ఎడ్యుకేషనల్ హబ్ గా పటాన్ చెరు : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూలై 15: కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ప్రభుత్వ విద్యాసంస్థలను తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వానికి దక్కిందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్ చెరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో గ్లాండ్ ఫార్మా పరిశ్రమ సహకారంతో 3 కోట్ల 20 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన 14 అదనపు తరగతులు, క్యాంటీన్ గదులను శనివారం ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. పాఠశాలకు కావలసిన పూర్తిస్థాయి ఫర్నిచర్ ను పరిశ్రమ పాఠశాలకు అందజేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని గ్లాండ్ ఫార్మ పరిశ్రమ యాజమాన్యాన్ని కోరిన వెంటనే పరిశ్రమ సిఎస్ఆర్ హెడ్ రఘురామన్ వెంటనే స్పందించి మూడు కోట్ల 20 లక్షల రూపాయలు నిధులతో ఆధునిక వసతులతో గదులు, ఫర్నిచర్, ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక స్కావెంజర్, ఒక అటెండర్ను నియమించడం పట్ల ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం.. ప్రభుత్వ విద్య వ్యవస్థలో విప్లవత్మక మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. ప్రధానంగా మన ఊరు మనబడి పథకం ద్వారా ప్రతి పాఠశాలలో మౌలిక వసతులతో పాటు పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులను నియమించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు.నియోజకవర్గ కేంద్రమైన పటాన్ చెరు పట్టణాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దామని తెలిపారు. కేజీ నుండి పీజీ వరకు సొంత భవనాలలో ప్రభుత్వ విద్యాసంస్థలను ఏర్పాటు చేయడంతో పాటు ఏడు కోట్ల రూపాయలతో మైత్రి మైదానాన్ని ఆధునికరించామని తెలిపారు.వీటితోపాటు నిరుపేద విద్యార్థుల కోసం నియోజకవర్గ వ్యాప్తంగా గురుకుల విద్యాసంస్థలను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.ఒకనాడు ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థుల అడ్మిషన్ల కోసం ఉపాధ్యాయులు బడిబాట ద్వారా తిరగాల్సిన పరిస్థితుల నుండి నేడు ప్రభుత్వ గురుకులాల్లో ఒక సీటు కేటాయించాలని మంత్రుల స్థాయి సిఫార్సులు చేయించుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని అన్నారు. ఇందుకు ప్రధాన కారణం ఉచితంగా నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, ఆధునిక వసతులు కల్పించడం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి కి పైగా గురుకుల పాఠశాలలతో పాటు ఒక్కో విద్యార్థి పై ప్రభుత్వం ఏటా లక్ష రూపాయలకు పైగా వెచ్చిస్తోందని తెలిపారు.
పటాన్ చెరు నియోజకవర్గంలో అత్యధికంగా కార్మికులు, నిరుపేదల పిల్లలు ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా విద్యను అభ్యసించి పటాన్ చెరు కి జాతీయస్థాయిలో మంచి పేరు తీసుకుని రావాలని అభిలాషించారు.సమాజ సేవలో పరిశ్రమల యాజమాన్యాలు మరింత ముందుకు రావాలని కోరారు.ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.ఈ కార్యక్రమంలో పటాన్ చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర రావు, గ్లాండ్ ఫార్మా పరిశ్రమ సిఎస్ ఆర్ హెడ్ రఘురామన్, మండల విద్యాధికారి రాథోడ్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, బీఆర్ఎస్ ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు కొమరగూడెం వెంకటేష్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, పట్టణ పుర ప్రముఖులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *