హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 08 : సనాతాన ధర్మపరిరక్షణకు, వేద సంప్రదాయాలు కాపాడేందుకు, ప్రాచీన విలువలను కాపాడుకునేందుకు టీటీడీ పాలకమండలి కట్టుబడి పనిచేస్తుందని టీటీడీ బోర్డు చైర్మన్ బి.కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం హిమాయత్ నగర్ టీటీడీ లోకల్ అడ్వయిజరీ కమిటీ అధ్యక్షుడిగా డి.వి.ఆర్.కె.ప్రసాద్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రధాన నగరాల్లో ఉన్న ఆలయాలకు లోకల్ అడ్వయిజరీ కమిటీలను వేసి ఆలయాలను అభివృద్ధి పథంలో నడిపించేలా కృషి చేస్తున్నామని అన్నారు. గడిచిన నాలుగేళ్ళలో టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా సుమారు 2500 లకు పైగా ఆలయాలను నిర్మించడంతో పాటు కొన్నింటిని పునర్నిర్మించామని అన్నారు. వేద సంస్కృతిని కాపాడటంతో పాటు వేద విద్యార్థుల ఆర్ధిక స్థితిగతులు బాగుపడేలా ఎప్పటికప్పుడు టీటీడీ అనుబంధ విశ్వ విద్యాలయాలు కృషి చేస్తున్నాయని అన్నారు. ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం తీసుకొచ్చేందుకు టీటీడీ ఆధ్వర్యంలోని హిందూ ధర్మప్రచార పరిషత్ ద్వారా నిత్యం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో వాటిని మరింతగా పెంచుతామని అన్నారు. దళిత గోవిందను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. అనంతరం డి.వి.ఆర్.కె.ప్రసాద్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. రెండేళ్ల పాటు ఈ పదవీ బాధ్యతలు కొనసాగుతాయన్నారు. హిమయత్ నగర్‌తో పాటు నగరంలోని ఆలయాల బాధ్యత కూడా ఇందులో ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన లోకల్ అడ్వయిజరీ కమిటీ అధ్యక్షుడు డి.వి.ఆర్.కె.ప్రసాద్ మాట్లాడు తూ తనపై నమ్మకం ఉంచి అధ్యక్ష పదవిని కేటాయించినందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, టీటీడీ బోర్డు చైర్మన్ బి.కరుణాకర్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం



