ఎన్‌కౌంటర్‌లకు కూడా వెరవని రేపిస్టులు

అత్యాచారాలకుపాల్పడితే ప్రాణాలు కోల్పోతామన్న భయంకూడా లేకుండా పోతోంది రేపిస్టులకు. అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ పలు సంచలనాత్మకమైన సంఘటనలు జరిగినప్పుడు నిండు ప్రాణాలను కోల్పోయిన యువకులను చూసైనా గుణపాఠం నేర్చుకునే పరిస్థితి  కనిపించడంలేదు. నేటికి సరిగ్గా పదేళ్ళ కింద దిల్లీలో  జరిగిన నిర్భయ కేసు విషయంలోనైతేనేమీ, 2008లో వరంగల్‌లో జరిగిన యాసిడ్‌ ‌సంఘటనకు సంబంధించి  నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్‌కు గురైన సంఘటననైతనేమీ,  ఆ తర్వాత  2019లో హైదరాబాద్‌ ‌దిశ కేసుకు సంబంధించి  నలుగురు ఎన్‌కౌంటర్‌ అయిన సంఘటన అయితేనేమీ ఇవేవీ వీరిలో ఏమాత్రం మార్పును  తీసుకు రాలేకపోయాయనేందుకు తాజాగా హైదరాబాద్‌లో జరిగిన మరో రెండు అత్యాచార కేసులు రుజువు చేస్తున్నాయి.  చిన్నారులు మొదలు వృద్దులపైన వయస్సుతో తారతమ్యం లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. చాక్లెట్‌ ఇస్తామనో, చిప్స్ ‌కొనిస్తామనో, అమ్మ పిలుస్తున్నదనో, ఇంటికి తీసుకు వెళ్తాననో ఇలా ఏదో ఒక ఒంకతో ముక్కుపచ్చలారని చిన్నారులను మచ్చికచేసుకుని వారిపైన అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. విచిత్రమేమంటే ఇలా అత్యాచారాలకు పాల్పడుతున్న వారిలో మైనర్లుండటం.

దేశంలోనే సంచలనాత్మకంగా మారిన నిర్భయ కేసు అనంతరం నిర్భయ చట్టం ఏర్పడిన తర్వాత ఇక అత్యాచారాలు చేయాలంటేనే భయపడుతారనుకున్నారు. కాని, చట్టాల దారి చట్టాలదే. అఘాయిత్యాలదారి అఘాయిత్యాలదే అన్నట్లుగా అంతకంతకు కేసులు పెరుగుతున్నాయేగాని తగ్గటంలేదు. గత రెండు మూడు సంవత్సరాల అధికార గణాంకాలను చూస్తే ఇలాంటి వారిపైన నమోదు అయిన పోక్సో కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతీ సంవత్సరం వందలాది కేసులు నమోదు అవుతూ వొస్తున్నాయి. గత సంవత్సరం వరకు దాదాపు రెండున్నర వేల కేసుల వరకు నమోదు అవడాన్ని చూస్తుంటే నిర్భయ చట్టానికి గాని, వరంగల్‌, ‌హైదారాబాద్‌లో ఇలాంటి కేసుల సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్లకుగాని రేపిస్టులు ఏ మాత్రం భయపడేదిలేదన్నట్లుగానే ప్రవర్తిస్తున్నారు. నిర్భయంగా మహిళలు, యువతులు ఒంటరిగా ప్రయాణం చేసే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. తమ గమ్యస్థానానికి అటోల్లో, బస్సుల్లో వెళ్ళాలంటే కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది. ఆటోను ఎటో నిర్జన ప్రదేశానికి తీసుకెళ్ళి స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడుతున్న సంఘటనలు నిత్యం ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉన్నాయి.

దిల్లీ నిర్భయ కేసు మాదిరిగానే హైదరాబాద్‌లో కదులుతున్న బస్సులో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన నాలుగు నెలలకింద వెలుగులోకి వొచ్చిన విషయం తెలిసిందే.
అలాగే కోఠి నుండి జూబ్లీహిల్స్‌కు   వెళ్తున్న యువతిపై ఆటో డ్రైవర్‌ ‌మరికొందరితో కలిసి అత్యాచారానికి పాల్పడిన ఘటన కొద్ది నెలల కిందనే చోటుచేసుకుంది. దిశ సంఘటన తర్వాత మరోసారి ఇటువంటి సంఘటన జరిగితే , కనీసం ఆడపడుచుల వైపు చూస్తే వారి కళ్ళు పీకేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌హెచ్చరించినప్పటికీ లాభంలేకుండా పోయింది. రాజధానిలో విస్తృతంగా నిఘా నేత్రాలను ఏర్పాటు చేసినా ఘటనలు మాత్రం ఆగటంలేదు. ముఖ్యంగా పబ్‌ ‌కల్చర్‌ ‌యువతను మరింత చెడగొడుతున్నదన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఏదో ఒక పార్టీ పేరున పబ్‌లను బుక్‌చేసుకోవడం.. అక్కడ వివిధ మత్తు పదార్ధాలు సేవించడం.. డ్యాన్స్‌ల పేరున విశృంఖలంగా అశ్లీలంగా ప్రవర్తిస్తూ అమాయకులైన అమ్మాయిలకు మాయమాటలు చెప్పి లోబర్చుకోవడం పరిపాటయింది. రాజధానిలో ఇప్పుడు తాజాగా హాట్‌ ‌టాపిక్‌గా మారిన జూబ్లీహిల్‌ ‌పిఎస్‌ ‌పరిధిలో నామోదైన సామూహిక అత్యాచారం కేసుకూడా అలాంటిదే. ఈ కేసులో నిందులైన ఆరుగురిలో అయిదుగురు మైనర్లు కావడం గమనార్హం . ఈ సంఘటనకు ప్రధాన కేంద్రం, జూబ్లీహిల్స్‌లోని అమ్నిషియాపబ్‌.

‌త్వరలో పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్న సందర్భంగా ఒకసారి పార్టీ చేసుకుందామన్నవాడు కూడా మైనరే. ఈ పార్టీకి బాధితురాలు హాజరై అత్యాచారానికి గురైంది. పబ్‌లో వారి అసభ్య ప్రవర్తనకు బయటిక• వెళ్ళినప్పుడు ఆమెను అనుసరించిన  నిందితులు కారులోనే అమెపై అత్యాచారానికి ఒడిగట్టారంటే రాజధాని రోడ్లపైన ఎంత భద్రత ఉందన్నది అర్థమవుతున్నది. అమ్మాయిపై జరిగిన అఘాయిత్యం సంఘటనను ఆలస్యంగా తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కూపీ లాగి నిందితులు ఆరుగురిని వారు గుర్తించారు. వారిపై పలు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నప్పటికీ పబ్‌ల పేరున, పార్టీల పేరున అమాయకులైన అమ్మాయిలను ట్రాప్‌ ‌చేస్తున్న వారికి వెన్నులో వణుకు పుట్టేట్లుగా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకున్నప్పుడే మహిళలకు భద్రత ఏర్పడుతుందని అమ్మాయిల సంరక్షకులు అంటున్నారు. ఇలాంటి సంఘటనల్లో అధికార, అనధికార రాజకీయ నాయకుల పిల్లలు ఎవరున్నా సరే చట్టం ప్రకారం శిక్షించినప్పుడే కొంత అయినా ఈ అరాచకాలు తగ్గే వీలవుతుంది. అందుకు ప్రభుత్వ చిత్తశుద్ది అవసరం.

గెస్ట్ ఎడిట్‌ ‌…మండువ రవీందర్‌రావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *