ఇన్సాట్‌-3 డీఎస్‌ ఉపగ్రహం ప్రయోగం సక్సెస్‌

అంతరిక్ష రంగంలో ఇస్రో మరోచరిత్ర

శ్రీహరి కోట, ఫిబ్రవరి 17 : శనివారం భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శ్రీకారం చుట్టిన వాతావరణ ఉపగ్రహమైన ఇన్‌ శాట్‌-3డీఎస్‌ను మోసుకెళ్లే జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌ 14 ఉపగ్రహ వాహక నౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి శనివారం సాయంత్ర ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. గతంలో ప్రయోగించిన ఇన్‌ శాట్‌-3డీ, ఇన్‌ శాట్‌-3డీఆర్‌ ఉపగ్రహాలకు కొనసాగింపుగానే ఈ ఇన్‌ శాట్‌-3డీఎస్‌ ని పంపుతున్నట్లు ఇస్రో వెల్లడిరచింది. ఇప్పటికే చంద్రయాన్‌ సిరీస్‌ లో ప్రయోగం చేసి.. చివరకు విజయం సాధించిన భారత్‌ సూర్యుడిపైనా కూడా ప్రయోగం చేసింది. ఇప్పటికే విపత్తులు, వాతావరణంలో జరిగే మార్పులు, సముద్రంపై పరిశోధనలు చేసేందుకు ఇన్‌ శాట్‌ సిరీస్‌ లో ఉపగ్రహాలను పంపిన ఇస్రో తాజాగా ఇన్‌ శాట్‌-3డీఎస్‌ అనే మరో ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌14 వాహన నౌక ద్వారా ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు.

వాతావరణం మెరుగుపర్చడానికి, భూమి, సముద్రం ఉపరితలాలను పర్యవేక్షించడానికి దీన్ని రూపొందించారు. ఇన్‌ శాట్‌-3డీఎస్‌ సుమారు 2,275 కిలోల బరువు ఉంటుంది. ఇందులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్లు ఉన్నాయి. ఈ పేలోడ్లు వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరికలు, భూమి, సముద్ర ఉపరితలాలపై పరిశోధన చేసి..సమాచారాన్ని పంపించనుంది. ప్రస్తుతం కక్ష్యలోని ఇన్‌ శాట్‌-3డీ, ఇన్‌ శాట్‌-3డీఆర్‌ ఉపగ్రహాలతో కలిసి ఇది పనిచేయనుంది. ఈ ప్రయోగం మొదలైన 20 నిమిషాల తరువాత జియో సింక్రనస్‌ ట్రాన్స్‌ ఫర్‌ ఆర్బిట్‌లో శాటి లైట్‌ను ప్రవేశ పెట్టగా అనంతరం దశల వారీగా రెండు రోజుల పాటు కక్ష్యను మారుస్తారు. కాగా ఇస్రో చేపట్టిన ఇన్సాట్‌-3 డీఎస్‌ ఉపగ్రహాన్ని ప్రయోగం విజయవంతం అయిన సందర్భంగ కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *