- రూ.40 లక్షలు మించవద్దు
- జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 11: ఎన్నికల వ్యయం పరిశీలన కోసం ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు పక్కాగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి సి. నారాయణ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ లు, ఫ్లయింగ్ స్క్వాడ్, ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి, వి ఎస్ టి, వ్యయ పరిశీలన టీంలకు మాస్టర్ ట్రేనీలతో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ఎన్నికల విధుల నిర్వహణ సక్రమంగా జరగాలంటే క్రింది స్థాయి నుండి అందరూ బాగా పని చేయాలని సూచించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎక్కడ కూడా అనుమతులు పొందకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లు, గోడ రాతలను గుర్తించి తొలగించాలన్నారు.
ఎన్నికల ప్రవర్తన నియమావలికి విరుద్ధంగా ర్యాలీలు నిర్వహించడం, అక్రమంగా డబ్బులు, మద్యం తరలించడం ఇలాంటి చర్యలు చేపట్టకుండా తక్షణ చర్యలు చేపడుతూ ఉండాలన్నారు. ప్రతిరోజు వార్త పత్రికలలు, టీవీలలో వచ్చే ప్రకటనలను పరిశీలిస్తూ, అనుమతులు లేని వాటిపై ఖర్చులను నమోదు చేయాలన్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్, సోషల్ మీడియాలను కూడా పరిశీలించాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా ఎలాంటి కార్యక్రమాలు జరగకుండా సమస్యలను సామరస్యంగా పరిష్కరించెందుకు టీంలు కృషి చేయాలన్నారు. సి – విజిల్ యాప్ ద్వారా లైవ్ ఫోటోలు, వీడియోల ద్వారా నేరుగా ఫిర్యాదులు చేసినట్లయితే వెంటనే చర్యలు చేపట్టవచ్చున్నారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులు – లోకల్ టీవీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం
జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తన నియమావళి తూ.చా తప్పకుండా పాటించాలని సూచించారు. ఎన్నికల ఖర్చులను నిషితంగా పరిశీలన జరిగేందుకు ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.శాసనసభకు పోటీ చేసే అభ్యర్థి రూ. 40 లక్షలకు మించరాదని అన్నారు. టీవీలలో, వార్తా పత్రికలలో ప్రకటనలు ఇచ్చేముందు ఎం సి ఎం సి ద్వారా తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలని, ప్రకటనలు రెచ్చగొట్టే విధంగా కులం మతం జాతిపై ఇవ్వరాదని, ఇతర పార్టీల వ్యక్తులపై వ్యక్తిగత దూషణలు చేయరాదని సూచించారు.ఎన్నికల నిబంధనలు ప్రకారం మాత్రమే ప్రకటనలు జారీ చేయాలని, ఈనెల తొమ్మిది నుండి వివిధ దినపత్రికలు, టీవీలలో వచ్చే వార్తలను లెక్కలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీలు నిర్వహించే వివిధ ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన రేట్ చాట్లపై చర్చించి ఫిక్స్ చేయడం జరిగింది.ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, డి ఆర్ డి ఓ కృష్ణన్, వికారాబాద్ ఆర్డీవో విజయ కుమారి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.





