సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: నాడు ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులను మరిచి ఉద్యమానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడిన ద్రోహులకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం పదవులను అంటగడుతుందని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ మండిపడ్డారు. శుక్రవారం
సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ …దాదాపు వెయ్యి రోజులకు పైగా సిద్దిపేట పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద దీక్ష శిబిరం ఏర్పాటు చేసి నిరాహార దీక్షలో ఎంతోమంది ఉద్యమకారులు పాల్గొన్నారన్నారు. దీంతో దీక్ష శిబిరం వద్ద ఉద్యమకారుల స్ఫూర్తి నింపేలా సైతం నిర్మించారన్నారు. కాగా ఇటీవల పాత బస్టాండ్ కూల్చివేసి నూతనంగా బస్టాండ్ నిర్మించారని పైలాన్ ను కూడా కూల్చివేసారన్నారు. పట్టణంలో నూతనంగా బస్టాండ్ నిర్మించినప్పటికీ మాత్రం ఎందుకు నిర్మించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది ప్రభుత్వ ధనంతో నిర్మించి మళ్లీ నామరూపాలు లేకుండా చేస్తుందని అన్నారు. ఇన్ని నెలలు గడుస్తున్న ఉద్యమకారులకు చిహ్నంగా ఉండే పైలాన్ ను మరింత అందంగా నిర్మించాలని డిమాండ్ చేశారు. నియంతలా వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్ తీరును ఎండగట్టేందుకు ఉద్యమకారులంతా కాంగ్రెస్ పార్టీతో కలిసి అడుగులు వేయాలన్నారు. ఉద్యమంలో అవసరానికి వాడుకొని తీరా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన కుటుంబం బాగుపడేలా వ్యవహరిస్తున్నారని సీఎం కెసిఆర్ ను గద్దె దింపే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని అందుకు ఉద్యమకారులంతా కాంగ్రెస్ వెన్నంటే ఉండాలని కోరారు. ఉద్యమకారులను విస్మరించి వారి అడుగులకు మడుగులు వత్తే వారికే పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట పట్టణ ప్రధాన కార్యదర్శి గ్యాదర్ మధు సిద్దిపేట యువజన పట్టణ అధ్యక్షుడు గయాజుద్దీన్,ఎన్ ఎస్ యు ఐవర్కింగ్ ప్రెసిడెంట్ రశద్ తదితరులు పాల్గొన్నారు.



