ఎవరెన్ని ట్రిక్కులు చేసినా బీఆర్‌ఎస్‌ ‌హ్యాట్రిక్‌ ‌ఖాయం

  • కాంగ్రెస్‌ ‌వాళ్లవన్నీ ఉత్తిత్తి డిక్లరేషన్‌లు
  • దళితులు, గిరిజనుల వెనుకబాటు తనానికి కాంగ్రెసే కారణం
  • రాష్ట్ర మంత్రి హరీష్‌ ‌రావు
  • బిఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అభిలాష్‌ ‌రావు, ఇతర నాయకులు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 28 : ‌రాష్ట్రంలో ఏమూలకు పోయినా, ఎవ్వరిని అడిగినా మళ్లా వొచ్చేది బిఆర్‌ఎస్‌ ‌సర్కారని అంటున్నారని, ఇందులో ఎవ్వరికి అనుమానం లేదని, ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్కు కొట్టేది బిఆర్‌ఎసేనని మంత్రి హరీష్‌ ‌రావు ధీమా వ్యక్తం చేసారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మంత్రి సమక్షంలో సోమవారం కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అభిలాష్‌ ‌రావు, ఇతర నాయకులు బిఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్‌ ‌రావు మాట్లాడుతూ..కానే కాదన్న తెలంగాణను సాధించి చూపెట్టింది, రైతు బంధు, రైతు బీమా ఇలా అనేక కార్యక్రమాలు అమలు చేసింది, ప్రతి ఇంటికి నల్లా పెట్టి నీళ్లు ఇచ్చి చూపింది, ఇలా చెప్పిన ప్రతి మాట సిఎం కెసిఆర్‌ ‌నిలబుట్టుకున్నారని అన్నారు. నాగర్‌ ‌కర్నూల్‌కు మెడికల్‌ ‌కాలేజీ వొస్తుందని కలలో కూడా అనుకోలేదని, ఒక్క ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లాకు 5 మెడికల్‌ ‌కాలేజీలు వొచ్చాయని తెలిపారు. కల్వకుర్తి ప్రాజెక్టుకు కాంగ్రెస్‌ ‌వాళ్లు కొబ్బరి కాయలు కొడితే తెలుగు దేశం వాళ్లు మొక్కలు నాటారని, తెలుగుదేశం వాళ్లు కొబ్బరికాయలు కొడితే ఆ శిలాఫలకాల దగ్గర కాంగ్రెస్‌ ‌వాళ్లు మొక్కలు నాటారు కానీ నీళ్లు మాత్రం రాలేదని మంత్రి హరీష్‌ ‌రావు ఎద్దేవా చేశారు.

ప్రాజెక్టును పూర్తి చేసి మూడున్నర లక్షల ఎకరాలకు నీల్లు ఇచ్చింది బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం మాత్రమేనన్నారు. కాంగ్రెస్‌ ‌పాలనలో తాగడానికి నీళ్లు లేవు, రోడ్లు లేవని, కల్వకుర్తికి వంద పడకల హాస్పిటల్‌ ‌వొచ్చిందంటే కేసీఆర్‌ ‌వల్లేనని, శ్రీశైలం ముంపు బాధితులకు జీవో కూడా తమ వల్లే వొచ్చిందని అన్నారు. కాంగ్రెస్‌ ‌వాళ్లవన్నీ ఉత్తిత్తి డిక్లరేషన్‌లని, ఎందుకు పనికిరాని డిక్లరేషన్‌లని అన్నారు మంత్రి హరీష్‌ ‌రావు. కర్ణాటకలో గెలిచి అక్కడ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని, ఖర్గే తన సొంత రాష్ట్రం కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అన్నారు. ఎలాగో అధికారంలోకి రామని ఇష్టం వొచ్చినట్లు వాగ్ధానాలు ఇస్తున్నారని మంత్రి హరీష్‌ ‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్‌ 2009 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవి ఒక్కటి అమలు చేయలేదని, తండాలు గ్రామపంచాయతీలు అన్నారని, 9 గంటల కరెంట్‌ ‌పగటి పూట ఇస్తం అన్నరని, సిలిండర్‌ ‌ధర తగ్గిస్తం అన్నరని కానీ అవేవీ కాంగ్రెస్‌ ‌పార్టీ అమలు చేయలేదని ఆరోపించారు హరీష్‌ ‌రావు.

కేసీఆర్‌  ‌మేనిఫెస్టోలో చెప్పకపోయినా ప్రజలకు ఏమి కావలో చేసే నాయకుడని అన్నారు. కల్యాణ లక్ష్మీ, బీడీ కార్మికులకు పింఛన్‌, ‌మిషన్‌ ‌భగీరథ, రైతు బంధు, రైతు బీమా..ఇలా చెప్పనివి అనేకం అమలు చేశారన్నారు. కొల్లాపూర్‌ అభివృద్ధి బిఆర్‌ఎస్‌ ‌పార్టీ వల్లనే సాధ్యమని, పాలమూరు ఎత్తిపోతల పథకం త్వరలో ప్రారంభించబోతున్నామని, నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లా సస్యశామలం అవుతుందని హరీష్‌ ‌రావు ఈ సందర్భంగా తెలిపారు. దళితులు, గిరిజనుల మీద ప్రేమ ఉన్నట్లు కాంగ్రెస్‌ ‌నటిస్తున్నదని, అసలు వారి వెనుకబాటుతనానికి కారణమే కాంగ్రెస్‌ ‌పార్టీ అని ఆరోపించారు. అంబేద్కర్‌ను ఓడించిన పార్టీ కాంగ్రెస్‌ అని, చనిపోయిన తర్వాత కూడా భారత రత్న ఇవ్వని పార్టీ అని, బాబుజగజ్జీవన్‌ ‌ప్రధాని కాకుండా అడ్డుకున్న పార్టీ కాంగ్రెస్‌ అని, అలాంటి పార్టీముసలి కన్నీరు కాంగ్రెస్‌ ‌కారుస్తున్నదని ఆరోపించారు. కెసిఆర్‌ ‌దళితుల కోసం వైన్స్, ‌కాంట్రాక్టులు, ప్రభుత్వ పనుల్లో రిజర్వేషన్లు తెచ్చారని, దళిత బంధు వంటి అద్భుతమైన పథకం ప్రారంభించారని, తండాలు పంచాయతీలు చేశారని, గిరిజనుల కోసం 10 శాతం రిజర్వేషన్లు అమలు చేశారని అన్నారు.

గంటలకు ఎకరం పారుతుందట, మూడు గంటలు ఇస్తే మూడు గంటలు పారుతుందని రేవంత్‌ ‌రెడ్డి అంటున్నడని, ఆనాడు ఉచిత కరెంట్‌ అని ఉత్త కరెంట్‌ ‌చేశారని, రాజశేఖర్‌ ‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ఉన్నప్పుడు కరెంట్‌ ‌కష్టాలు ఉన్నాయని, వాళ్లు నిరంతర కరెంట్‌ ఎట్ల సాధ్యమైతదన్నరని, కానీ చేసి చూపింది కేసీఆర్‌ అని అన్నారు హరీష్‌ ‌రావు. రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంట్‌ ఇలా సీఎం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, అందరూ కష్టపడి హర్షవర్ధన్‌ను గెలిపించి, బీఆర్‌ఎస్‌ ‌పార్టీని బలోపేతం చేయాలని ఆయన పార్టీ క్యాడర్‌కు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు అయ్యాక కాదు, ఎన్నికల ముందు కూడా విజయోత్సవ ర్యాలీకి తాను వొస్తానని, మహబూబ్‌ ‌నగర్‌లో 14కు 14 గెలిచి చూపిద్దామని క్యాడర్‌లో జోష్‌ ‌నింపారు.

పాలమూరు నాడు వలసల జిల్లా అని, కానీ ఇప్పుడు వలసలు వాపస్‌ అయ్యాయన్నారు. పచ్చదనం పరుచుకున్నదని, నాడు వ్యవసాయ కూలీలు లేని పరిస్థితి నుంచి నేడు ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు పనుల కోసం ఇక్కడికి వొస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీ రైతులకు శ్రీరామ రక్ష అని, తెలంగాణ తరహా పథకాలు కావాలని ఇతర రాష్ట్రాల వారు కోరుతున్నారని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శమని,  తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో వంద ఎకరాలు వొస్తయని చంద్రబాబు అన్నడని హరీష్‌ ‌రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌ ‌రైతు గౌరవం పెంచారని, తద్వారా రైతు చేతిలో ఉన్న భూమి పెరిగిందని, రైతు గౌరవం పెంచిన కేసీఆర్‌ ‌నాయకత్వం బలోపేతం చేయాతని హరీష్‌ ‌రావు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *