- కొత్త బ్రాండ్లు తీసుకొచ్చే ఆలోచన లేదు
- బిఆర్‌ఎస్‌వి పనీపాటలేని ఆరోపణలు
- మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 21 : తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొస్తున్నామనేది దుష్ప్రచారమేనని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదని, అసలు పరిశీలనే జరగలేదని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ముగిసిన తరవాత ఎక్సైజ్ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని అన్నారు. గాంధీభవన్‌లో ఆయన వ్నిడియాతో మాట్లాడుతూ…దొంగే దొంగ అన్నట్లుగా భారాస నేతల మాటలు ఉన్నాయని, వారు ప్రతిదీ ఆరోపణలు చేసి బద్‌నామ్ చేసే దిశగా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం చాలా శాఖల్లో బిల్లులు పెండిరగ్‌లో పెట్టిందని, రైతు భరోసాకు సంబంధించి రూ.6వేల కోట్లకు పైగా చెల్లింపులు తమ ప్రభుత్వంలో జరిగాయని, ఈ నెలలోనే రూ.370 కోట్ల చెల్లింపులు చేశామన్నారు.
మద్యం కొరత ఉంటే ప్రభుత్వానికే నష్టమని, ప్రజలకు కాదని, బ్లాకులో అమ్మిన ఘటనలపై ఎక్సైజ్ శాఖ కేసులు నమోదు చేసిందని ఆయన వివరణ ఇచ్చారు. టానిక్‌లకు గత ప్రభుత్వం ఇచ్చిన పన్ను మినహాయింపులను రద్దు చేశామని, తయారీ యూనిట్ల వద్ద ఎలాంటి అక్రమాలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసులు నిరంతరం పరిశీలిస్తున్నారన్నారు. గతంలో పైరవీలు, ముడుపులు ఉంటే తప్ప ఉద్యోగుల బదిలీలు జరిగేవి కావని, ఇప్పుడు అలాంటివేవీ లేకుండానే పోర్టల్ ద్వారా బదిలీలు జరుగుతున్నాయన్నారు. తప్పుడు రాతలు రాసిన పత్రికపై పరువునష్టం దావా వేస్తామని మంత్రి ఈ సందర్భంగా హెచ్చరించారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఎక్సైజ్‌శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని జూపల్లి తెలిపారు.





