ఇం‌కా కొలిక్కిరాని కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టుల పొత్తు ..

రానున్న ఎన్నికలకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతుంటే వామ పక్షాలు ఎటూ తేల్చుకోలేక పోతున్నాయి. వొచ్చే  అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేద్దాం అని చెప్పిన బిఆర్‌ఎస్‌ ఆఖరి నిమిషంలో చెయ్యి ఇచ్చింది. బిఆర్‌ఎస్‌ ఇం‌త ఎదురుదెబ్బ కొడుతుందని ఊహించని వామపక్షాలకు దిక్కు తోచకుండా పోయింది. పైకీ గంభీరంగా  తాము ఒంటరి పోరాటం జంటగా (రెండు పార్టీలు) చేస్తామని చెబుతున్నప్పటికీ పొత్తులేకుండా ఎన్నికలను ఎదుర్కోలేమన్న భయం ఆ పార్టీలకు లేకపోలేదు. ఎప్పుడైతే బిఆర్‌ఎస్‌ ‌రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకుగాను 115 ప్రకటించిందో ఇక తమకు కాంగ్రెసే దిక్కని ఆ పార్టీతో మంతనాలు ప్రారంభించింది. కాంగ్రెస్‌ ‌తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణిక్యం ఠాకూర్‌ ఆ ‌పార్టీలను ఇప్పటికే ఆహ్వానించి మంతనాలు జరిపారు. అయితే సీట్ల కేటాయింపు విషయంలో పొసగటంలేదు. మొత్తం మీద సిపిఐ, సిపిఎం కలిసి దాదాపు పది స్థానాలను డిమాండ్‌ ‌చేస్తున్నట్లు తెలుస్తున్నది. కాని, కాంగ్రెస్‌ ‌పార్టీకి ఇటీవల కాలంలో పెరుగుతున్న డిమాండ్‌ ‌దృష్ఠ్యా అన్ని స్థానాలను •వామపక్షాలకు ఇచ్చే పరిస్థితిలో కాంగ్రెస్‌ ‌లేదు. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించి బిఆర్‌ఎస్‌ ‌ప్రచార రంగంలో ముందుకు దూసుకు పోతున్నది.

బిజెపి ఆశావహులనుండి దరఖాస్తుల స్వీకరణ పూర్తి చేసింది. రేపొ మాపో వారు తమ అభ్యర్ధులను ప్రకటించే అవకాశాలున్నాయి. కాంగ్రెస్‌ ‌కూడా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పూర్తి చేసి, స్క్రూటినీ కూడా చేసింది. అధిష్టానం ఈ జాబితా పైన ముద్రవేయాల్సి ఉంది. ఈ సమయంలో ఇప్పుడు వామపక్షాల పొత్తు ఇబ్బందికరంగా మారింది. మునుగోడు ఎన్నికల్లో వామపక్షాలను కౌగలించుకున్న బిఆర్‌ఎస్‌, ఇలాగే కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడుదామని పబ్లిక్‌ ‌గానే ప్రకటించింది. మునుగోడు ఎన్నికల్లో వారు చేసిన సహాయానికి బిఆర్‌ఎస్‌ అధినేత కృతజ్ఞతలు కూడా తెలిపాడు. కాని పొమ్మనలేక పొగ పెట్టినట్లు ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించడంద్వారా వారికి ఒట్టి చెయ్యి చూపించడంతో కాంగ్రెస్‌తో పొత్తుకోసం వెంపర్లాడాల్సిన పరిస్థితి ఇప్పుడు ఆ పార్టీలకు ఏర్పడింది. మునుగోడు ఎన్నికల నాటికి బిఆర్‌ఎస్‌ ‌వర్సెస్‌ ‌బిజెపిగా ఉన్నదల్లా, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిఆర్‌ఎస్‌ ‌వర్సెస్‌ ‌కాంగ్రెస్‌గా పరిస్థితులు మారాయి.

బిజెపిని వ్యతిరేకించడమే ప్రధాన లక్ష్యంగా వామపక్షాలున్నాయి. ఆ మేరకు జాతీయ స్థాయిలో బిజెపితో ఢీ కొనేందుకు ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా ఏర్పడిన ఇండియా పార్టీలో వామపక్షాలు కూడా ఉన్నాయి. ఆ మైత్రితో రాష్ట్రంలో కూడా ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోవాలని ఆ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే వామపక్షాలు అడుగుతున్న స్థానాలను కాంగ్రెస్‌ ఇచ్చే పరిస్థితిలోలేదు. ఇప్పటికే ఆయా స్థానాల్లో పోటీకి కాంగ్రెస్‌లోని పలువురు నిర్ణయించుకున్నారు. వామపక్షాలు మాత్రం తమకు బలమున్న స్థానాలను ఇవ్వకపోతే గెలిచేదెట్లా అంటున్నాయి. సిపిఐ దాదాపు అయిదు స్థానాలను అడుగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, వైరా, నల్లగొండ జిల్లాలోని మునుగోడు, ఆదిలాబాద్‌ ‌జిల్లాలోని బెల్లంపల్లి, కరీంనగర్‌లోని హుస్నాబాద్‌లను డిమాండ్‌ ‌చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇందులో కొత్తగూడెం నియోజకవర్గంనుండి తాను పోటీ చేస్తానని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మొదటినుండీ చెబుతున్నాడు.

బిఆర్‌ఎస్‌తో పొత్తు ఉంటుందనుకుంటున్నప్పటి నుండీ ఆయన తాను అదే స్థానంనుండి పోటీ చేసే ప్రకటనలు చేస్తున్నాడు. కాని, ఖమ్మం జిల్లా రాజకీయాల్లో అనేక మార్పులు జరిగాయి. ఇక్కడి పన్నెండు నియోజక వర్గాలను తాను ఒక్కడినే ఒంటి చేత్తో గెలిపిస్తానని వాగ్దానం చేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు నియోజక వర్గాల్లో తన వారిని నిలుపుకుని గెలిపించుకునే ఆలోచనలో ఉన్నాడు. తను కూడా అయితే కొత్తగూడెం లేదా పాలేరు నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానంలో నిలబడే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఇకపోతే భద్రాచలంతో పాటు మధిర, పాలేరు, మిర్యాలగూడ నియోజకవర్గాలను సీపీఎం కోరుకుంటున్నది. ఇవన్నీ కాంగ్రెస్‌కు బలమైన స్థానాలే. వీటిల్లో మధిర, భద్రాచలంలో కాంగ్రెస్‌కు సిట్టింగ్‌ ఎంఎల్‌ఏలు ఉన్నారు. మధిరలో ప్రస్తుతం శాసనసభలో కాంగ్రెస్‌ ‌పక్ష నాయకుడు మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తుండగా, భద్రాచలంలో సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకుడు పోడెం వీరయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇకపోతే పాలేరు విషయానికి వొస్తే  అదో పెద్ద పీఠముడి అయింది. పాలేరు నుండి తాను పోటీచేస్తానని సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా ముందుగానే ప్రకటించారు.

కాంగ్రెస్‌ ‌తీర్థం తీసుకోబోతున్న తుమ్మల నాగేశ్వర్‌రావు కోరుకుంటున్నదీ పాలేరు నియోజకవర్గమే. ఆయన కాని పక్షంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉండనే ఉన్నాడు. కాగా వైఎస్‌ఆర్‌టిపి పార్టీ అధినేత్రి వైఎస్‌ ‌షర్మిల చాలా కాలం కిందనే తాను పాలేరునుండి పోటీ చేస్తానని ప్రకటించింది. ఆ మేరకు అక్కడ తన పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పరుచుకుంది. అయితే మారిన పరిస్థితుల్లో ఆమె తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నది. ఒక వేళ విలీనం జరిగినా ఆమె డిమాండ్‌లలో మొదటిది పాలేరునుండి పోటీచేస్తాననటమే. దీంతో వామపక్షాలకు అన్నీ ఎదురు దెబ్బలే ఎదురవుతున్నాయి. దీంతో సిపిఐ కోరుకుంటున్న అయిదు కాకుండా వారికి మూడు స్థానాలిస్తామని కాంగ్రెస్‌ ‌సర్దిచెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇంకా సిపిఎం సంగతి ఎటూ తేలటంలేదు. మొత్తం మీద జాతీయ పార్టీలైన ఈ వామపక్షాలు పొత్తులేకుండా ఒంటరిగా పోటీచేసే పరిస్థితులైతే కనిపించడంలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *