6 గ్యారంటీలతో పేదల అభివృద్ధి సాధ్యం.
3000 కోట్ల రూపాయలతో వికారాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో తీర్చిదిద్దుతా.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.
వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జనవరి 3: వికారాబాద్ నియోజకవర్గం మూడు వేల కోట్ల నిధులతో అభివృద్ధి చేసుకుందామని తెలంగాణ శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. బుధవారం బంట్వారం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సభాపతి పాల్గొన్నారు. అనంతరం కోట్ పల్లి బంట్వారం మండలాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందే విధంగా ప్రభుత్వ కృషి చేస్తుందని ఆయన తెలిపారు. అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమంలో సాధ్యమైనంత వరకు అర్హులైన ప్రతి ఒక్కరు ఆరవ తేదీ లోపల దరఖాస్తులు చేసుకోవాలని , ప్రస్తుతం అందుబాటులో లేని వారికి తిరిగి నాలుగు నెలల తర్వాత దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలను అర్హులందరూ వినియోగించుకోవాలని సభాపతి ఈ సందర్భంగా తెలిపారు.
లబ్ధిదారులకు నష్టం వాటిల్లకుండా గత ప్రభుత్వం మంజూరు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను యధావిధిగా అందజేయడం జరుగుతుందని, మునుముందు లక్ష 116 తో పాటు తులం బంగారము లేదా లక్షా అరవై వేల రూపాయల చెక్కులను అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఆలంపల్లి లావణ్య శ్రీనివాస్, జెడ్పిటిసి కోటిపల్లి సంతోషా రాజు, మండల ప్రెసిడెంట్ వెంకటేష్,ఎంపీపీలు ప్రభాకర్ , శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ పద్మ వెంకటేష్, తాసిల్దార్ ప్రవీణ్ కుమార్, నాయకులు నుర్నంపల్లి నర్సింలు శ్రీకాంత్ రెడ్డి వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.





