- బలం లేకున్నా బరిలోకి దిగిన బిజెపి
- జనవరి 6న జరిగే ఎన్నికపై సర్వత్రా ఆసక్తి
న్యూ దిల్లీ, డిసెంబర్27: దేశ రాజధాని దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక ఉత్కంఠంగగా మారుతోంది. ఆప్‌కు పూర్తి మెజార్టీ ఉన్నా బిజెపి రంగంలోకి దిగుతోంది. దిల్లీలో పాగా వేసేందుకు బిజెపి ఎత్తులు వేస్తున్నది. అధికారంలోకి వచ్చేందుకు కావాల్సినంత సంఖ్యాబలం లేనప్పటికీ.. మేయర్ అభ్యర్థిని రంగంలోకి దింపింది.ఇప్పటికే ఓ స్వతంత్ర కౌన్సిలర్‌కు గాలం వేసిన బీజేపీ అధిష్ఠానం.. మరింత మందిని తమ వైపునకు తిప్పుకునేందుకు బేరసారాలకు సిద్ధమైనట్లుగా తెలుస్తున్నది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొన్నది. మేయర్ ఎన్నికను ఏకపక్షంగా గెలుస్తామన్న ఆప్ ఆశలపై నీళ్లు చల్లేందుకు కౌన్సిలర్ల వేటలో బీజేపీ పడింది. ఎంసీడీ మేయర్ పదవికి రేఖా గుప్తా పేరును బీజేపీ నిర్ణయించింది.
డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా కమల్ బాగ్రీ, స్టాండింగ్ కమిటీ అభ్యర్థిగా కమల్‌జిత్ సెహ్రావత్ పేర్లను బీజేపీ ప్రకటించింది. మేయర్ ఎన్నికలకు ముందు స్వతంత్ర కౌన్సిలర్ గజేంద్ర దారల్ సోమవారం బీజేపీలో చేరారు. ఆయన ముండ్కా నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందారు. సోమవారం బీజేపీలో చేరిన స్వతంత్ర కౌన్సిలర్ గజేంద్ర దారాల్ కూడా బీజేపీ స్టాండింగ్ కమిటీ అభ్యర్థిగా ఉన్నారు. కాగా, మేయర్‌గా ఒబెరాయ్, డిప్యూటీ మేయర్‌గా ఆలే మహమ్మద్ ఇక్బాల్ పేర్లను ఆప్ ఇప్పటికే ఖరారు చేసింది.ఢిల్లీ మేయర్ పదవిని కైవసం చేసుకోవడం కోసం స్వతంత్ర అభ్యర్థికి బీజేపీ మద్దతు ఇస్తున్నట్లు తమకు సమాచారం ఉన్నదని రెండ్రోజుల క్రితం ఆప్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పేర్కొన్నారు.
మేయర్ అభ్యర్థిని రంగంలో దింపేందుకు బీజేపీ భయపడుతున్నదని ఆయన ఎద్దేవా చేశారు. దమ్ముంటే మేయర్ పదవికి సొంత అభ్యర్థిని నిలబెట్టాలని ఆయన సవాల్ చేశారు. ఎంసీడీ మేయర్ ఎన్నిక జనవరి 6న జరగనున్నది. 250 స్థానాలకు జరిగిన ఎంసీడీ ఎన్నికల్లో ఆప్ స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఆప్‌కు 134 సీట్లు రాగా, బీజేపీ అభ్యర్థులు 104 స్థానాల్లో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థులు 9 మంది విజయం సాధించారు. 15 ఏండ్ల పాటు ఎంసీడీని పాలించిన బీజేపీ.. ఇటీవలి ఎన్నికల్లో ఆప్ చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నది.



