- యువతకు ఉద్యోగాలను దూరం చేసే యత్నం
- అగ్నిపథ్ పథకంపై మండిపడ్డ మంత్రి హరీష్
- సికిందరాబాద్ అల్లర్ల వెనుక టిఆర్‌ఎస్
- హస్తముంటే యుపి, బీహార్‌లలో ఎవరి హస్తముందని ప్రశ్న
నిజామాబాద్, ప్రజాతంత్ర, జనవరి 16 : అగ్నిపథ్ పథకంపై కేంద్రం వైఖరిని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తప్పుబట్టారు. కేంద్రం తీసుకున్న అసంబద్ధ నిర్ణయం కారణంగా దేశం అట్టుడుకోందని, బీజేపీ ప్రతి ప్రతి ఒక్కరి ఉసురుపోసుకుంటుందని హరీష్ రావు మండిపడ్డారు. మోడీ సర్కారు ఆర్మీ ఉద్యోగాలను సైతం యువతకు దూరం చేసే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. వేల్పూర్ మండలం మోతెలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఆయన అగ్నిపథ్ స్కీమ్ యువతకు అర్థం కాలేదని కేంద్రం అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. అగ్నిపథ్ పేరుతో కేంద్రం ఆర్మీని ప్రైవేటుపరం చేసి..సైనిక ఉద్యోగాలను కాంట్రాక్టు జాబ్‌లుగా మార్చే కుట్ర చేస్తుందని హరీష్ రావు ఆరోపించారు. కేంద్రాన్ని ప్రశ్నించేందుకు వెళ్లిన పిల్లలను కాల్చిచంపడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
సికింద్రాబాద్‌లో విధ్వంసంవెనుక టీఆర్‌ఎస్ పార్టీ ఉందన్న బండి సంజయ్ ఆరోపణలపై హరీష్ స్పందించారు. సికింద్రాబాద్‌లో దాడులు టీఆర్‌ఎస్ చేయిస్తే..యూపీ, బీహార్ లో జరిగిన ఆందోళనల వెనుక యోగి, నితీష్ కుమార్ ఉన్నారా అని ప్రశ్నించారు. అగ్నిపథ్ వద్దన్న యువకులను కాల్చి చంపుతున్నారని మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్మీ ఉద్యోగాలకు కేంద్ర మంగళం పాడుతున్నదని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో రూ.37 కోట్ల వ్యయంతో చేపట్టిన వంద పడకల దవాఖాన నిర్మాణానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి హరీష్ మాట్లాడుతూ.. ఆర్మీని ప్రైవేట్‌పరం చేసే కుట్ర జరుగుతు న్నదని ఆరోపించారు.
కేంద్రం నిర్ణయంతో దేశంలో అగ్ని రాజుకుందని చెప్పారు. బీజేపీ నేతలు బండి సంజయ్, డీకే అరుణ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ మాటలు తీయగా, చేతలు చేదుగా ఉన్నాయన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ ప్రజావ్యవతిరేక నిర్ణయాలతో ప్రతి ఒక్కరి ఉసురు పోసుకుంటున్ననది చెప్పారు.



