రాష్ట్రంలో రాజకీయాలు కీలకంగా మారుతున్న వేళ దేశ ప్రధాని నరేంద్రమోదీ మరోసారి తెలంగాణలో పర్యటిస్తున్న క్రమంలో ప్రోటోకాల్ ప్రకారం ఆయనను ఆహ్వానించడానికి వెళ్ళాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈసారి కూడా ఎగ్గొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువొస్తానంటూ ప్రాంతీయ పార్టీగా ఉన్న టిఆర్ఎస్ను బిఆర్ఎస్గా మార్చి జాతీయ రాజకీయాల్లో దూసుకుపోతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పార్టీల మధ్య ఎలా ఉన్నా రాజ్యాంగపరమైన మర్యాదలు పాటించక పోవడంపట్ల ఇప్పటికే అనేక విమర్శలను ఎదుర్కుంటున్నారు.
ప్రధాని హోదాలో నరేంద్రమోదీ గత పద్నాలుగు నెలల్లో అయదుసార్లు తెలంగాణలో పర్యటించారు. ఈ అయిదు సార్లుకూడా సిఎం ప్రోటోకాల్ పాటించలేదన్న విమర్శ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులను ఎవరినో పంపించడం ఆనవాయితీగా మారింది. కెసిఆర్ 2021లో ఆఖరిసారిగా ప్రధాని మోదీని దిల్లీలో కలిసారు. ఆ తర్వాత అక్టోబర్‌లో హుజురాబాద్ ఉప ఎన్నికలతో బిజెపి, బిఆర్ఎస్ మధ్య తీవ్ర విభేదాలు చోటుచేసుకున్నప్పటి నుండి మోదీకి కెసిఆర్ దూరాన్ని పాటిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని అధికార, మరి కొన్ని అనధికార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పలుసార్లు ప్రధాని తెలంగాణలో పర్యటించారు.
నగర శివారులో చిన జీయర్‌స్వామి ఆశ్రమంలో శ్రీ రామానుజుల వారి విగ్రహావిష్కరణ, ఇక్రిసాట్ ద్విదశాబ్ది వేడుకలకు, బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు, రామగుండం ఫెర్టిలైజర్స్, కెమికల్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇలా పలుసార్లు ప్రధాని రాష్ట్రానికి విచ్చేసినా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ప్రధానిని ఆహ్వానించడానికి కనీసం విమానాశ్రయానికి కూడా వెళ్ళలేదు. ఇప్పుడు తాజాగా ఈ రోజు ప్రధాని వరంగల్‌లో పర్యటించనున్నారు. పది, పదిహేను రోజులముందే ఆయన పర్యటన ఖరారైంది. దానికి కావాల్సిన ఏర్పాట్లు అధికార, పోలీసు యంత్రాంగం గత వారం రోజులుగా నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఎసీపీజీ డిఐజీ నవనీత్‌కుమార్ మెహతా పర్యవేక్షణలో సుమారు పదివేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శనివారం ఉదయం మామునూరు హెలిప్యాడ్ చేరుకునే ప్రధాని పర్యటన నగరంలో దాదాపు 27 కిలోమీటర్ల మేర సాగనుంది.
ఆయన పయనించే దారి పొడవున భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్టస్ కళాశాలలో జరిగే భారీ బహిరంగ సభ ప్రాంగణాన్ని ప్రత్యేక పోలీసు దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ప్రధాని మోదీ పర్యటన ముగిసేవరకు ఆయన పర్యటించే ప్రాంతమంతా నో ఫ్లై జోన్‌గా ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. దారి పొడవునా ఉండే దుకాణాలను మూసివేయాల్సిందిగా వ్యాపారస్తులను పోలీసులు ఆదేశిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని వరంగల్‌లో సుమారు 6,100 కోట్ల విలువైన రైలు, రోడ్డు మార్గాలతో పాటు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేయనున్నారు. వాస్తవంగా ఇది అధికార పర్యటన కావడంవల్ల ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించినట్లు తెలుస్తున్నది. ప్రధాని మోదీ ప్రసంగించే బహిరంగ సభ వేదికపైన రాష్ట్ర గవర్నర్ తమిళిసై తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కూడా ప్రత్యేక ఆసనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇంతకు ముందుకూడా ప్రధాని సభ వేదికపైన ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ఆసనం ఏర్పాటు చేసినప్పటికీ సభ ఆసాంతం అది వెక్కిరించినట్లు కనిపించిందన్న విమర్శలొచ్చాయి. ఇటీవల కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు సంభవిస్తున్న క్రమంలో ఏర్పడిన బిఆర్ఎస్ ఆవిర్భావంలో బిజెపిపై కెసిఆర్ చేసిన విమర్శల స్థాయి ఇప్పుడు తగ్గిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ మార్పుపై ఇప్పటికే బిజెపికి బిఆర్ఎస్ బి టీమ్‌గా మారిందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బిఆర్ఎస్ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకుల అక్రమాలపై కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి చర్యలు తీసుకోకపోవడం వెనుక కూడా తెరవెనుక ఈ రెండు పార్టీలు ఒక్కటనన్నది స్పష్టమవుతోందంటోంది కాంగ్రెస్. ఈ నేపథ్యంలో శనివారం నాడు కెసిఆర్ ప్రధాని సభలో పాల్గొనే అవకాశాలపైచర్చ జరుగుతోంది. అయితే బిజెపితో ఏనాటికి రాజీ లేదన్నట్లుగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మోదీ పర్యటనను తాము బహిష్కరిస్తున్నట్లు కుండబద్దలు కొట్టారు. తెలంగాణకు అన్యాయం చేసిన ప్రధాని ఏ ముఖంపెట్టుకుని తెలంగాణలో పర్యటిస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ పుట్టుకనే అవమానించిన నేపథ్యాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. తల్లిని చంపి బిడ్డను బతికించారనడం ద్వారా ఆయన తెలంగాణరాష్ట్ర ఏర్పాటునే కించపర్చారని తాజాగా రాష్ట్ర రాజధానిలో ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్ళు అయినా నేటికీ ఇంకా విభజన హామీలను నెరవేర్చకుండా కావాలనే తెలంగాణపై సవతితల్లి ప్రేమ కనబరుస్తున్నారని కెటిఆర్ ఆక్రోశిస్తున్నారు. మోదీ శంఖుస్థాపన చేయబోతున్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి కేవలం 521 కోట్లను కేటాయించడాన్ని ఆయన ఎత్తి చూపుతూ, అదే గుజరాత్లో కోచ్ ఫ్యాక్టరీకి 20 వేల కోట్లను కేటాయించడం వివక్ష కాదా అని ప్రశ్నిస్తున్నారు.
ములుగు గిరిజన యూనివర్శిటీ, బయ్యారం స్టీల్ప్లాంట్లపైన ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడంపట్ల నిరసనగా తాము ప్రధాని పర్యటనను బహిష్కరిస్తున్నట్లు పేర్కొనడం చూస్తుంటే అది పార్టీ నిర్ణయంగానే భావించాలి. దీన్నిబట్టి ఈసారి కూడా ప్రధాన్ని ఆహ్వానించేందుకుగాని, విడ్కోలు చేప్పేందుకుగాని సిఎం కెసిఆర్ వొచ్చే అవకాశాలు తక్కువనే ..!




