సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఘట్టి నిఘా
ఎన్నికల సందర్భంగా పలు జాగ్రత్తలు
రౌడీ షీటర్లు అల్లలకు పాల్పడితే జైలుకే..
సైబరాబాద్ క్రైమ్ అడిషనల్ డీసీపీ, అసెంబ్లీ ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ జి. నరసింహారెడ్డితో ప్రజాతంత్ర ఇంటర్వ్యూ
ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 22 : కేంద్ర బలగాల పహార పటిష్టమైన బందోబస్తు.. సున్నితమైన.. సమస్యాత్మకమైన ప్రాంతాలలో ఉన్నతాధికారుల పర్యటనలు స్థానిక పోలీసులు.. ప్రజలతో ఎప్పటికప్పుడు సమాలోచనలు రాత్రి వేళల్లో తనిఖీలు పోలీసు వాహనాలతో పెట్రోలింగ్ ఏ చిన్న సమస్య వచ్చినా అప్రమత్తమవుతున్న పోలీసులు ఇదంతా ఈనెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృశ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గతంలో జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఆమనగల్లు, కడ్తాల్ సర్కిల్లో దృష్టిని కేంద్రీకరించారు. ఎన్నికల పరంగా శాంతి భద్రతల పరంగా చేపట్టాల్సిన చర్యలపై పోలీసులు ఎప్పటికప్పుడు ఆయా పోలీస్ స్టేషన్ ల సిఐ, ఎస్ఐ లతో సమావేశాలు ఏర్పాటు చేసి పలు సూచనలు సలహాలు అందిస్తున్నారు. ఎన్నికల బందోబస్తు నేపథ్యంలో సైబరాబాద్ క్రైం అదనపు డీసీపీ, స్పెషల్ ఆఫీసర్ జి. నర్సింహారెడ్డి తో ఆమనగల్లు ప్రజాతంత్ర ఇంటర్వ్యూ ముఖ్యంశాలు..
ప్రశ్న : ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు.
జవాబు : ఈనెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కల్వకుర్తి నియోజకవర్గం లోని ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి పోలీస్ స్టేషన్ ల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసిందన్నారు. ఎన్నికల నేపథ్యంలో కొన్ని సమస్యాత్మకమైన గ్రామాలపై ఇప్పటికే దృష్టి పెట్టి పోలీస్ కవాతు నిర్వహించి ప్రజలతో మాట్లాడి వారికి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. పోలీసు సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని మౌఖిక ఆదేశాలు అందయన్నారు.
ప్రశ్న : సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారా..?
జవాబు : తన పరిధిలో ఆమనగల్లు, కడ్తాల్ పోలీసు వలయాధికార్యాలయాలు ఉన్నాయని ఒక తలకొండపల్లి పోలీస్ స్టేషన్ ఉన్నాయన్నారు. ఇప్పటికే సమస్యత్మక పోలింగ్ కేంద్రాలు, గ్రామాలు గుర్తించడం జరిగిందని.. ఆమనగల్లులో జంగారెడ్డిపల్లి, మంగళపల్లి, ఆకుతోటపల్లి, శెట్టిపల్లి, ఆమనగల్లు మున్సిపాలిటీ, కడ్తాలలో మైసిగండి, ఎక్కువాయిపల్లి, పల్లె చెల్క తండా, సాలార్పూర్, కడ్తాల, తలకొండపల్లిలో జూలపల్లి, రాంపూర్, గట్టిప్పల పల్లి, తలకొండపల్లి ఇలాంటి కేంద్రాల వద్ద అదనపు బలగాల ద్వారా బందోబస్తు ఏర్పాటు చేస్తాం..
ప్రశ్న : ఊరేగింపులు ర్యాలీలు బహిరంగ సభల నిర్వహణ వాటి అనుమతులు వాటి బందోబస్తును ఎలా చేపడుతున్నారు…
జవాబు : ఆయా పార్టీలు రాజకీయ నాయకులు ర్యాలీలు బహిరంగ సభలు నిర్వహించే ముందు ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) ద్వారా అనుమతులు తీసుకుంటారు. ర్యాలీ బహిరంగ సభలు జరిగే ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం.. అలాగే స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఎన్నికల నియామ నిబంధనలు ఉల్లంఘన పాల్పడిన రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలపై కేసు నమోదు చేస్తాం…
ప్రశ్న : మీ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లో రాత్రి పహారా తనిఖీలు చేస్తున్నారా…?
జవాబు : తన పరిధిలోని ప్రతి ఠాణా లో అదనపు బలగాలను సిద్ధం చేసి వీరిని రాత్రి వేళల్లో గస్తీకి వినియోగించుకుంటున్నాం.. ఇందు కోసం తాత్కాలిక చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. దీంతో పాటు పలు సమస్యాత్మక గ్రామాలలో సిఐఎస్ఎఫ్ బలగాలతో కవాతు నిర్వహించాము. పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కడ్తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టోల్ ప్లాజా వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఆయా గ్రామాలలోని ప్రధాన రహదారులపై రాత్రి వేళల్లో వాహనాల తనిఖీ చేపట్టాం.. ఎక్కడ ఎలాంటి అనుమానం వచ్చినా ప్రత్యేక బృందాలను అక్కడికి పంపించి చర్యలు తీసుకుంటున్నాం..
ప్రశ్న : ఏవైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చా..?
జవాబు : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు నేరుగా తన సెల్ ఫోన్ నెంబర్ 9490612459 కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.. డబ్బు మద్యం పంపిణీ చేసిన.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన తనకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చునని అదనపు డీసీపీ నర్సింహారెడ్డి తెలిపారు.
ప్రశ్న : రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్ ల పై నిఘా ఉంచారా..?
జవాబు : తన పరిధిలోని ఆయా పోలీస్ స్టేషన్లో ఉన్న రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్ లు ఉన్న వారిపై నిఘా పెంచామని వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామన్నారు. ఇప్పటివరకు వారందరిని బైండోవర్ చేశామని ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే వారిని జైలుకు పంపడం జరుగుతుందని, అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. సమస్యాత్మక గ్రామాలకు నలుగురు సిఐఎస్ఎఫ్ బలగాలను పంపిస్తామన్నారు. 4 గ్రామాలకు కలిపి మొబైల్ ఫోర్సు అందుబాటులో ఉంటుందన్నారు.




