- హైకోర్టు తీర్పుపై స్టేకు సుప్రీమ్ కోర్టు నిరాకరణ
- తదుపరి విచారణ 27కు వాయిదా
న్యూ దిల్లీ, ఫిబ్రవరి 17(ఆర్ఎన్ఎ) : సుప్రీమ్ కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఎమ్మెల్యేల ఎర వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను శుక్రవారం ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి సుముఖత చూపలేదు. కనీసం విచారణ పూర్తయ్యేంతవరకూ ఎవరినీ అరెస్ట్ చేయవద్దని సీబీఐకు ఆదేశాలు ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనపై కూడా సుప్రీమ్ కోర్టు స్పందించలేదు. సీబీఐను తాము కంట్రోల్ చేయలేమని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంటూ తదుపరి విచారణ ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపించేందుకు మరికొంత సమయం కావాలని కోరడంతో సుప్రీమ్ కోర్టు విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీమ్ కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడా ధర్మాసనం విచారణ జరిపింది.
తెలంగాణ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వొకేట్ దుష్యంత్ దవే.. ఈ కేసులో నిందితులపై సీరియస్ ఆరోపణలు ఉన్నాయని అయినా సిట్ దర్యాప్తు పక్కనపెట్టారని ధర్మాసనానికి విన్నవించారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్న ఆయన.. సీబీఐ, ఈడీలు కూడా రోజు లీకులిస్తున్నాయని కోర్టుకు చెప్పారు. కేసులో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ఆధారాలున్నాయని, అలాంటప్పుడు సీబీఐ వద్దకు ఎలా వెళ్తామని దవే ప్రశ్నించారు. గురువారం రాత్రి 9 గంటలకు కేసు లిస్ట్ అయినందున వాదనలకు మరింత సమయం కావాలని న్యాయస్థానాన్ని కోరారు. మరోవైపు కేసులో కీలక ఆధారాలు లీక్ చేశారన్న విషయాన్ని ప్రతివాదుల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన జస్టిస్ గవాయ్.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆధారాలను వి•డియాకే కాదు.. జడ్జీలకు పంపారని అన్నారు. ఇరు పక్షాల వాదనల అనంతరం కేసు విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు.




