ఎ‌ర్రజెండా ఉనికి ప్రశ్నార్థకం కానుందా..

తన జీవితకాలంలో భారతదేశానికి రానటువంటి కార్ల్ ‌మార్కస్ ‌కి అర్థమైనటువంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థ నేటి కమ్యూనిస్టు నాయకత్వానికి ఎందుకు అర్థంకాట్లేదో ఎవ్వరికీ అంతు చిక్కట్లేదు. అసలు ఈ ఎర్రజెండాల పార్టీల పయనం ఎటువైపు? క్షీణిస్తున్న ఎర్రజెండా అస్థిత్వానికి మునుగోడు ఉపఎన్నిక ఎడారిలో ఎండమావి లాంటిది. ఒకప్పుడు మునుగోడు గడ్డ ఎర్రజెండా అడ్డ. ఏ ఊరు గడప తొక్కినా మన నుదిట సింధూరం దిద్దే ఎర్రస్థూపాలు దర్శనమిస్తాయి.

ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఐదుసార్లు ప్రజలు ఎర్రజెండాను నమ్మారంటే మునుగోడు ప్రజలకు ఎరుపంటే ఎంతమక్కువో అర్థమవుతుంది. నల్లగొండ జిల్లా అంటేనే పోరాటాల ఖిల్లా, అలాంటి ఉద్యమాల గడ్డకి నిలువెత్తు రూపం రాచకొండ. కమ్యూనిస్టుల కంచుకోట అయిన రాచకొండ ఎర్రజెండా పార్టీలకు ఎప్పటికీ అండదండ. కమ్యూనిస్టు పార్టీలంటేనే సిద్దాంతాలు. అంతటి మహోన్నతమైన సిద్దాంతాలున్న పార్టీలు, నేడు వాటినే ఎందుకు విస్మరిస్తున్నాయి. ప్రజలలో సిద్దాంతాల మీద నమ్మకాలు పోయాయా లేదా నాయకత్వం మీద నమ్మకం పోయిందా అర్థంకాని పరిస్థితి. మునుగోడులో అధికార పార్టీకి మద్దతు తెలపడం వెనుక అంతర్యం ఏంటి. బలంగా ఉన్న దగ్గరే ఉనికిని చాటుకోకపోతే ఎర్రజెండా భవిష్యత్తే ప్రశ్నార్థకం కానుందా.

ఐదుసార్లు గెలిచిన దగ్గరనే ఒంటరిగా పోటీచేయకపోతే మిగతా స్థానాల పరిస్థితి ఏంటి. ఈ నిర్ణయాలతో ఎర్రజెండా పార్టీల భవిష్యత్తు ఎటువైపు అనేది తననే నమ్ముకున్న క్యాడర్‌ ‌కి తెలియజేయాల్సిన భాద్యత నాయకత్వంపై ఉన్నది. ఓ కమ్యూనిస్టు నాయకులారా దయచేసి మీ ఉనికిని ప్రశ్నార్థకం కానీయకండి. నమ్ముకున్న సిద్దాంతాలను నట్టేట్లో ముంచకండి. బూర్జువా పార్టీలకు అమ్ముడుపోయి ఎర్రజెండాను నమ్ముకున్న వారి గొంతుకొయ్యకండి. ఇప్పటికైనా మీ అస్థిత్వాన్ని కాపాడుకోండి. పేదోల్లకు అండదండగా ఉండేది ఎప్పటికైనా ఎర్రజెండానే!
శ్రీకాంత్‌ ‌చెర్వుగట్టు, 91 9491533693
   B.tech.,  M.A Political Science., (LLB- Kakatiya    University)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *