ఈశాన్యం మూల
కొండల్లో కోనల్లో
ఆకాశం నిండా అలుముకున్న పొగ
చూశారుగా.. మీరందరూ చూశారుగా..
ఆజ్యం పోసి మూడు నెలలైనా
వీసమెత్తు కదలిక లేకుండా
మొసలి కన్నీరు కార్చే
గుంటనక్క మాటలు విన్నారుగా ..
పచ్చని ప్రకృతి తల్లి ఒడిలో
కొండల్లో లోయల్లో
శాంతియుతంగా బతికే
మా గుండెలు ఉలిక్కిపడుతున్నాయి
ఏ పక్క నుంచి
విద్వేషపు విషపురుగు దాడిచేస్తుందో
ఏ నడిరోడ్డులో చెరబట్టి కాటువేస్తుందోనని
పచ్చని బతుకుల్లో పొగబెట్టి
గుండెల్లో గునపాలు దించి
ఇళ్ళు నుసి చేసి, ఊళ్లు బుగ్గిచేసి
మమ్మల్ని, మా ఆస్తుల్ని మా కొండల్ని
ఆ తల్లి గర్భంలో దాగిన నిక్షేపాల్ని
అమాంతం మింగేసే కొండచిలువ
కాచుకు కూర్చున్నది
సత్యాన్ని అగ్గిలో పడేసి
రెండు జాతులు, రెండు మతాలు,
రెండు పార్టీల ఘర్షణగా రంగుల అద్ది
అసత్యపు కార్చిచ్చు వ్యాపింప చేస్తూ
విద్వేషాల విషంతో విలువల్ని కాటేస్తూ,
నగ్నంగా నర్తిస్తూ వికటాట్టహాసం చేస్తున్నది
ఈ రోజు మా దేహాలు, హృదయాలు
ఛిద్రమై ఆర్తనాదాలు చేస్తున్నా,
కనిపించని వినిపించని వ్యవస్థలు
కళ్ళకు గంతలు కట్టుకున్న గాంధారిలా
వ్యవహరిస్తూ బుడిబుడి రాగాలు ఆలపిస్తున్నాయి
మాకెందుకులే .. అని మిన్నకుంటే
రేపు మీరూ మా స్థానంలో ఉండొచ్చు
మనమందరం మనుషులం
ఒకే దారంలో పోగులం
అని సభ్య ప్రపంచానికి చాటుదాం
రండి … మీరూ రండి
విద్వేష విత్తనాలు నాటే
వారి భరతం పడదాం రండి
విధ్వంస రచనతో వార్ జోన్ గా
మార్చిన భస్మాసురుల కుట్రలు
భగ్నం చేసి వారి జెండా.. ఎజెండా
పాతరేద్దాం.. రండి.
ఈశాన్యం మూల తో
కరచాలనం చేసి సంఘీభావం పలకండి
చలిచీమలమే కావచ్చు, కానీ
బలవంతమైన సర్పాన్ని మట్టు బెట్టగల
సత్తా మనకుందని చాటుదాం రండి
వి. శాంతి ప్రబోధ




