ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 11 : ఇండస్ట్రియల్ ప్యాకేజింగ్ కంపెనీ పిరమిడ్ టెక్నోప్లాస్ట్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 18 న ప్రారంభంకానుందని ఆ ప్రతినిధులు శుక్రవారం నగరంలో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. 22 న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ.151-166 కాగా తద్వారా రూ.153 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోందన్నారు. ఇష్యూలో భాగంగా 92.2 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనుందని తెలిపారు. వీటిలో 55 లక్షల షేర్లను కంపెనీ ఆఫర్ చేయ నుండగా 37.2 లక్షల షేర్లను ప్రమోటర్ గ్రూప్ క్రెడెన్స్ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ ఎల్ ఎల్పీ విక్రయానికి ఉంచనుందన్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 90 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుందన్నారు. కంపెనీ ప్రధానంగా పాలిమర్ ఆధారిత మోర్డెడ్ ప్రొడక్టులు(పాలిమర్ డ్రమ్ములు) తయారు చేస్తోంది. కెమికల్, ఆగ్రోకెమికల్, స్పెషాలిటీ కెమికల్, ఫార్మాస్యూటికల్ తదితర పరిశ్రమలు తమ ప్యాకేజింగ్ అవసరాలకు వీటిని వినియోగిస్తుంటాయని, మార్చితో ముగిసిన గతేడాది(2022-23) రూ.482 కోట్ల ఆదాయం, రూ.32 కోట్ల నికర లాభం ఆర్జించిందన్నారు.




