ఇల్లు- గూడు!

రుకుదో చిన్నదో
ఉండేందుకు ఓ నీడ ఉన్నందుకు
అందరం కలిసి ఓ చోట
మనసు దుప్పట్లను పరిచి
తనివితీరా ఊసులాడేందుకు
ప్రేమగా అల్లుకున్న అందమైన
మా ‘తులసీనందనం‘* గూడున్న
అభాగ్యనగరపు అమీరులం !
బ్రతుకు పయనంలో
అలుపెరగని బాటసారులం !

మాపాలిటి మయుడైన సుతారి
మేస్త్రి నర్సింహులు మా అవసరాల
మేరకు ఆకాంక్షల రూపానికి సుతారంగా
తీర్చికట్టిన ఇంద్రభవనమే
మా తులసీనందనం!

ఇపుడైతే రెక్కలొచ్చి పిల్లలు
ఎగిరిపోయి బోసిగా ఉన్నా
వారి జాడలు, అల్లర్లు ఎప్పుడూ
ప్రతిధ్వనిస్తూ మీతోనే ఉన్నామని
పలకరిస్తూ ఒంటరితనాన్ని
దూరంగా నెట్టి జంటతనాన్ని
ఇల్లంతా నింపేస్తుంటాయి !

అయినా ప్రేమగా అల్లుకున్న
పొదరిల్లులాంటి ఈ ఇంటి
ప్రతి ఇటుక,గోడ, తలుపు, కిటికీ
సదా మాతో మాటలు కలుపుతూ తోడుగా కబుర్లాడుతూ మాతోనే
ఉన్నందుకు మురుస్తుంటాము !

ప్రకృతిలో ప్రతి ప్రాణికి తనదైన
సహజ గూడు ఉన్నపుడు
భూమ్మీద బ్రతికే ప్రతి మనిషికీ
అమ్మలా అక్కున చేర్చుకుని
కాపాడేందుకు ఇల్లొకటి కావాలి !

భుక్తితోపాటు తలదాచుకునేందుకు
చిన్నదో చిరుగులదో ఓపూరిగుడిసె..
ఊరించి అందని ద్రాక్షగా మారిన
సర్కారు రెండు పడకల ఇల్లో…
కుదరకుంటే తలదాచుకునేందుకు
ఓ చెట్టు ఛాయనో
ఒళ్లు చాటుకోసం ఏదో ఒక మరుగు
నిర్భాగ్యులందరికి దొరికే
మంచి రోజు వచ్చేదెన్నడో ?
– డా. కె. దివాకరా చారి
Cell: 9391018972

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *