ఎపిలో భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు

  • భారీగా తరలి రావడంతో సందడిగా శ్రీశైల గిరులు
  • పాతాళగంగలో పుణ్యస్నానాలు అచరించిన భక్తులు
  • శ్రీకాళహస్తిలో ఘనంగా బ్రహ్మోత్సవాలు

శ్రీశైలం, ఫిబ్రవరి 18 : ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంబికామల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. భక్తులతో శ్రీశైలం కిటకిటలాడుతోంది. శివనామస్మరణతో  ఆలయ పురవీధులు మారుమ్రోగుతున్నాయి. స్వామి దర్శనం కోసం శ్రీశైలం ఆలయానికి భక్త జనం పోటెత్తింది. ఆలయ క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి. 13 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. శ్రీశైలం ఆలయం శివనామ స్మరణతో మార్మోగిపోతోంది. పాతాళగంగలో భక్తులు పుణ్య స్నానాలచరించారు. అలాగే శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. సాయంత్రం స్వామి అమ్మవార్లకు నంది వాహన సేవ అందించారు. నంది వాహనంపై స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. అర్ధరాత్రి పాగాలంకరణ, కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. శ్రీశైలానికి 2లక్షల మంది భక్తులు వొస్తారని అధికారుల అంచనా వేశారు.

1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం శ్రీశైల పురవీధులలో గజవాహనంపై స్వామిఅమ్మవార్లకు గ్రామోత్సవం జరుగింది. శ్రీశైల పుణ్యక్షేత్రం భక్తులతో రద్దీగా మారింది. శివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామిదర్శనం చేసుకోవటానికి నల్లమల అటవీప్రాంతం నుంచి భారీగా భక్తులు తరలి రావడంతో శ్రీగిరులు భక్తులతో కోలాహలంగా మారాయి. భక్తజనం ఓంకారం నడుమ దేవదేవులకు నందిమండపం, బయలువీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం కనుల పండువగా జరిగింది. శ్రీగిరి పురవీధుల్లో పుష్పపల్లకీ సేవ అంగరంగ వైభవంగా జరిగింది. ఆదిదంపతులైన శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లు కల్యాణశోభతో ముస్తాబయ్యారు. ఆలయ ప్రాంగణంలోని అలంకారమండపంలో స్వామి అమ్మవార్లకు అర్చకులు, వేదపండితులు వేదమంత్రోచ్ఛరణ లతో విశేషపూజలు నిర్వహించారు. అనంతరం వేలాది మంది భక్తజనం నడుమ గ్రామోత్సవానికి తీసుకొచ్చారు.

ఉత్సవం ముంగిట మహిళల కోలాటాలు, వేషధారణలు, డోలు విన్యాసాలు, నందికోళ విన్యాసాలు, బుట్టబొమ్మలు వంటి సాంస్కృతిక కళారూపాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆలయ ప్రాంగణం నుంచి అడుగడుగునా ఉత్సవమూర్తులకు మంగళహారతులు ఇచ్చుకుంటూ పురవీధుల్లోకి తీసుకువొచ్చారు. గంగాధరమండపం వద్ద రంగు రంగుల పుష్పాలు, విద్యుద్దీపాలంకరణలతో ముస్తాబు చేసిన పుష్పపల్లకీలో శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అధిష్టింపజేసి అర్చకులు మంగళహారతులిచ్చారు.
శ్రీకాళహస్తిలో ఘనంగా బ్రహ్మోత్సవాలు… శివరాత్రి దర్శనాలకు తరలివచ్చిన భక్తులు శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని వేకువజామున రెండు గంటలకే సర్వదర్శనం ప్రారంభించారు.  శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తజనం పోటెత్తింది.

ఉదయం రెండు గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. ఇక సర్వదర్శనంతోపాటు రూ.50, రూ.200, రూ.500ల టికెట్లతో ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. భక్తులకు మహాలఘు దర్శనాన్ని ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. సర్వదర్శనం, రూ.50 టికెట్‌ ‌ద్వారా వెళుతున్న భక్తులకు ప్రస్తుతం దర్శనానికి రెండు గంటల పైగా సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది. స్వామి అమ్మవార్లు దర్శనంలో వీఐపీలకు పెద్దపేట వేస్తున్నారని సామాన్య భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే వేకువజామున ఒంటి గంటలకు లింగోద్భవ దర్శన ఏర్పాట్లు చేసారు. భవుడి మహా శివరాత్రి ఉత్సవాలకు శ్రీకాళహస్తి సర్వాంగసుందరంగా ముస్తాబైంది. ఇప్పటికీ ప్రధాన ఆలయాన్ని ముచ్చటైన రంగవల్లులతో తీర్చిదిద్దారు. గోపురాలకు కొత్త రంగులద్దడంతో కళకళలాడుతున్నాయి. భక్తకన్నప్ప, రామసేతు వంతెనలపైనా, పట్టణవ్యాప్తంగా ఏర్పాటు చేసిన విద్యుత్‌ ‌దీపాలంకరణలు ఆకట్టుకుంటున్నాయి. అరటిచెట్లు, మామిడాకుల పచ్చతోరణాలు, కాషాయరంగు జెండాలతో వీధులు దర్శనమిస్తున్నాయి.

తరలి వచ్చే భక్తుల కోసం ఆలయంలో చలువపందిళ్లు ఏర్పాటు చేశారు. చతుర్మాడ వీధులు, సాంస్కృతిక కార్యక్రమాల వేదికైన ధూర్జటి కళాప్రాంగణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. సన్నిధివీధిలో ఏర్పాటు చేస్తున్న కైలాసం సెట్టింగ్‌ ‌పనులు జోరందుకున్నాయి. రథాలు, నారద పుష్కరణిలోని తెప్పలను రంగులతో ముస్తాబు చేస్తున్నారు. ఉత్సవ ఏర్పాట్లు ఆలస్యం కావడంతో, ఇప్పటికీ సాంస్కృతిక కార్యక్రమాల షెడ్యూలు ఖరారు కాలేదు. అయితే పలువురు పీఠాధిపతులు, సినీనటులు, గాయకులు, కళాకారులకు ఉత్సవాలకు రావాలని అధికారులు ఆహ్వానం పంపారు.  సర్వజగత్తును పరిపాలించే.. సర్వ జగద్రక్షకుడైన సోమస్కంధమూర్తికి.. యాగరక్ష పెట్టాక పురవీధుల్లో ఊరేగింపునకు తీసుకెళ్లడం ఇక్కడి సంప్రదాయంగా వస్తోంది.

బ్రహ్మోత్సవ రోజుల్లో ఉత్సవమూర్తులతో నిర్వహించే ఊరేగింపు మహోత్సవానికి ఎంతో ప్రాభవం ఉంటుంది. అందుకే సాధారణ రోజుల వలే కాకుండా.. బ్రహ్మోత్సవ రోజుల్లో.. దేవతామూర్తులు బయటకు వెళ్లాలంటే.. ఆలయంలోని యాగశాల వద్ద నిలిపి యాగరక్ష పెట్టాక మాత్రమే బయటకు తీసుకెళ్లడం సంప్రదాయంగా వస్తోంది. ఆలయంలోని అలంకార మండపంలో ఉత్సవ అలంకరణలు పూర్తయిన శ్రీజ్ఞానప్రసూనాంబిక సమేత సోమస్కంధమూర్తి ఉత్సవమూర్తులను యాగశాల వద్ద యాగకలశాలకు రోజూ హోమాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సిద్ధం చేసిన యాగరక్షను ఉత్సవర్లకు అద్దిన తరవాత.. వీళ్లను ఊరేగింపుగా తీసుకెళ్తుంటారు. ఈ విశేషోత్సవాన్ని సందర్శించేందుకు జనం అధిక సంఖ్యలో రావడం విశేషం. ఉత్సవాలను పురస్కరించుకుని గంగాభవానీ సమేత శివయ్య దశకంఠుడిపై పురవిహారం చేస్తాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *