నెరవేరిన తొమ్మిదేళ్ళ తల్లి తండ్రుల కల
హైదరాబాద్, సెప్టెంబర్ 19 : తమ బిడ్డకు పేరు పెట్టుకోవాలనే ఆ తల్లిదండ్రుల తొమ్మిదేండ్ల కల సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఫలించింది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన భూపాలపల్లి మండలం, నందిగామ గ్రామానికి చెందిన సురేశ్, అనిత దంపతులు 2013లో ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. తమ బిడ్డకు నాటి ఉద్యమ రథసారథి నేటి సీఎం కేసీఆర్‌తోనే నామకరణం చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ ఆడపిల్లకు ఇప్పటి దాకా పేరు పెట్టకుండానే పెంచుకుంటూ వొచ్చారు.
ఈ విషయం తెలుసుకున్న మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూధనాచారి తల్లిదండ్రులను, బిడ్డను ప్రగతి భవన్‌కు తోడ్కొని వొచ్చారు. విషయం తెలసుకున్న సీఎం కేసీఆర్ దంపతులు, సురేష్, అనిత దంపతులను దీవించి వారి తొమ్మిదేండ్ల ఆడబిడ్డకు ‘మహతి’ అని నామకరణం చేసారు. తమ ఇంటికి వొచ్చిన వారికి స్వయంగా సీఎం దంపతులు బట్టలు పెట్టి సాంప్రదాయ పద్ధతిలో ఆథిత్యమిచ్చారు. బిడ్డ చదువుకోసం ఆర్థిక సాయాన్నందించారు. తమ తొమ్మిదేండ్ల కల ఫలించడమే కాకుండా, వూహించని రీతిలో తమను ఆదరించి దీవించిన తీరుకు, సురేష్ కుటుంబం సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యింది. ఈ సందర్భంగా వారు సీఎం దంపతులకు తమ కృతజ్ఞతలు తెలుపుకున్నారు.




