ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగ్గిన పోలింగ్‌ శాతం

  • వోటు వేసేందుకు పట్టభద్రుల వెనుకడుగు..
  • అధికారుల్లో లోపించిన చిత్తశుద్ధి ..
  • ప్రజాప్రతినిధులు, సీనియర్‌ నాయకుల్లో నిస్తేజం..  
  • ఠారెత్తిన ఎండలు, దూరంగా పోలింగ్‌ కేంద్రాలు..
  • రిజిస్ట్రేషన్‌, రెన్యూవల్‌పై ప్రజల్లో అవగాహన లేమి..
  • పోలింగ్‌ శాతం తగ్గడానికి కారణాలు అనేకం..

వరంగల్‌, ప్రజాతంత్ర, మే 28 : తెలంగాణ గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి పోలింగ్‌ శాతం భారీగా తగ్గిపోయింది. పట్టభద్రులు వోటేసేందుకు వెనకడుగు వేశారు. దీంతో ఊహించని విధంగా పోలింగ్‌ శాతం తగ్గడం అభ్యర్థులను కలవరపెడుతోంది. ప్రజాస్వామ్య పరిరక్షణలో వోటు హక్కు చాలా కీలకమంటూ ప్రచారం చేసే ప్రజాప్రతినిధులే వోటు వేసేందుకు దూరంగా ఉన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని సీనియర్‌ ప్రజాప్రతినిధులు వోటు హక్కును వినియోగించుకోక పోవడం విమర్శలకు తావిస్తోంది. చిన్నాచితక నాయకులైతే ఎవరు పట్టించుకోరు.. కానీ మంత్రి,  ఎంపీ, ఎమ్మెల్యే  స్థాయి నేతలు  ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉప ఎన్నికలకు దూరంగా ఉండడం చర్చనీయాం శంగా మారింది. ఎమ్మెల్సీ పట్టబద్రుల ఉప ఎన్నికకు దూరంగా ఉన్న ఆ నేతలు ఎవరనేదానిపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో చాలామంది రాజకీయ ప్రముఖులు దూరంగా ఉన్నారు.  తమ వోటు హక్కును వినియోగించుకోలేదు. కొందరైతే కనీసం వోటరు నమోదు చేసుకోకపోవడం గమనార్హం. వోటు హక్కుకు దూరంగా ఉంది సాదాసీదా నాయకులు అయితే ఎవరూ పెద్దగా పట్టించుకోరు..

కానీ  మంత్రులుగా పనిచేస్తున్న ప్రజాప్రతినిధుల కుటుంబాలు కూడా  వోటుకు దూరంగా ఉండటం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో హాట్‌ టాపిక్‌ గా మారింది.. వోటుకు ప్రాధాన్యతను జనానికి చాటి చెప్పడంలో ముందుండే నాయకులు వారు వోటు  విషయాన్ని మాత్రం మరువడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ములుగు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సీతక్క ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన వోటు హక్కు వినియోగించుకోలేదు. ఆమె ఈసారి ఉప ఎన్నికల్లో వోటు వేయకపోవడానికి కారణం అమె వోటు నమోదు చేసుకోకపోవడమేనని ఆమె సన్నిహిత వర్గాల నుంచి వార్తలు వినిపించాయి. సీతక్క కనీసం పట్టభద్రుల వోటు హక్కు వినియోగించుకునేందుకు వోటును నమోదు చేసుకోకపోవడం ఇప్పుడు విమర్శలకు తావిస్తున్నాయి. పీహెచ్‌ డీ  పూర్తి చేసిన సీతక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు వోటు హక్కును వినియోగించుకోవాలని తరచూ ప్రజలకు సీతక్క సూచిస్తుంటారు. అయితే తను మాత్రం తన వోటు హక్కు వినియోగించుకోలేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి మరో మంత్రిగా వ్యవహరిస్తున్న కొండా సురేఖ కుటుంబ సభ్యులు సైతం ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నారు.  ప్రచారంలో ఓ మోస్తరుగా పాల్గొన్న వారు.. వోటు వేయడానికి మాత్రం ఉత్సాహం చూపలేకపోయారు.  అనారోగ్యం కారణంతో కొండా దంపతులు వోటు వేయలేదని వారి సన్నిహితులు చెబుతున్నారు.

ఏది ఏమైనా కొండా సురేఖ కుటుంబ సభ్యులు వోటు వినియోగిం చుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఒక వారం రోజుల క్రితం వరకు ప్రజలందరినీ జాగృతం చేస్తూ  అందరూ కచ్చితంగా తమ వోటు హక్కు వినియోగించుకోవాలంటు ప్రచారం చేసిన ఎంపీ అభ్యర్థులు మాలోతు కవిత. కడియం  కావ్య.. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు దూరంగా ఉన్నారు.  మహబూబాబాద్‌ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన కవిత ఈసారి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తన వోటుకు వినియోగించుకోలేదు.  ఇక వరంగల్‌ పార్లమెంట్‌ నుంచి బరిలో నిలిచిన కడియం కావ్య కుటుంబ సభ్యులు సైతం ఈ ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు దూరంగా ఉన్నారు.  పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా ప్రజాప్రతినిధులు అందరితోటి ప్రచారం చేపించుకున్న కడియం కావ్య ఎమ్మెల్సీ ఉప ఎన్నికల వోటింగ్‌ వచ్చేసరికి ఆమె అందుబాటులో లేకుండాపోయారు. కుటుంబ సభ్యులతో కలిసి టూర్‌ కి వెళ్లడం వల్ల ఉపఎన్నికల్లో వోటు వేయలేకపోయారు. అయితే  కడియం శ్రీహరి మాత్రం వోటు వేశారు. కడియం కావ్య ఆమె భర్త ఇద్దరు కూడా ఎన్నికలకు దూరంగానే ఉండిపోయారు. బీఆర్‌ఎస్‌ మహబూబాబాద్‌ జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న సిట్టింగ్‌ ఎంపీ కవిత సైతం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తన వోటు హక్కు వినియోగించుకోలేదు. ఎంపీ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో పాల్గొన్న నేపథ్యంలో చాలా రోజులు కుటుంబానికి దూరంగా ఉన్నారంటూ ఎన్నికల పూర్తికాగానే కవిత సైతం కుటుంబ సభ్యులతో టూర్‌ కి వెళ్ళిపోయారని సమాచారం.

నిజానికి జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న కవిత ప్రజలకు, స్థానిక నేతలను సమన్వయపరిచి వోటింగ్‌ శాతం పెంచాల్సి ఉంది. కానీ తానే వోటు హక్కు వినియోగించుకోకుండా దూరంగా ఉండడం విమర్శలకు తావిస్తోంది..ఇక మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య సైతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో వోటు వేయలేదు. గతంలో నమోదు చేసుకున్న వోటు ఓకే ఉంటుందని భావించిన రాజయ్య.. మరోసారి దాని రెన్యూవల్‌ చేసుకోక పోవడం వల్ల వోటు వేయలేకపోయారని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోం ది.. వరంగల్‌ ఈస్ట్‌ నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న బస్వరాజు సారయ్య, మేయర్‌ గుండు సుధారాణి.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు దూరంగా ఉండడం విమర్శలకు తావిస్తోంది. ఇక పార్లమెంట్‌ ఎన్నికల బిజీలో పడిన కొందరు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా వోటు హక్కు నమోదు చేయించుకోలేదు.  దీంతో తమ వోటు హక్కు వినియోగించుకోకుండా దూరంగా ఉండాల్సి వచ్చింది.

తగ్గిన పోలింగ్‌ శాతం
2021లో పట్టభద్రుల ఎన్నికలు జరగగా 5 లక్షల 5వేల 565 ఓటర్లకు గాను 3 లక్షల 87 వేల 989 మంది గ్రాడ్యుయేట్స్‌ వారి వోటు హక్కు వినియోగించుకున్నారు. అప్పుడు 76.73శాతం పోలింగ్‌ నమోదైంది. ఈసారి సాయంత్రం 4 గంటల వరకు కేవలం 68.65 శాతం పోలింగ్‌ నమోదైంది. 4 గంటల్లోపు క్యూలైన్లలో నిల్చున్న వారికి వోటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఈసారి మొత్తంగా పోలింగ్‌ పర్సంటేజ్‌ 72.37 % నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి 12 వేల 806 వోట్ల మెజారిటీతో గెలుపొందారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ శాసనసభ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈసారి ఉప ఎన్నికల్లో కొత్తగా మళ్లీ పట్టభద్రుడు వోటు నమోదు చేసుకోవాలని సూచించిన నేపథ్యంలో గతంలో కంటే తక్కువ మంది 4 లక్షల 63 వేల 839 మంది పట్టభద్రులు వోటరు నమోదు చేసుకున్నారు.

అటు పోలింగ్‌ విషయంలో చేతులెత్తేశారు. ఇక పార్లమెంట్‌ ఎన్నికల బిజీలో పడ్డ కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఓటు హక్కు నమోదు చేయించుకోలేదు. వేసవి ఎండలు దంచికొట్టడం, పోలింగ్‌ కేంద్రాలు దూరంగా ఉండడం కూడా పోలింగ్‌ శాతం తగ్గడానికి కారణమని చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 605 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ పక్రియ కొనసాగింది. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *