అపరిచితులమే కానీ

ఎక్కడో సుపరిచితులమే!

మతికి గుర్తులేదు కానీ,

మనసు జ్ఞాపకాల్లో ఎక్కడో

తచ్చాడుతూ!

 

సన్నిహితులమే కానీ

ఎందుకో సుదూరతీరాల్లో!

మతికి దూరభారాలు కానీ,

మనసు నీడల్లో ఎప్పుడో

సేద తీరుతూ!

 

స్నేహితులమే కానీ

ఎప్పుడో ప్రేమికులమే!

మతితో మంకుపట్లు కానీ,

మనసులో ముచ్చట్లు ఏనాడో

మురిసిపోతూ!

 

ఇరువురమే కానీ

ఎప్పటికీ ఒక్కరమే!

మతికి మరుపు వచ్చిందేమో కానీ,

మనసులో మనసే ఎన్నటికీ

రమించిపోతూ!

 

ఎక్కడో!..ఎప్పుడో!

లేకుంటే ఎందుకింత తహతహ!

కాకుంటే ఎందుకిలా గడబిడ!

అదేంటో! మతికి లెక్కలు తేలటంలేదు!

మనసుకు జన్మలు చాలటం లేదు!

 

విరహంతో ఎక్కడ ఆగిపోయామో?

అక్కడే పరవశంతో మొదలైతే

బాగుండును కదా!

వియోగంలో ఎప్పుడు విడిబడ్డామో?

అక్కడే పులకరింపుతో మొదలైతే

బాగుండును కదా!

– ఉషారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *