ఆస్తి పన్నులు వసూలు వంద శాతం ప్రత్యేక దృష్టి పెట్టాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: జిల్లాలోని మున్సిపాలిటీలలో ఆస్తి పన్ను వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరం 2023-24 వంద శాతం జరిగేలా ప్రత్యేక దృష్టి సారించాలని  ఆదేశించారు.సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో బుధవారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో భాగంగా జిల్లాలోని మున్సిపాలిటీలలో ఆస్తి పన్ను వసూళ్లపై జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్-ప్రజ్ఞాపూర్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీ కమిషనర్లు, మున్సిపల్ అధికార వర్గాలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో నిర్మాణ దశలో ఉన్న పలు భవనాల నిర్మాణం, పురోభివృద్ధిపై ఆరా తీశారు. పెండింగులో ఉన్న పలు భవనాల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు.ప్రతీ మున్సిపల్ కమిషనర్ ఆయా మున్సిపాలిటీ పరిధిలోని వార్డులో పర్యటించి చెత్త సేకరణ, డంపింగ్ యార్డు గురించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారికి భారీ జరిమానాలు విధించాలని కమిషనర్లకు సూచించారు.పెండింగులోని వైకుంఠ ధామాల పనులు వెంటనే చేపట్టాలని, జిల్లాలో వచ్చే వాన కాలం నాటికి హరిత హారం కార్యక్రమానికి సంబంధించి నర్సరీలలో మొక్కల పెంపకం జరపాలని, ఇప్పటికే అన్నీ మున్సిపాలిటీలకు బ్యాగులను అందజేసినట్లు, ఆ బ్యాగులలో మట్టిని నింపే ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని కమిషనర్లకు ఆదేశించారు.
నర్సరీలలో వివిధ రకాలైన  మొక్కలకు సంబంధించి గుల్మోరర్, గన్నేరు, టేకోమా, రెయిన్ పిస్ లాంటి విత్తనాలను  బ్యాగులలో పెట్టే ప్రక్రియ సైతం వేగంగా పూర్తి చేయాలని సూచించారు.జిల్లాలోని అన్నీ మున్సిపాలిటీలలో పనులన్నీ లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.ఈ సమీక్షా సమావేశంలో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక,  హుస్నాబాద్, చేర్యాల మున్సిపల్ కమిషనర్లు సంపత్ కుమార్, విద్యాధర్, గణేశ్, రాజశేఖర్, రాజేంద్రకుమార్, మెప్మా పీడీ హనుమంత్ రెడ్డి, మున్సిపల్ మేనేజర్లు, రెవెన్యూ ఆఫీసర్లు, డిటిసిపిఓ వందన తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *