దేశంలోని పెద్ద పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టుల లో అత్యంత చిన్నదైన 2,590 చ.కి.మీ కు పై ప్రాంతాల నుండి వస్తున్న వరద వలన కడెం ప్రాజెక్టు కు నిరంతరం వరద ప్రమాదం పొంచి ఉంటున్నది. గోదావరి ఉపనది కడెం వాగు మీద నిర్మాణ సమయంలోనే,1958 ఆగస్టు నెలలో ఊహించని వరదలతో ఈ ప్రాజెక్టులో కొంత భాగం కొట్టుకుపోయింది. ఇటీవల వరదల్లో ప్రాజెక్ట్ కట్టకు కాలువకు గండ్లు పడ్డాయి. అకస్మికంగా వస్తున్న వరదల వలన తరుచుగా విపరీతమైన పరిస్థితులు ఏర్పడి కడెం లాంటి చిన్న నదులపై నీటి సామర్థ్యం కొలిచే సాధనాలు లేనందువలన డ్యామ్‌కు చేరే వరకు వరద నీరు అంచనా వేయలేకపోవడం ఒక కారణం అవుతున్నది. కుండ ఆకారంలో గుండ్రంగా ఉండే కడెం ప్రాజెక్ట్ పై భాగంలో భారీ వర్షాలు పడినప్పుడు అన్ని వైపుల నుంచి ఒకేసారి నీరు వస్తున్నది. తక్కువ సామర్థ్యం కలిగి ఉండడం వలన డ్యామ్ అతి త్వరగా నిండుతున్నది. ఆధునిక సాంకేతికత సమాచార వ్యవస్థతో ముందే వాతావరణ సమాచారం అందుతున్నది. ప్రాజెక్టులోకి వచ్చే వరదను ప్రతి 30 నిమిషాలకు అంచన వేసుకొని తగు విధంగా నిర్ణయాలు ఎప్పటికప్పుడు తీసుకుంటుంటే విపత్కర పరిస్థితులు రాకుండా నివారించవచ్చు. కడెం ప్రాజెక్టుకు ఆకస్మిక వరదలు నివారించేందుకు కుంతాల జలపాతం పై భాగంలో కుప్టి గ్రామం వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలన్న ప్రతిపాదనను అత్యంత వేగంగా చేపట్టాలి.
కుప్టి ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు లభించినవి. ఈ ప్రాజెక్ట్ నిర్మాణమయితే కడెం డ్యామ్‌లోకి ఎంత వరద, ఎన్ని గంటల్లో రాబోతున్నది కచ్చితంగా తెలుస్తుంది. అప్పుడు డ్యామ్‌లో నీటి మట్టం పూర్తి ప్రాజెక్టు నిలువ సామర్థ్యం (ఎఫ్ఆర్ఎల్) దాటకుండా చూసుకోవచ్చు అని నీటి పారుదల శాఖ నిపుణులు తెలుపుతున్నారు.
మొన్నటి బీకర వరద ప్రళయం నుండి కడెం రక్షణకు నడుము బిగించిన గ్రామ యువత మరోసారి ప్రకృతి విసిరిన సవాలుకు ఎదురుగా నిలిచి గెలిచినారు. జరగబోతున్న భీకరమైన నష్టం జరగకుండా కాపాడినారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే రేఖానాయక్, కలెక్టర్ వరుణ్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడూ సూచనలు చేస్తున్నా, వరద ఉదృతమైన సమయంలో గేట్లు తెరుచుకోకపోవడం యంత్రాంగాన్ని ఆందోళనకు గురి చేసింది. ఇలాంటి సమయంలోనే మేమున్నామంటూ స్థానిక యువత రంగంలోకి దిగినది. గేట్లు తెరిచేందుకు వారి శ్రమ వెలకట్టలేనిది. వారి సాహసం ప్రశంసలకందనిది…
స్థానిక యువకులు 4 గేట్లను చేతులతో తిప్పుతూ పూర్తిగా పైగా ఎత్తినారు. కడెం ప్రాజెక్టు నుంచి 15 గేట్ల ద్వారా 2లక్షల 30 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేయగలిగినారు. గేట్లపై నుంచి నీరు పారుతున్నా దాదాపు దాదాపు 40 మంది యువకులు అత్యంత సాహసంతో 15 ఫీట్ల వరకు గేట్లను పైకి ఎత్తినారు. భారీ వరద నుంచి ప్రాజెక్టును కాపాడిన అభినవ కొమురం భీముళ్ళు వారు చేసిన అద్భుతమైన సాహసోపేత పనిని స్థానికులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయి ఆనంద భాష్పాలు రాల్చినారు. తమ ప్రాజెక్టును కాపాడుకోవాలనే తపనతో అతి భయంకరంగా మారుతున్న వరదను లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి గేట్లను తెరిచినారు. స్థానిక యువత చేసిన భగీరథ ప్రయత్నం కొనియాడ తగినది. ప్రతిసారి ఇలాంటి ఉత్పాదన జరగకుండా వెంటనే అన్ని గేట్లకు మరమ్మత్తులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి వరద బీభత్సం పునరావృతం కాకుండా యంత్రాంగం చూడాలి. ఇంతేగాక తరచుగా గేట్లకు మరమ్మత్తులు చేస్తూ సులభంగా పైకి కిందికి జరిపే విధంగా సరి చేయాలి. ఈ మహా విపత్తు నుండి కాపాడిన యువకులకు ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు వీరికి తగు విధముగా ఉపాధి కల్పిస్తాడని ఆశిద్దాం.
దండంరాజు రాంచందర్ రావు
రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్
సింగరేణిభవన్ హైదరాబాద్
9849592958




