మనదేశ అభివృద్ధికి వ్యవసాయం మూలస్తంభం. గత సంవత్సరంలో వ్యవసాయం దేశ జిడిపిలో 18.3 శాతంగా ఉంది. దేశ జనాభాలో యాభై శాతం కంటే ఎక్కువ మంది వ్యవసాయ కార్యకలాపాల మీద ఆధారపడి జీవిస్తున్నారు. అరవై ఐదు శాతం మంది ప్రజలకు ఈ రంగం ప్రత్యక్షంగాను,
యాభై శాతం మందికి పరోక్షంగా ఉపాధిని కలిగిస్తుంది. ఇన్‌ఫ్లేషన్ (ద్రవ్యోల్బణం)
అనే పదం ఇంచుమించు అందరికీ సుపరిచితమే. కాని కొత్తగా హీట్‌ఫ్లేషన్ అనే భావన తెరమీద కొచ్చింది. కాలుష్యం వలన వాతావరణంలో హరితవాయువులు పెరిగి ప్రపంచ వాతావరణంలో అధికవేడి నమోదవుతుంది. మనదేశంలో కూడా చాలా ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవు తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు పంటలను దెబ్బతీయడమే కాకుండా కొన్ని సార్లు నాశనం చేస్తాయి. దీని వలన ఆహారపంటల నాణ్యత తగ్గడమేకాక దిగుబడి కూడా తగ్గుతుంది. ఆహార సరఫరా తగ్గిపోవడంతో ఆహార ధాన్యాలకు డిమాండ్ ఎక్కువై ధరలు పెరగడం ప్రారంభిస్తాయి. అధిక ఉష్ణోగ్రతల వలన ధరలు పెరగడాన్నే హీట్‌ఫ్లేషన్ లేదా ఉష్ణ ద్రవ్యోల్బణం
అని పిలుస్తారు.
హీట్‌ఫ్లేషన్ ప్రభావాలు: వ్యవసాయ శాస్త్రవేత్తలు అధిక ఉష్ణోగ్రతలు పంటలపై ఏవిధమైన ప్రభావం చూపుతుందో అనేక పరిశోధనలు చేశారు. ఉష్ణోగ్రతలో చిన్న పెరుగుదల అంటే 1.5 డిగ్రీల సెల్సియస్ కూడా పంట దిగుబడిపై గణనీయమైన ప్రతికూల ప్రభావాలను చూపుతుంది.సాగుచేస్తున్న ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పంట మొక్కలలో పెరుగుదల, నాణ్యత, దిగుబడిని చాలా ప్రభావితం చేస్తుంది. ఇది పంట దిగుబడి సామర్థ్యంలో పెనుమార్పులను కలుగజేస్తుంది. సాధారణంగా మనదేశంలో వరి, గోధుమలు, తృణధాన్యాలు, చిరుధాన్యాలు, పండ్లు ఆహార పంటలుగా చెప్పుతారు. వీటిపై అధిక ఉష్ణోగ్రతలు ప్రభావాన్ని పరిశీలిద్దాం. వరి సాగుకు 25 నుండి 35 డిగ్రీల సెల్సియస్, గోధుమ సాగుకు 14 నుండి 18 డిగ్రీల సెల్సియస్, తృణ ధాన్యాలకు సరాసరి 30 డిగ్రీల సెల్సియస్, చిరు ధాన్యాలకు సగటు 26 నుండి 29 డిగ్రీల సెల్సియస్ల ఉష్ణోగ్రతలు వాంచనీయమని వ్యవసాయ నిపుణులు చెబుతారు. ఈ ఉష్ణోగ్రతలు ప్రాంతాలబట్టి కొంచెం అటుఇటుగా మారుతాయి. మొక్కలు చనిపోయే క్లిష్ట ఉష్ణోగ్రతను ‘థర్మల్ డెత్ పాయింట్’ అంటారు. యాభై డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత అనేక వార్షిక ఆహారపంటలకు డెత్ పాయింట్. విపరీతమైన వేడి పంటలను బహుముఖ మార్గాల్లో నాశనం చేస్తాయి.
అధిక ఉష్ణోగ్రత వల్ల మొక్కలు తెగుళ్లు వ్యాధుల బారిన పడతాయి. అదే సమయంలో పంటనాణ్యత, పోషకవిలువలును తగ్గిస్తుంది. ఖనిజ పోషణ, రెమ్మల పెరుగుదల, పుప్పొడి అభివృద్ధిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అధిక వేడి నిర్జలీకరణానికి దారితీస్తుంది. దీని మూలాన ఆకులు మాడిపోతాయి. నైట్రేట్లు తీసుకొనే సామర్థ్యం తగ్గుతుంది. ఫలితంగా తక్కువ దిగుబడి వస్తుంది. దీని ప్రభావం వరి విత్తనాలు మొలకదశ నుండే మొదలవుతుంది. వరి మొక్కలు నిద్రాణస్థితికి చేరుకొని ధాన్యం నాణ్యత, గింజ బరువు తగ్గుతుంది. కొన్నిసార్లు పూర్తిగా పంట చనిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలు ధాన్యం దిగుబడిని ప్రభావితం చేయడం ద్వారా ఫినోలాజికల్ అభివృద్ధి ప్రక్రియలను ప్రభావితం చేస్తాయి. మొక్కజొన్నలో 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కాల్షియం శోషణ తగ్గుతుంది. వరి, గోధుమలు, బార్లీ, జొన్న, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, నూనె దిగుబడినిచ్చే పంటలు మొదలైన వాటితో సహా అనేక సాగు చేసిన పంటలలో అధికవేడి దిగుబడిని తగ్గించిందని అధ్యయనాలు తెలుపుతున్నాయి.
తృణధాన్యాల దిగుబడిని 4.1 శాతం నుండి 10.0 శాతం వరకు తగ్గించిందని నిరూపించబడిరది. వేడి ఒత్తిడిలో బార్లీలో ధాన్యం నాణ్యత బాగా తగ్గుతుంది. అధిక వేడి వలన గోధుమలు, మొక్కజొన్న వరి పంటలు కోతకు ముందే ఎండిపోతాయి. పండ్లు, కూరగాయలు ప్రభావిత మవుతాయి. తక్కువ రుచి, తక్కువ బరువుతో దిగుబడి వస్తుంది. తట్టుకోగల రకాలతో పోలిస్తే సున్నితమైన పంట రకాలు వేడి ఒత్తిడి వల్ల తీవ్రంగా ప్రభావితమవుతాయి. అధిక ఉష్ణోగ్రత కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియకు భంగం కలిగిస్తుంది. పంటల నాణ్యత దిగుబడి తగ్గుదల ఆహార భద్రతకు భయాన్ని పెంచుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు పశువులును కూడా విడిచిపెట్టదు. మాంసం, పాల ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఆహార కొరతను మరింత పెంచుతుంది. దీని ప్రభావం చాలా భయంకరమైనది. ఇది రవాణా మరియు ఆహార సరఫరా గొలుసులకు అంతరాయం కలిగిస్తుంది.
అధిక వేడి ఆహారం యొక్క పోషక నాణ్యతను తగ్గించడమే కాకుండా చెడిపోయే అవకాశాన్ని పెంచుతుంది. పేదరికం లేదా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు తరచుగా స్థానిక వ్యవసాయంపై ఆధారపడి జీవనోపాధి కోసం ఎక్కువగా ఆధారపడతారు. పంటలు విఫలమైనప్పుడు లేదా చాలా ఖరీదైనవిగా మారడం వలన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని ఆహారం కోసం ఖర్చు చేయవలసి ఉంటుంది. పెరిగిన ఆహార అభద్రత , పోషకాహార లోపాన్ని ఆకలిని పెంచుతుంది. పేదరికం మరియు గ్రామీణ ప్రాంతాలలో నివసించే వారితో సహా బలహీన జనాభా వారి వలన, అసమానంగా ప్రభావితమవుతుంది. ఈ పరిస్థితి ఆహార భద్రతకు ముఖ్యంగా పేదలకు అత్యంత దుర్బలమైన ప్రజలకు పెద్ద ముప్పు కలిగిస్తుంది. అదనంగా, హీట్‌ఫ్లేషన్ ఆహారం యొక్క అధిక ఖర్చులు పరిమిత ఆర్థిక వనరులను దెబ్బతీస్తాయి. ఈ జనాభా ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి ఇతర అవసరాలను పొందడం మరింత కష్టతరం చేస్తుంది. సామాజిక అసమానతలను తీవ్రతరం చేస్తుంది.
హీట్‌ఫ్లేషన్‌ను ఎదుర్కోవడానికి ఏమి చేయాలి ?
ఈ సవాళ్ళను ఎదుర్కునేందుకు తక్షణ మరియు దీర్ఘకాలిక వ్యూహాలు అమలుచేయాలి. కరువునిరోధక పంటలును ఎన్నుకోవాలి. సమర్థవంతమైన నీటిపారుదల వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవాలి. విభిన్న రకాల పంటలపై ఆధారపడటం వలన ఏదైనా ఒక ప్రధానమైన పంట విఫలమైనప్పుడు కలిగే నష్టాన్ని తగ్గించవచ్చు. ఆహార వ్యర్థాలను తగ్గించగలగాలి. ఆహారం చెడిపోకుండా నిరోధించడానికి నిల్వ, రవాణా వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి. ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు ఆహార భద్రతకు మద్దతు ఇచ్చే విధానాలను అమలు చేయాలి. ముఖ్యంగా భూతాపం పెరగకుండా చూడాలి. ఇది మన చేతిలోనే ఉంది.





