- పాపికొండల విహారాయాత్రను రద్దు
- బూరుగులంక రేవులో కొట్టుకుపోయిన రహదారి
- విపత్తుల నిర్వహణ సంస్థలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
అమరావతి, జూలై 20 : తెలంగాణ, ఏపీలో కురుస్తున్న వర్షాల వల్ల గోదావరి నదికి వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతుంది . దీంతో కోనసీమ జిల్లాలతో పాటు నది ప్రవాహ ప్రాంతంలో ఉన్న మండలాలకు వరద నీరు వచ్చి చేరుతుంది . ఈ కారణంగా పాపికొండల విహారయాత్రను పర్యాటక శాఖ అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు.కోనసీమ జిల్లా గోదావరి నది పాయలో పెరిగిన వరద ప్రవాహంతో పి.గన్నవరం మండలం బూరుగులంక రేవులో తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. దీంతో బూరుగులంక, ఊడిమూడిలంక, అరిగెలవారిపేట, జిపెద్దపూడిలంక ప్రాంతాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. గ్రామస్థులు పడవలతో రాకపోకలు సాగిస్తున్నారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో ఎదువాగు వంతెన నీట మునిగింది.
15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అల్లూరి జిల్లాలో భారీ వర్షాల చింతూరు-వరరామచంద్రపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు వద్ద ఉన్న శబరి నీటిమట్టం 29.5 అడుగులకు చేరుకుంది. కొండరాజపేట వద్ద రహదారిపై వరద నీరు చేరడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు.ఎగువ రాష్టాల్లో్ర భారీ వర్షాల వల్ల గోదావరి వరద ఉధృతి స్వల్పంగా పెరుగుతోంది. దీంతో ఆంధప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తమైంది. ముందస్తుగా ప్రభావిత జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ముందస్తు సహయక చర్యలకు అల్లూరికు ఎన్డీఆర్ఎఫ్, ఏలూరుకు రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. విపత్తుల నిర్వహణ సంస్థలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
అత్యవసర సహయం కోసం 24 గంటలు 1070, 18004250101 ఈ స్టేట్ కంట్రోల్ రూమ్ నంబర్లు అందుబాటులో ఉంటాయి. జిల్లాల్లో మండల స్థాయిలో కూడా అధికారులు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు. బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించడం చేయరాదని సూచించారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని ఏపీ విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు.




