ఈనెల 15న సీఎం కేసీఆర్ మెడికల్ కళాశాల ప్రారంభిస్తారు

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర సెప్టెంబర్ 6: ఈ నెల 15న ప్రారంభించే వైద్య కళాశాలలో అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు.    బుధవారం వైద్య కళాశాల పరిసరాలను, వైద్య విద్యార్థులకు వసతుల సౌకర్యం నిమిత్తం భవనాల పరిశీలన, కేజిబివి బాలికల కళాశాలను జిల్లా అదన కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనెల 15న వర్చువల్ గా జిల్లా వైద్య కళాశాలను ప్రారంభిస్తున్న సందర్భంగా చేపట్టాల్సిన పనులపై అధికారులకు సూచనలు చేశారు. వైద్య కళాశాలలో ఔట్ సోర్సింగ్ పై  సిబ్బందిని నియమించుకునే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించారు. కళాశాల ఆవరణలో వీధి దీపాలను అమర్చే విధంగా చర్యలు చేపట్టాలని  డిప్యూటీ ఇంజనీర్ లక్ష్మీనారాయణను ఆదేశించారు. ఏరియా ఆసుపత్రి పనులను వేగవంతం చేస్తూ 20 రోజుల్లో పూర్తి అయ్యేలా కార్యచరణ రూపొందించుకొని పనులు చేపడుతూ రోజువారి పనులను అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) కి నివేదిక సమర్పించాలని  కాంట్రాక్టర్,  డీఈ కి  సూచించారు.   వైద్య కళాశాలకు మిషన్ భగీరథ నీటిని సరఫరా అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నూతనంగా నిర్మించిన కేజీబీవీ పాఠశాలను పరిశీలించి తదనంతరం విద్యార్థినిలతో వసతి గృహంలో సౌకర్యాలపై, బోధన విధానంపై కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో టాయిలెట్స్,  తలుపులు, కిటికీల, ప్యాచ్ వర్క్ మరమ్మతులను చేపట్టాలని ఈడబ్ల్యుఐడిసి డిఇ రాజును కలెక్టర్ ఆదేశించారు.  కలెక్టర్ పర్యటనలో వైద్య కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ పద్మ మాలిని, సూపరింటెండెంట్ డాక్టర్ రామచంద్రయ్య, డిసిహెచ్ఎస్ డాక్టర్ ప్రదీప్ కుమార్, డీఎస్సీడివో మల్లేశం, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, కేజీబీవీ కళాశాల ప్రిన్సిపల్ స్వరూప, వైద్య శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *