ఎగ్జిట్ పోల్స్ అన్నీ అభూత కల్పనలు 

వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే 
ముచ్చటగా మూడోసారి కేసీఆరే సీఎం 
ఉప్పల్ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు 
మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు
ఉప్పల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1 : తెలంగాణ వ్యాప్తంగా  నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే ఎన్నికలు ముగిసిన వెంటనే వచ్చిన ఎగ్జిట్ ఫోల్ ఫలితాలకు ఎవరూ ఆందోళనకు గురికావలసిన అవసరం లేదని.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ అభూత కల్పనలేనని.. వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు ధీమా వ్యక్తం చేసారు. శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ..  ముచ్చటగా మూడోసారి కేసీఆరే సీఎం అవుతున్నారని.. ఇది గొప్ప చరిత్ర అని ఆయన పేర్కొన్నారు.  ఉప్పల్ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ లో వోటర్లు బండారి లక్ష్మారెడ్డి వైపే మొగ్గు చూపారని, ఈసారి భారీ మెజార్టీ తప్పదని ఆయన అన్నారు.  రాష్ట్రంలో పదేళ్ల పాలనలో జరిగిన బీఆర్‌ఎస్‌ అభివృద్ధిని.. గత 50 ఏళ్ల కాంగ్రెస్‌ ఘోరమైన పరిస్థితులను ప్రజలు బేరీజు వేసుకొని వోటు వేశారని,  తెలంగాణ ప్రగతికి పదేళ్లు కావొస్తోందని.. ఈ దశాబ్ద కాలంలో భారత రాష్ట్ర సమితి అందించిన సంక్షేమాలను చూసి ప్రజలు వోటును  వేసి మరింత ఊతమిచ్చారని అయన అన్నారు.   ఇందిరమ్మ రాజ్యంలో ఘోరమైన పరిస్థితులు ఉండేవని పునరుద్ఘాటించారు. మళ్లీ ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబితే ఎవరూ నమ్మలేదని .. . నాడు ఏ వర్గం ప్రజలు కూడా బాగుపడిన దాఖలాలు లేవన్నారు. ఆ ఇందిరమ్మ రాజ్యంలోనే కదా అత్యవసర పరిస్థితి విధించి ప్రజలను ఇబ్బంది పెట్టింది అని రామారావు విమర్శించారు.  బీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధి  ప్రజలను చైతన్యవంతులను చేసిందని.. ఆ దిశగానే వోటును వేశారని చెప్పారు.  కాంగ్రెస్‌ హయాంలో నీటిపై పన్ను ఉండేదని.. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రద్దు చేశారని  తెలిపారు. దేశంలో నీటి పన్ను లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వివరించారు.  రైతుబంధు దుబారా అని కొందరు.. రైతులకు 24 గంటలు విద్యుత్‌ ఇవ్వడం వృథా అని మరికొందరు కాంగ్రెస్‌ నాయకులు విమర్శిస్తున్నారు.  తెలంగాణలో రైతు రాజ్యం ఉందని.. కాంగ్రెస్‌ వస్తే రైతులకు ఉరి పడటం గ్యారంటీ అని ఆయన హెచ్చరించారు. ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తామని రాహుల్‌ అన్నారని విమర్శించారు. నిన్న పోలింగ్ ముగియగానే కొన్ని సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేశాయి. మన బీఆర్‌ఎస్‌  ఈ ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మడం లేదని, మనం 70కి పైగా స్థానాల్లో అధికారంలోకి వస్తామని ఇప్పటికీ చాలా కాన్ఫిడెంట్‌గా మన నేతలు చెబుతున్నారన్నారు. రియల్ పోల్ రిజల్ట్ డిసెంబర్ 3న వస్తుంది కాబట్టి కార్యకర్తలు ఎవరూ కంగారపడవద్దని పేర్కొన్నారు.  డిసెంబర్ 3 న తప్పని తేలితే ఎగ్జిట్ పోల్స్ చేసినవారు ప్రజలకి క్షమాపణ చెబుతారని ఆయన అన్నారు. మళ్లీ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే వస్తోందని, ముచ్చటగా మూడోసారి కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని  ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉప్పల్ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని  భారీ మెజార్టీతో వోటర్లు విజయాన్ని అందించబోతున్నారని కొత్త రామారావు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *