ఈ ‌సంవత్సరం కుంభవృష్టి!!

  • జోరందుకున్న నైరుతీ రుతుపవనాలు!
  • మే 27న కేరళను తాకే అవకాశం
  • మే 31లోగా రాష్ట్రంలో విస్తరించే అవకాశం

న్యూదిల్లీ, మే14 : నైరుతీ రుతుపవనాలు మే 13న దక్షిణ అండమాన్‌ ‌సముద్రం, నికోబార్‌ ‌దీవులు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. ఇంత త్వరగా రావడం గత ఏడు సంవత్సరాల్లో ఇదే తొలిసారి. ఈ కారణంగా.. ఆల్రెడీ అండమాన్‌ ‌సముద్రం దగ్గర మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ గాలులు ఇప్పుడు కేరళవైపు తమ ప్రయాణం సాగిస్తాయి. ఇవి మే 27 నాటికి కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా. ఐతే.. ఇప్పటికే కేరళతోపాటూ.. దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నైరుతీ ఆగమన సమయంలో ఇలా వర్షాలు కురుస్తుండటం కలిసొచ్చే అంశం.వాతావరణంలో వొచ్చిన మార్పులు.. ఈ సంవత్సరం అతి భారీ, కుండపోత వర్షాలు కురిపించేందుకు అనుకూలంగా ఉన్నాయి. పైగా నాలుగు రోజులు ముందే వొస్తున్నాయి కాబట్టి.. ఈ సంవత్సరం సాధారణంగా కంటే కొంత ఎక్కువగా.. 104 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది అని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మామూలుగా జూన్‌ 1‌న కేరళను తాకే నైరుతీ రుతుపవనాలు.. ఈసారి 27నే తాకేలా ఉండటం వల్ల.. దక్షిణాది రాష్ట్రాల్లోకి కూడా త్వరగా వొచ్చే అవకాశాలు ఉన్నాయి.అంచనాలకు తగినట్లే మే 27న కేరళను తాకితే.. 28, 29 తేదీల్లో కర్ణాటకలో విస్తరించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 30, 31 తేదీల్లో తమిళనాడు, ఏపీలోని రాయలసీమలోకి వొచ్చే అవకాశాలు ఉంటాయి. క్రమంగా అవి ఏపీ, తెలంగాణ అంతటా విస్తరించగలవు. ఐతే.. ఇక్కడే ఒక సమస్య ఉంది.

ప్రతీ సంవత్సరం నైరుతీ గాలులు ఏపీ, తెలంగాణకు త్వరగా రావట్లేదు. మన రాష్ట్రాలకు వొచ్చేసరికి నెమ్మది అయిపోతున్నాయి. ఇందుకు కారణం.. బంగాళాఖాతం నుంచి వ్యతిరేక దిశలో వచ్చే గాలులే. అందువల్ల జూన్‌ 2‌వ వారంలో ఏపీ, తెలంగాణలోకి నైరుతీ రుతుపవనాలు వొచ్చే అవకాశాలు ఉంటాయనుకోవచ్చు.మామూలుగా మనం వర్షాల కోసం నైరుతీ గాలులపై ఆధారపడతాం. ఈసారి ఆ అవసరం ఎక్కవగా రావట్లేదు. నైరుతీ రాకముందే.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రెండు రాష్ట్రాల్లో తరచూ కురుస్తూనే ఉన్నాయి. పగలంతా వేడి ఉంటూ, రాత్రిళ్లు వానలు పడుతున్నాయి. మరో అదృష్టమేంటంటే.. బంగాళాఖాతంలో భారీగా మేఘాలు ఉన్నాయి. వాటికి తోడు.. ఆగ్నేయ ఆసియా మొత్తం మేఘాలు ఉన్నాయి. అలాగే.. భూమధ్య రేఖ దగ్గర కూడా చాలా మేఘాలు పోగై ఉన్నాయి. ఇవన్నీ అతి భారీ వర్షాలు కురిపించే అవకాశాలు ఉన్నాయి.అంటార్కిటికా నుంచి వొస్తున్న సుడి గాలులు.. ఓ వారంలో.. భూ మధ్య రేఖను తాకే అవకాశాలు ఉన్నాయి. ఈ గాలులు కూడా తోడైతే.. ఇక కుండపోత వర్షాలకు అనుకూల వాతావరణం తయారైనట్లే. అందువల్ల ఈసారి వర్షాకాలంతో జాగ్రత్తగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటి నుంచి ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టుకోవాలి. గతేడాది విజయవాడలో కొంత భాగం మునిగిపోవడం చూశాం. ఈసారి అలా జరగకుండా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితి ఉంది.ఈసారి నైరుతీ రుతుపవనాలు.. రైతులకు బాగా మేలు చేస్తాయి. ఖరీఫ్‌ ‌సీజన్‌ ‌పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది.

ఈ సంవత్సరం వర్షాలు బాగా పడతాయి కాబట్టి.. రైతులకు మేలు చేస్తుంది. ఐతే.. ఒక సమస్య కూడా ఉంది. భూమధ్య రేఖ దగ్గర ఉన్న మేఘాలను బట్టీ చూస్తే.. కుండపోత వర్షాలు కురిసేలా ఉన్నాయి. అలా కురిస్తే, రైతులకు ఇబ్బందులు తప్పవు. పంటలు నీట మునిగే ప్రమాదం ఉంటుంది. దీనిపై అధికారులు ఫోకస్‌ ‌పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. ఐఎండీ అంచనాల ప్రకారం.. ఈ సంవత్సరం నైరుతీ రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి జూన్‌ ‌మొదటి వారంలో ప్రవేశించే అవకాశం ఉంది. ఐఎండీ అమరావతి శాస్త్రవేత్త ఎస్‌.‌కరుణ సాగర్‌ ‌ప్రకారం, ఉత్తర కోస్తాంధ్రలో అధిక వర్షపాతం నమోదవుతుంది. గత సంవత్సరం రాష్ట్రంలో 21 శాతం అధిక వర్షపాతం నమోదైంది, ఈ సంవత్సరం కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని అంచనా. ఐతే.. గతేడాది వర్షాకాలం ప్రారంభంలో కొద్దిగా వర్షాలు కురిసి.. తిరిగి వర్షాకాలం చివర్లో భారీగా కురిశాయి. ఈసారి ప్రారంభం నుంచే భారీగా కురిసే అవకాశాలు ఉంటాయి. తెలంగాణలో జూన్‌ 12 ‌నాటికి నైరుతీ రుతుపవనాలు చేరుకునే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ శాఖ తెలిపింది. ఈ సంవత్సరం రాష్ట్రంలో సాధారణం కంటే అధిక వర్షం కురిసే అవకాశం ఉందనీ, రైతులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపింది. ఐతే.. ఇప్పటికే తెలంగాణలో వాతావరణం వర్షాలకు అనుకూలంగా ఉంది. అందువల్ల అనుకున్నట్లే నైరుతీ అదే జోరు కొనసాగిస్తే, తెలంగాణలో కూడా కుండపోత వర్షాలు కురిసే ప్రమాదం ఉంటుంది.

అంటే ఈ వర్షాలు కొందరికి కలిసొస్తాయి, కొందరికి కష్టాలు తెస్తాయి అనుకోవచ్చు. పైగా మధ్యప్రదేశ్‌లో అధిక వర్షాలు కురుస్తాయని అంచనా. ఆ నీరు తెలంగాణకు వస్తే, తెలంగాణలో వరదలు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అప్రమత్తంగా ఉండటమే మేలు. మొత్తంగా ఈ సంవత్సరం అధిక వేడిని తెచ్చే ఎల్‌నినో పరిస్థితులు లేవు. పైగా అంటార్కిటికా.. అనుకూల పరిస్థితులు కల్పించింది. అందువల్ల ఈసారి న్యూట్రల్‌  ‘ఈఎన్‌ఎస్‌ఓ’ ‌పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటి కారణంగా ఈ సంవత్సరం మంచి వర్షాలు కురుస్తాయని అంచనా. ఈ వర్షాల వల్ల మన తెలుగు రాష్ట్రాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయి. చెరువులు, కుంటలు కూడా నిండుతాయి. నదులు ఉప్పొంగి ప్రవహించే పరిస్థితి రానుంది. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ‌తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉందాం. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు పాటు ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువ అవుతాయని, రానున్న మూడు రోజులు ఎండలకు తీవ్రంగా ఉంటాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్‌ ‌కుమార్‌ ‌వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *