసనలు వ్యక్తం చేయడం సబబుగా లేదని, వీటి కంటే ప్రభుత్వ పాలకులతో పనుల పునరుద్ధరణ, పూర్తి కోసం యత్నించాలని పలువురు సూచిస్తున్నారు. స్ట్రామ్‌ వాటర్‌ డ్రైన్‌ లైన్ల పనులు పూర్తి చేస్తే తమ కెంతో ఊరట కలుగుతుందని లోతట్టు కాలనీల ప్రజలు ఈ పనుల పురోగతి కోసం కళ్ళల్లో వత్తులు వేసుకుని నిరీక్షిస్తున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక పాలకమండళ్లు మాత్రం పట్టింపులేని ధోరణితో తమ పదవులు కాపాడుకోవడంలోనే కాలం వెచ్చిస్తున్నాయని పలువురు నిరసన  వ్యక్తం చేస్తూ మండిపడుతున్నారు.

చిరు జల్లులకే చెరువులను తలపిస్త్తున్న ప్రాంతాలు..!
పీర్జాదిగూడ, బోడుప్పల్‌ జంట బల్ధియాల్లోని లోతట్టు ప్రాంతాలు తేలికపాటి చిరు జల్లులకే రోడ్లపై నీరు నిలిచిపోయి చెరువులు, కుంటలు, కాలువలను తలపిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో అడపాదడపా కురిసిన జల్లులతో నీరు బయటకు పోకుండా ఎక్కడికక్కడ రోజుల తరబడి నిలిచిపోయి మురుగు గుంటలుగా మారుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లప్పుడు ఎన్నో హామీలు గుప్పించే నాయకులు అటు తరువాత అగుపడరంటూ మండిపడుతున్నారు. పీర్జాదిగూడలో రామ్‌నగర్‌ కాలనీ, ఆర్టీసీ కాలనీ, ఆదర్శనగర్‌, వినాయకనగర్‌, భవానీకాలనీ, విష్ణుపురి, లేక్‌వ్యూ కాలనీ, పంచవటి కాలనీ, విహారిక కాలనీ, శంకర్‌ నగర్‌, బుద్దానగర్‌, మల్లిఖార్జున నగర్‌లు ఉండగా, బోడుప్పల్‌లో ఎంఎల్‌ఆర్‌ కాలనీ, అరవింద నగర్‌, క్రాంతి కాలనీ, కాకతీయనగర్‌, సత్తిరెడ్డి కాలనీ, జ్యోతినగర్‌, వాసవీనగర్‌, మల్లయ్య నగర్‌, సాయిభవాని నగర్‌, అక్షయనగర్‌, 8రాఘవేంద్రనగర్‌, ద్వారకానగర్‌, భీంరెడ్డి నగర్‌, ఎన్‌ఐఎన్‌ కాలనీ, శ్రీ లక్ష్మి నగర్‌, శివపురి కాలనీ, మారుతీనగర్‌, పెంటారెడ్డి కాలనీ, మాన్‌సాని కాలనీ, ఎస్‌బీఆర్‌ తదితర కాలనీలకు ప్రతి ఏటా వరద నీటి కష్టాలు తప్పడం లేదు. ఇళ్లల్లోకి నీరు చేరి బయటకు రాలేని దుస్థితి ఎదురవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తేలికపాటి వర్షాలకే రోడ్లన్నీ జలమయమై వాహనాలు నడపలేని పరిస్థితి నెలకొంటుందని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వర్షా కాలం ప్రవేశించడంతో లోతట్టు ప్రాంతాల నివాసితులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వొస్తుంది.

రాజకీయ అనిశ్చితితో పనులపై దృష్టి సారించని పాలకులు..!
పీర్జాదిగూడ, బోడుప్పల్‌ జంట మున్సిపల్‌ కార్పొరేషన్లలో వరుస ఎన్నికలు, రాజకీయ అనిశ్చితి కారణంగా పాలకులు అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించలేక పోతున్నారు. గత ఏడేనిమిది నెలల నుంచి అసెంబ్లీ ఎన్నికలు, ఆ తరువాత లోక్‌సభ ఎన్నికలతో రాజకీయ నాయకులు, అధికారులు బిజీ అయ్యి పనుల పురోగతిపై దృష్టి సారించకపోవడంతో ఎస్‌ఎన్‌డీపీ పనులు అటకెక్కాయని విమర్శలు వెలువడుతున్నాయి. అంతే గాకుండా రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ సర్కార్‌ స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టడంతో ఆ నాయకులు స్థానిక పాలకమండళ్ల మేయర్‌ పీఠాలు చేజిక్కుంచుకునే పనిలో వ్యూహాల రూపకల్పనలో తలమునకలయ్యారు. మేయర్‌. డిప్యూటీ మేయర్‌ పదవులను హస్తగతం చేసుకోవాలనే ఆరాటంలో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టడం.

దానిని ఎదుర్కునేందుకు వైరి పక్షం తమదైన ప్రతి వ్యూహలతో ఎత్తులు, పై ఎత్తులతో పావులు కదపడంలోనే మునిగిపోయాయి. వీటిని ఎదుర్కునేందుకు ఓ వర్గం.. నిలిపివేసేందుకు మరో వర్గం న్యాయ స్థానాల తలుపు తట్టడం వంటి ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అవిశ్వాస తీర్మానాలపై బల నిరూపణ జరగాల్సి ఉన్నా వాటిని మళ్లీ వాయిదా వేయించడం లాంటి పరిస్థితులతో నేటికీ ఈ నగరాల్లో రాజకీయ అనిశ్చితి వీడడం లేదు. నెలల తరబడి నుంచి నెలకొన్న అనిశ్చితితో అభివృద్ది తిరోగమన దిశలో పయనిస్తుందని పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా సమస్యల పరిష్కారం లేక, అభివృద్ది పనులు కొనసాగక ఎక్కడిక్కడ పనులు నిలిచిపోయాయని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇరు పార్టీల నాయకులకు పదవులపై ఉన్న ధ్యాస  సమస్యల పరిష్కారంపై లేకపోవడం దారుణమని పలువురు అభ్యంతరం తెలుపుతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు జంట బల్ధియాల్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులకు ముగింపు పలికి అభివృద్ధి పనుల కొనసాగింపుపై, ప్రజా సమస్యల పరిష్కారంపై శ్రద్ధ చూపాలని సూచిస్తున్నారు.

ఈ ప్రభుత్వమైనా పూర్తి చేస్తుందా..?
వరద ముంపుకు శాశ్వత పరిష్కారం చూపేందుకు గత ప్రభుత్వం ఎస్‌ఎన్‌డీపీ ద్వారా రూ. 110 కోట్ల వ్యయంతో జంట బల్ధియాల్లో స్ట్రామ్‌ వాటర్‌ డ్రైన్‌ లైన్‌ ఏర్పాటు భారీ ప్రాజెక్ట్‌ను మంజూరీ చేసింది. ఈ ప్రాజెక్ట్‌ పనులు వొచ్చే వర్షా కాలంలోపు పూర్తి అవుతాయని, ఇక వరద కష్టాలు కలలో కూడా ఉండవని ప్రజలకు అప్పట్లో ఊరట కల్పించారు. అయితే ఆరంభం శూరత్వం..ఆనక చిరునామా మాయం..అన్నట్లుగా తొలినాళ్ళలో పనులు చకచక మొదలైనా మధ్యలో చాలా కాలం బ్రేక్‌ పడిరది. అటు తరువాత కొంత కదలిక వొచ్చినా.. కొద్ది నెలల నుంచి ఆ పనులు మళ్ళీ స్తంబించిపోయాయి. పాలకులు ఈ వర్షా కాలం, ఆ వర్షా కాలం అంటూ సాగదీయడమే తప్ప స్ట్రామ్‌ వాటర్‌ డ్రైన్‌ పనులు సజావుగా సాగిన దాఖలాలు లేవని ప్రజలు మండిపడుతున్నారు. హైదరాబాద్‌, శివార్లను విశ్వనగరంగా మారుస్తామని, మెట్రోపాలిటన్‌ సిటీగా రూపొందిస్తామని ప్రస్తుత సర్కార్‌ చెబుతున్నా సమస్యలు మాత్రం ఎక్కడికక్కడ తిష్ట వేసి ఉన్నాయి. జంట మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఏకధాటిగా వర్షాలు కురిస్తే వరద ముంపు బాధలు తమకు ఇంకెన్నడు తప్పుతాయని స్థానికులు నిలదీస్తున్నారు. ఎస్‌ఎన్‌డీపీ పనుల పునరుద్ధరణపై ప్రస్తుత ప్రభుత్వం దృష్టి సారించాలని, అత్యవసర పనుల కింద గుర్తించి స్ట్రామ్‌ వాటర్‌ డ్రైన్‌ లైన్‌ పూర్తి చేయించి తమను వరద ముంపు కష్టాల నుంచి గట్టెక్కించాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *