హైదరాబాద్, జనవరి 17 : భాగ్యనగరంలో క్రికెట్ సందడి నెలకొంది. న్యూజిలాండ్, భారత్ మధ్య జరిగే వన్డే సిరీస్‌లో భాగంగా ఫస్ట్ వన్డేకు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వన్డేపై ఆసక్తి నెలకొంది. మరోవైపు ఉప్పల్‌లో నాలుగేళ్ల తర్వాత వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో ముందంజ వేయాలని టీమిండియా ఉత్సాహంతో ఉంది. ఈ తరుణంలో ఉప్పల్‌లో టీమిండియా వన్డే రికార్డులను పరిశీలిస్తే… ఉప్పల్ స్టేడియంలో టీమిండియా తొలిసారిగా 2005లో తొలి వన్డే ఆడింది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో భారత్ 5 వికెట్ల తేడాతో ఓడింది. ఆ తర్వాత 2007, 2009లలో ఆస్టేల్రియాతో రెండు వన్డేలను ఆడింది. ఈ రెండింటిలోనూ టీమిండియా ఓడిపోయింది. 2011 తర్వాత భారత్ ఉప్పల్ స్టేడియంలో మూడు వన్డేలు ఆడింది. 2011లో ఇంగ్లండ్ పై గెలిచింది. 2014లో శ్రీలంకపై విజయం సాధించింది.
చివరగా 2019లో ఆస్టేల్రియాపై నెగ్గింది. ఆ తర్వాత భారత్ మళ్లీ ఇక్కడ వన్డే ఆడలేదు. నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతున్న వన్డే కావడంతో..ఈ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇకపోతే ఉప్పల్ స్టేడియం అంటేనే టీమిండియాలో కొందరు ప్లేయర్లకు అచ్చొచ్చిన మైదానం. సొంత గ్రౌండ్ కాకపోయినా..ఉప్పల్ స్టేడియంలో బరిలోకి దిగి పరుగులు వరద పారించారు. ఉప్పల్ లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో టీమిండియా సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ ఉన్నాడు. అతను ఇక్కడ మూడు మ్యాచులు ఆడి 233 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా రెండు సెంచరీలు ఉన్నాయి. యువీ తర్వాత స్థానంలో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. ఉప్పల్ స్టేడియంలో సచిన్ మూడు మ్యాచులు ఆడి 220 పరుగులు చేశాడు. ఇందులో ఒక భారీ శతకం కూడా ఉంది. 2009లో ఆస్టేల్రియాపై సచిన్ 175 పరుగులు సాధించాడు.
మూడో స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్ ధోని ఉన్నాడు. ధోని ఇక్కడ 5 మ్యాచులు ఆడాడు. 200 పరుగులు సాధించాడు. అంతేకాదు ఈ మైదానంలో అత్యధిక మ్యాచులు ఆడిన క్రికెటర్ ధోని కావడం విశేషం .ధోని తర్వాత ఉప్పల్ స్టేడియంలో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రైనా నాలుగో ప్లేయర్ గా నిలిచాడు. అతడు 3 మ్యాచుల్లో 138 పరుగులు కొట్టాడు. లిస్టులో విరాట్ కోహ్లీ 5వ స్థానంలో ఉన్నాడు. కోహ్లీ ఇప్పటి వరకు ఉప్పల్ లో 3 మ్యాచులు ఆడి 134 పరుగులే చేశాడు. వీరందరిలో ప్రస్తుతం కోహ్లీ మాత్రమే ఆడుతున్నాడు. దీంతో ఫస్ట్ వన్డేలో కోహ్లీ సెంచరీ సాధిస్తే ఉప్పల్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా కోహ్లీ అవతరిస్తాడు.





