ఇండియన్‌ పొలిటికల్‌ లీగ్‌(ఐపీఎల్‌) కప్‌ బీజేపీదే..

400 స్థానాలతో మూడోసారి మోదీ ప్రభుత్వం ఏర్పాటు తథ్యం
 రాష్ట్రంలోనూ టీపీఎల్‌(తెలంగాణ పొలిటికల్‌ లీగ్‌) స్టార్ట్‌..
 కాంగ్రెస్‌ టీమ్‌కు ప్లేయర్స్‌ లేరు.. బీఆర్‌ఎస్‌ టీమ్‌ సభ్యుల్లో నిరాశ
 కరీంనగర్‌లో బీజేపీని బంపర్‌ మెజారిటీతో గెలిపించండి
 బూత్‌ విజయ్‌ సంకల్ప అభియాన్‌ సమావేశంలో బండి సంజయ్‌ వ్యాఖ్యలు

కరీంనగర్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 13 : ఐపీఎల్‌ క్రికెట్‌ మాదిరిగానే దేశ రాజకీయాల్లోనూ ఇండియన్‌ పొలిటికల్‌ లీగ్‌(ఐపీఎల్‌) మ్యాచ్‌ నడుస్తుందని, ఒకవైపు నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ టీమ్‌ బరిలో దిగితే.. మరోవైపు ఐఎన్డీ కూటమి పేరుతో గుంట నక్కల పార్టీలన్నీ టీమ్‌గా బరిలో ఉన్నయని, ఆ కూటమి టీమ్‌ను చిత్తు చేసి 400 స్థానాలతో కేంద్రంలో మోదీ ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హ్యాట్రిక్‌ కొట్టబోతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోనూ తెలంగాణ పొలిటికల్‌ లీగ్‌(టీపీఎల్‌) ఆట మొదలైందన్నారు. కిషన్‌ రెడ్డి ఆధ్వర్యంలో తనతో సహా 17 మంది సభ్యుల టీమ్‌ బరిలోకి దిగామని, అటువైపు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ గుంట నక్కల టీమ్‌లు బరిలో దిగాయని, చీకటి ఒప్పందాలతో ఆ రెండు పార్టీలు ఒక్కటైనప్పటకీ రెండిరటినీ చిత్తుగా ఓడిరచి టీపీఎల్‌ కప్‌ను గెలవబోతున్నామని బండి సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అతి తక్కువ వ్యవధిలో అత్యంత ప్రజావ్యతిరేకతను ఎదుర్కున్న ఏకైక పార్టీ కాంగ్రెస్సేనని ఆయన వ్యాఖ్యానించారు.

రైతులంతా కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం రాశులు పోసినా కొనేనాథుడే లేరన్నారు. తాలు, తరుగు పేరుతో దోచుకునేందుకు దలారులు సిద్ధమైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కరీంనగర్‌లోని రాజశ్రీ గార్డెన్‌లో శనివారం కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్‌ బూత్‌ స్థాయి నాయకులతో ‘బూత్‌ విజయ సంకల్ప్‌ అభియాన్‌’ సమావేశం జరిగింది. ఇందులో బండి సంజయ్‌ తోపాటు ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాశ్‌ జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలపై నిప్పులు చెరిగారు. బండి సంజయ్‌ మాట్లాడుతూ…ఇంత పెద్ద ఎత్తున హాజరైన కార్యకర్తలను చూస్తే జోష్‌ వొస్తుందని, తనను ఓడిరచడానికి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు కుట్ర చేస్తున్నాయని, అందులో భాగంగానే తనను అప్రదిష్టపాలు చేసేందుకు దుష్ప్రచారం చేస్తున్నారని, వాళ్లెన్ని కుట్రలు చేసినా జనం పట్టించుకోరుని అన్నారు.

ఇక తెలంగాణలో కూడా కిషన్‌ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రీమియర్‌ లీగ్‌(టీపీఎల్‌) గేమ్‌ ప్రారంభమైందని అన్నారు. అటువైపు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ గుంట నక్కల టీమ్‌లు పోటీ పడుతున్నయని ధ్వజమెత్తారు. కిషన్‌ రెడ్డి టీమ్‌లో తనతోపాటు డీకే అరుణ, ధర్మపురి అరవింద్‌, ఈటల రాజేందర్‌, రఘునందన్‌ రావు, మాధవీలత, గోమాస శ్రీనివాస్‌, కొండా వెంకటేశ్వర్‌ రెడ్డి, బీవీ పాటిల్‌, సైదిరెడ్డి, వినోద్‌ రావు, బూర నర్సయ్యగౌడ్‌, నగేశ్‌, భరత్‌ సహా 17 మంది సభ్యులం ఉన్నామని తెలిపారు. కిషన్‌ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ టీమ్‌ అత్యధిక మెజారిటీతో ఐపీఎల్‌ కప్‌ను గెలవబోతున్నమని ధీమా వ్యక్తం చేశారు. తాను  కాంగ్రెస్‌ హామీలపై ప్రశ్నిస్తుంటే…కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలు ఒక్కటై తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్‌ నుండి వరంగల్‌, ఎల్కతుర్తి నుండి సిద్ధిపేట రోడ్ల విస్తరణ సహా కరీంనగర్‌ పార్లమెంట్‌ అభివృద్ధి కోసం రూ.12 వేల కోట్లకుపైగా తీసుకొస్తే…

వారేం చేశారని బీఆర్‌ఎస్‌ ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. తాను ఎంపీగా ఉన్నప్పుడే నిధులు తీసుకొచ్చి ప్రధానితో జాతీయ రహదారుల విస్తరణ పనులు ప్రారంభిస్తే….తన వల్లే అయ్యిందని బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి ప్రచారం చేసుకుంటున్నాడని విమర్శించారు. కరీంనగర్‌ ఆర్వోబీ నిర్మాణానికి  కొత్తగా వొచ్చిన సేతు బంధన్‌ స్కీమ్‌ నుండి కేంద్రం నుండి మొత్తం నిధులు తీసుకొచ్చి ఆర్వోబీ పనులు చేపట్టామని తెలిపారు. ఇక్కడి మంత్రి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని. తాను చేసిన అభివృద్ధిపై బుక్‌ లెట్‌ ముద్రించి ఇంటింటికీ పంపించినా కూడా.. ఆయన ఇష్టారీతిలో విమర్శిస్తున్నాడని అన్నారు. కరీంనగర్‌ ఫ్రజలు ఆశీర్వదించి తనను ఎంపీగా గెలిపిస్తే…కేసీఆర్‌ రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు రాష్ట్రమంతా తిరిగి ప్రజల పక్షాన పోరాడానని చెప్పారు.

1600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచానని తెలిపారు. ఇక మోదీ 370 ఆర్టికల్‌ను రద్దు చేసి కాశ్మీర్‌కు స్వతంత్య్రం కల్పించారని. ట్రిపుల్‌ తలాఖ్‌ను రద్దు చేశారని, రామ మందిరాన్ని నిర్మించారని తెలిపారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీ డిక్లరేషన్‌ను ప్రకటించినప్పుడే..వాళ్ల కుట్రలు ఏందో ప్రజలు అర్ధం చేసుకోవాలని, హిందూ సమాజమంతా ఏకమై బుద్ది చెప్పాలని కోరారు. హిందూ ధర్మ రక్షణ కోసం నిరంతరం పోరాడుతున్నది బీజేపీయేనని, బీజేపీని గెలిపించకపోతే..హిందూ ధర్మ రక్షణ కోసం పోరాడే వాళ్లే ఉండరనే విషయాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని బండి సంజయ్‌ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *