‘‘రాజకీయాలలోకి వస్తున్నవారు, ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోబడేవారు అసలు సిసలైన కార్పొరేట్ ప్రతనిధులు లేదా స్వయంగా వ్యాపారాలు, ఆర్టిక సంస్థలు కల్గిన ఉన్నవారు. వారు రాజకీయాలలోకి వస్తున్నది ప్రజా సేవ ముసుగులో తమ తమ ఆర్థిక లాభాల పరిరక్షణ కోసం, పెంపొందించుకునేందుకు మాత్రమే.’’
‘‘కాగల కార్యం గంధర్వులు చేసినట్లు’’. ఇది సుపరియమైన తెలుగు సామెత. కోరిన లాభం , చేయాలనుకునే పని స్వయంగా చేయకుండానే జరిగిపోయే సందర్భాలలో ఈ సామెతను వాడుతాము. సంఘ్ పరివార్, భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఏమి కోరుకుంటూ వచ్చాయో, ఏమి జరుగాలి అనుకున్నాయో సునాయాసంగా, శ్రమ పడకుండానే, పార్టీ, ప్రభుత్వ పెద్దలకు పెద్దగా బురద అంటకుండానే జరిగిపొయ్యే రోజులు వచ్చాయి. వారి ప్రకటిత, అప్రకటిత ఆలోచనలకు, ఉద్ధేశ్యాలకు అనుకూలంగా ఎవ్వరూ, ఏ శక్తి ఏమి చేసినా, ఏ ఘోరం తలపెట్టినా చెల్లుబాటు అయ్యే పరిస్తితులు దేశంలో నెలకొని ఉన్నాయి.
రాజకీయంగా బలపడిన ఛాందస్స మత వాదశక్తులు సంఘీకంగానూ బలపడినవి. సనాతన ధర్మం పేరుతో చేస్తున్న ప్రచార హోరు, దేశానికి, హిందూ మతానికి మైనారీటి మతం నుండి, ప్రక్క దేశాల నుండి తీవ్ర ముప్పు అంటూ పదే పదే వళ్లిస్తున్న వాఖ్యనాలు అధిక సంఖ్యా మతస్తుల మస్తిష్కం లోకి చొరబడి తిష్ట వేశాయి. స్వీయ మతం పై తీవ్ర, ఉద్రేక పూరిత అభిమానం, బయట నుండి వచ్చిన మతాలపై ద్వేషం, వ్యతిరేకత రగిలించబడినాయ. తీవ్ర ఛాందస్స మత ప్రచారానికి లోను కానీ వారి సంఖ్య చాలా తక్కువ. అదీను రోజు రోజుకి కుంచించుక పోతుంది.
సగటు వ్యక్తిని మొదలు కొని ఉన్నత చదువు చదివిన వారు, ఉన్నత పదవులలో ఉన్నవారు అందరూ కరడు గట్టిన మత భావజ్వాలాన్నిఎక్కించుకొని మైకంతో ఊగిపొయ్యే స్తితికి దాదాపు చేరుకున్నారు. ఇందుకు ప్రజా ప్రతినిధులు, చట్ట సభలు, న్యాయ వ్యవస్టలు, రాజ్యాంగ సంస్థలు, రక్షణ వ్యవస్థలు, నిఘా సంస్థలు, వాటిని నడుపుతున్న వారు, అందులో పని చేస్తున్న వారు మినహాయింపు కాదు. ఈ సంస్థలకు, సంస్థ అధిపతులకు పైనుండి, ప్రభుత్వం నుండి ఎలాంటి సూచనలు లేకుండానే, ఆదేశాలు లేకుండానే ప్రభుత్య పెద్దలకు, వారి భావజవాలనికి అనుకూలంగా ప్రవర్తించటానికి, అవసరమైన సందర్భాలలో అనుకూల నిర్ణయాలు వెలువరించటానికి స్వచ్చందంగానే ముందుకు వస్తారు. ఇలాంటి పరిస్తితికి అద్దం పట్టే ఉదాహరణలు, తీర్పులు, దృశ్యాం తాలు అనేకం చూస్తున్నాము.
పరివార్ సైద్ధాంతిక, మతపర సంకుచిత ఆలోచనలకు, అన్య మత ద్వేషం జోడించి సాగించే ప్రచారం, ఆ అజెండాను ముందుకు తీసుక వెళ్లేందుకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అమలు చేసే విధానాలు దేశాన్ని ఎంత దూరం తీసుక వెళ్ళాయి అంటే ప్రభుతా అంగాలు, అధిపతులు మరో ఆలోచన లేకుండా, ప్రభుత్వ పెద్దల మెదళ్ళలో దాగిఉన్న నిగూఢ తరంగాలను కనిపెట్టి అందుకు అనుకూలంగా వ్యవహరించటం సర్వసామాన్యం అయ్యిపోయింది.
ఈ స్తితిని, ఈ వ్యవస్త పనితీరుని ఉదహాయరించేందుకే కదా ‘‘ కాగల కార్యం గంధర్వులు చేశారు’’ అని చెబుతారు.
నాణనికి మరొక కోణం ఉంది. కేంద్రంలో రాజ్యం ఏలుతున్న బిజేపి పెద్దలు పదే పదే పటిస్తున్న అభివృద్ధి మంత్ర ఉద్ధేశ్యం- దేశాన్ని అతి త్వరగా పూర్తి పెట్టుబడి దారి వ్యవస్త గా ముందుకు తీసుక వెళ్ళటం. ఇవ్వాళ ప్రైవేట్ పెట్టుబడులు వద్దని, పెట్టుబడిదారీ వ్యవస్త చెడు అని చెప్పే రోజులు కావు. చెప్పితే చెల్లు బాటు కూడా కావు. కానీ, ఇతరుల, పెట్టుబడిదారేతర వర్గాల హక్కులను కాలరాయటం, వారి జీవితాలను దుర్భరం చేసే విధానాలను అమలు చేయటం, దేశ సంపదను టోకుగా, నేరుగా, బహిరంగా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టటం ఆటవికం, అమానుషం మాత్రమే కాదు. దేశ ద్రోహం కూడాను. దేశ సంపద కు ప్రధాన కారణం కార్మికుల శ్రమ.
ఇలాంటి స్తితిలో ప్రతిపక్ష పార్టీలు ఏమి చేస్తున్నాయి అనే ప్రశ్న వస్తుంది. మొదటిది ప్రతిపక్షం డీలా పడిఉన్నది. మరొక విషయం ఏమిటంటే రాజకీయాలలోకి వస్తున్నవారు, ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోబడేవారు అసలు సిసలైన కార్పొరేట్ ప్రతనిధులు లేదా స్వయంగా వ్యాపారాలు, ఆర్టిక సంస్థలు కల్గిన ఉన్నవారు. వారు రాజకీయాలలోకి వస్తున్నది ప్రజా సేవ ముసుగులో తమ తమ ఆర్థిక లాభాల పరిరక్షణ కోసం, పెంపొందించుకునేందుకు మాత్రమే. ప్రతిపక్షం గట్టిగా ఉన్న రోజుల్లో అధికార పార్టీలో ఉన్నా, ప్రతిపక్ష పార్టీలో ఉన్నా ఆర్టిక మూలాలకు ముప్పులేదు అనే భావం అంతో ఇంతో ఉండేది. ఇప్పుడు అధికార పార్టీలో ఉంటేనే రక్షణ, మనుగడ. ఏక పార్టీ స్వామ్యం, బిజేపి పెద్దలు చెప్పినదే శిలాశాసనం.
ఎక్కడ నుండి అయినా, ఎవ్వరి నుండి అయినా నిరసన, ధిక్కార స్వరం వినిపించినా, కనిపించినా, అనుమానం కలిగినా బిజేపి పెద్దలు చేసే పని ఇడి లేదా మరొక సంస్థను ఉసిగొలపటం. ఇలాంటి సంఘటనల సందర్భాలలో అపవాదు వచ్చినా తప్పించుకోవటానికి, సమాధానం చెప్పటానికి ప్రభుత్వ పెద్దలకు సాకు ఉండనే ఉంది. ‘‘ గత ప్రభుత్వాలు చేశాయి – మేము చేస్తున్నాము ‘‘. ‘‘ నోరు పెద్దగా ఉంటే గెలుపు మనదే’’
దేశ సామాన్యులు మాత్రం ఎటూ తేల్చుకోలేక, నీరస పడి ఎదురు చూపులు చూస్తున్నారు.
– హరిమూర్తి, 8686040254
82, శ్రీనిధి ఓక్లాండ్ ,రేణుక ఎల్లమ్మ కాలనీ, బాచుపల్లి



