ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వవద్దు

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: రాబోయే సాధారణ ఎన్నికలలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా విధులను నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి సి. నారాయణరెడ్డి సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రేనర్లకు, జిల్లాస్థాయి మాస్టర్ ట్రైనర్లతో  నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, పోలింగ్ రోజు ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రొసీడింగ్ అధికారులకు శిక్షణ ఇవ్వాలన్నారు.  ఈవీఎంలు, వివి ప్లాట్లు, కంట్రోల్ యూనిట్ లపై అందరూ అవగాహన కలిగే ఉండాలని సూచించారు.  ఎలాంటి తప్పులు జరగకుండా ఎన్నికల విధులను నిర్వర్తించాలని, శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని అన్ని నియోజకవర్గాల అధికారులు పూర్తి బాధ్యతతో ఎన్నికల విధులు నిర్వహించాలని సూచించారు.  ఎన్నికల ప్రవర్తన నియమావళిని పక్కాగా చేపట్టాలని, ఎన్నికల సిబ్బందికి రిటర్నింగ్ అధికారుల ద్వారా పోలింగ్ మెటీరియల్ ను అందించాలన్నారు.  రీ – పోలింగ్ కు ఆస్కారం లేకుండా పూర్తి అవగాహనతో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకా దేవి, వికారాబాద్ ఎంపీడీఓ సత్తయ్య, మాస్టర్ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *