- ఉమ్మడిగా అభ్యర్థుల ఎంపికకు అన్ని పక్షాల అంగీకారం
- 13 మంది సీనియర్ నేతలతో సమన్వయ కమిటీ ఏర్పాటు
- ముంబయి సమావేశంలో ఇండియా కూటమి నిర్ణయం
- కూటమి దెబ్బకు ఎన్‌డిఎ ఔట్…ఢీకొనడం మోదీ తరం కాదన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
ముంబై, సెప్టెంబర్ 1 : ప్రతిపక్ష ఇండియా కూటమిని ఢీకొనడం ఎన్‌డిఎకు సాధ్యం కాదని కూటమి నేతలు ప్రకటించారు. జుడేగా భారత్, జీతేగా ఇండియా నినాదంతో ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని ఇండియా కూటమి నిర్ణయించింది. భాగస్వామ్య పార్టీల కమ్యూనికేషన్స్, వి•డియా స్ట్రాటజీలను సమన్వయం చేసుకోవాలని, ఈ ప్రచార కార్యక్రమాలను స్థానిక భాషల్లో నిర్వహించాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈమేరకు ముంబై సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంది. 13 మంది సభ్యులతో కేంద్ర సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని, భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకాలపై చర్చలను తక్షణమే ప్రారంభించాలని నిర్ణయించింది. ఇండియా కూటమి సమన్వయ కమిటీని శుక్రవారం ప్రకటించింది.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, శివసేన-యూబీటీ నేత సంజయ్ రౌత్, ఆర్జేడీ నేత, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, సమాజ్‌వాదీ పార్టీ నేత జావేద్ ఖాన్, జేడీయూ నేత లలన్ సింగ్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్, సీపీఐ నేత డీ రాజా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఈ కమిటీలో సభ్యులుగా నియమితులయ్యారు. ఈ కమిటీకి కన్వీనర్‌ను ప్రకటించలేదు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు ఉమ్మడిగా పోటీ చేయాలని ఈ సమావేశాల్లో తీర్మానించారు. సీట్ల పంపకాలను ఇచ్చి, పుచ్చుకునే పద్ధతిలో సాధ్యమైనంత త్వరగా, ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ఈ తీర్మానంలో పేర్కొన్నారు. అక్టోబరు 2నాటికి మేనిఫెస్టోను సిద్ధం చేయాలని టీఎంసీ చీఫ్ మమత బెనర్జీ ఈ సమావేశంలో కోరారు. అయితే ఈ కూటమి లోగో, అధికార ప్రతినిధుల నియామకాలు జరగవలసి ఉంది.
ఇండియా కూటమి పక్షాల మొదటి సమావేశం పాట్నాలో, రెండో సమావేశం బెంగళూరులోనూ జరిగిన సంగతి తెలిసిందే. ఇకపై కూటమి తీసుకునే నిర్ణయాలతో పాటు అనుసరించాల్సిన వ్యూహాలను ఈ కమిటీయే ఖరారు చేస్తుంది. ప్రచార వ్యూహాలు, జాతీయ స్థాయి అజెండాలనూ త్వరలోనే ప్రకటించనున్నారు. అయితే..కన్వీనర్ పేరుని మాత్రం ఇంకా ప్రకటించలేదు. నిజానికి కన్వీనర్ పేరుతో పాటు లోగో కూడా లాంఛ్ చేస్తారని అంతా భావించారు. వి•టింగ్ ప్లాన్‌లోనూ ఈ అంశాలున్నాయి. కానీ…చివరి నిముషంలో ప్లాన్ మారిపోయినట్టు సమాచారం. సీనియర్ నేతల సూచనలు, సలహాల వల్ల అప్పటికప్పుడు ప్రణాళికలు మార్చినట్టు తెలుస్తోంది. 14 మంది సభ్యులతో కూడిని కమిటీని ఏర్పాటు చేసినట్టు ఉద్దవ్ థాక్రే శివసేన నేత సంజయ్ రౌత్ వెల్లడించారు. ఇక ఈ భేటీలో మూడు కీలక తీర్మానాలు చేసింది కూటమి.
లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు అన్ని పార్టీలు అంగీకారం తెలిపినట్టు కూటమిలోని కీలక నేతలు ప్రకటించారు. ఈ నెల మూడో వారం నుంచి ర్యాలీలు చేయాలని నిర్ణయించారు. ప్రజాసమస్యలపై పోరాడడమే తమ ఉద్దేశమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వెల్లడించారు. సీట్‌ల షేరింగ్‌పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే సీట్ల సర్దుబాటు జరుగుతుందని స్పష్టం చేశారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని తీర్మానించాం. ఈ నెల మూడో వారం నుంచి ర్యాలీలు చేపట్టనున్నాం. సీట్‌ల షేరింగ్‌పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తపడాలని నిర్ణయించుకున్నాం. ప్రజాసమస్యలపై పోరాటం చేయడమే మా లక్ష్యం. జుడేగా భారత్, జీతేగా ఇండియా నినాదంతో ప్రజల్లోకి వెళ్లనున్నాం అని మల్లికార్జున్ ఖర్గే అన్నారు.
కూటమి దెబ్బకు ఎన్‌డిఎ ఔట్…ఢీకొనడం మోదీ తరం కాదన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
బీజేపీని కూటమి ఓడించడం ఖాయం అని తేల్చి చెప్పారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ఈ బలమైన శక్తిని ఢీకొట్టడం మోదీ తరం కాదని స్పష్టం చేశారు. అదానీ వ్యవహారంపై విచారణ జరిపి తీరాలని డిమాండ్ చేశారు. ’విపక్షాలన్నీ ఒక్కటైతే బీజేపీ ఎన్నికల్లో విజయం సాధించడం అసాధ్యం. బీజేపీని ఓడించడానికి పక్కా ప్లాన్‌తో ఉన్నాం. ఇప్పటికే కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేశాం. త్వరలోనే సీట్ షేరింగ్ విషయంలోనూ స్పష్టత వస్తుంది. విపక్ష కూటమి బీజేపీని ఓడిస్తుందన్న నమ్మకం ఉందని రాహుల్ గాంధీ అన్నారు.



