(12 అక్టోబర్ ‘‘ప్రపంచ ఆర్థరైటిస్ దినం’’ సందర్భంగా)
కీళ్ళ వాపులు, మస్క్యులోస్కెలిటల్ రుగ్మతలకు సంబంధించిన వ్యాధులను ఆర్థరైటిస్ అంటాం. కీళ్ళవాపు వ్యాధితో కీళ్ళనొప్పులు, కదలికలు తగ్గడం, కీళ్ళు కదలకుండా దృఢంగా మారడం వంటి పలు సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అన్ని వయస్సుల జనంలో కనిపించే ఆర్థరైటిస్ రోగ తీవ్రత, వాటిలో రకాన్ని బట్టి చికిత్స పద్దతులు నిర్ణయించబడుతాయి. సర్వసాధారణ ఆర్థరైటిస్ రోగాలలో ఆస్టియోఆర్థరైటిస్, రిమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్ (వేళ్ళ దగ్గర పుండు), లూపస్ (చర్మవృక్క వికార రోగం) ముఖ్యమైనవి. కీళ్ళవాపు వ్యాధితో శరీర కదలికల్లో మార్పు, పనులు సక్రమంగా చేయలేక పోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆర్థరైటిస్ వ్యాధిగ్రస్థుల్లో నడక, సైక్లింగ్, ఈత లాంటి భౌతిక క్రియలు కష్టమైనప్పటికీ, వాటితోనే కొంత ఉపశమనం కూడా కలుగుతుంది. శరీర బరువు తగ్గడంతో మోకాళ్లపై భారం తగ్గిపోయి కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి.
ప్రపంచ ఆర్థరైటిస్ దినం-2022 నినాదం:
రుమాటిక్ అండ్ మస్క్యులోస్కెలిటల్ వ్యాధుల (ఆర్థరైటిస్ వ్యాధుల) పట్ల ప్రజల్లో అవగాహన, జీవనశైలిలో మార్పులు, తొలి దశలోనే గుర్తించడం, కీళ్ళనొప్పులతో బాధపడే వారు తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆర్థరైటిస్ రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియచేయటానికి ప్రతియేటా 12 అక్టోబర్ రోజున ‘ప్రపంచ కీళ్ళవాపు లేదా ఆర్థరైటిస్ దినం’’ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. 1996లో అంతర్జాతీయ ఆర్థరైటిస్, రుమటిజమ్ సంస్థ నేతృత్వంలో ప్రపంచ ఆర్థరైటిస్ దినం ప్రవేశ పెట్టబడింది. ప్రపంచ ఆర్థరైటిస్ దినం-2022 నినాదంగా ‘లెట్ అజ్ గెట్ ఫిజికల్’ అనే అంశాన్ని తీసుకొని అవగాహన కల్పిస్తున్నారు. తొలి దశలో (12 వారాల లోపు) గుర్తించిన వారికి సులభంగా నియంత్రించబడే ఆర్థరైటిస్, ఆలస్యంగా గమనించిన వారిలో తీవ్ర వ్యాధిగా మారి శరీరక శ్రమ చేయలేకపోవడం, దినచర్యలో క్రియాశీలత క్షీణించడం లాంటి పరిణామాలకు దారితీస్తుంది. అనువంశికంగా కూడా సంక్రమించగల ఆర్థరైటిస్ వ్యాధి పొగ త్రాగడం, స్థూలకాయం, నిష్క్రియాత్మక జీవనశైలి, కీళ్ళ/కండరాలపై పని ఒత్తిడి, ప్రమాదాలు లాంటి కారణాలతో కీళ్ళ వాపు వ్యాధి తీవ్రత (ఆర్థరైటిస్) పెరుగుతుంది.
ప్రపంచ సమస్యగా ఆర్థరైటిస్:
ప్రపంచవ్యాప్తంగా 350 మిలియన్ల ప్రజలు ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నారు. దాదాపు విశ్వ జనాభాలో ఒక శాతం ప్రజలు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో సతమతం అవుతున్నారు. వయస్సు 60 ఏళ్ళు దాటిన మహిళల్లో 18 శాతం, పురుషుల్లో 10 శాతం ప్రజలు ఆస్టియోఆర్థరైటిస్‌తో బాధ పడుతున్నారు. ఇండియాలో 15 శాతం ప్రజలకు (180 మిలియన్లు) కీళ్ళవాపు సమస్యలు ఉన్నాయి. ఆరోగ్యకర జీవనశైలి (పొగ తాగక పోవడం, మానసిక ఒత్తిడి తగ్గించడం, చక్కగా నిద్ర పోవడం, ఆల్కహాల్‌కు దూరంగా ఉండడం), ఆరోగ్యకర ఆహారపు అలవాట్లు (సమతుల పోషకాహారం, ఉప్పు మరియు చక్కెరను తగ్గించడం), వైద్యులు లేదా ఫిజియోథెరపిస్టు సూచనల మేరకు శారీరక శ్రమ (సైక్లింగ్, వాకింగ్, గార్డెనింగ్, స్విమ్మింగ్, యోగా వంటివి) పాటించడం ద్వారా ఆర్థరైటిస్ అదుపు చేయపడుతుంది.రుమటాయిడ్ ఆర్థరైటిస్ వయసుతో ప్రమేయం లేకుండా రావచ్చేమో కాని వయస్సుతో పాటు వచ్చే అవకాశం ఆస్టియోఆర్థరైటిస్‌కు ఉంటుంది. ఆస్టియోఆర్థరైటిస్ అదుపు చేయడానికి నీటిని ఎక్కువగా తాగడం(2 లీటర్ల కన్న ఎక్కువ), నూనెలు/కొవ్వులను తగ్గించడం, స్వీట్స్ మరియు సాఫ్ట్ డ్రింక్స్ తగ్గించడం, పోషకాహారం తీసుకోవడం, నిపుణుల సూచనలతో శారీరక వ్యాయామం చేయడం లాంటివి పాటించాలి.
రుమటాయిడ్ ఆర్థరైటిస్:
రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనబడే దీర్ఘకాలిక రుగ్మత కారణంగా చర్మం, కళ్ళు, ఊపిరితిత్తులు, గుండె, రక్తనాళాలతో పాటు రోగనిరోధకశక్తిని ప్రభావితం చేస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ తీవ్రతతో ఎముకల క్షయం మరియు కీళ్ళ వైకల్యంతో పాటు వాపుతో తీవ్రమైన నొప్పి వస్తుంది. వయసు, లింగం, అనువంశికత, పొగ తాగడం, పర్యావరణ కాలుష్యం, అధిక బరువు కారణాలతో రుమటాయిడ్ ఆర్థరైటిస్ రావచ్చు. ఈ వ్యాధి ఫలితంగా పొడి కళ్ళు / నోరు, అసాధారణ శరీర కూర్పు, కీళ్ళ వాపు, కీళ్ళ దృఢత్వం తగ్గడం, మూత్రపిండాలు, లాలాజల గ్రంథులు, నరాల కణజాలం, ఎముకన మజ్జ, నోడ్యూల్స్, గుండె సమస్యలు, ఊపిరితిత్తుల జబ్బులు, కార్పాల్ టన్నెల్ సిండ్రోమ్ రుగ్మతలు కలుగుతాయి. దీనిని తగ్గించడానికి వేడి లేదా చల్లని ప్యాక్స్, తగినంత విశ్రాంతి, వ్యాయామం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధిగ్రస్థులు ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, చేపలు, సోయా గింజలు, అవిసెలు, ఆక్రోట్లు, విటమిన్- ఏ, సి, ఈ కలిగిన ఆహారం, బెర్రీస్, చాక్లెట్స్, పాలకూర, బీన్స్, తాజా పండ్లు, అల్లం, ఫిష్ ఆయిల్, తాజా కూరగాయలు, ఫైబర్ ఫుడ్, బ్రోకొలీ, గ్రీన్ టీ, ద్రాక్ష లాంటి పోషకాహారం తీసుకోవాలి.
కీళ్ళ వాపు సమస్యలు రాకుండా ఉండేలా జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ, వైద్యుల సూచన మేరకు పోషకాహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఆర్థరైటిస్ వ్యాధిగ్రస్థులు వైద్య నిపుణుల సూచనలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాధిని నియంత్రించాలి. చికిత్స కన్న నివారణే మిన్న అని ముందు జగ్రత్త పడుతూ, సంతోషదాయక జీవనయానం చేద్దాం.
డ: బుర్ర మధుసూదన్ రెడ్డి
కరీంనగర్ – 9949700037




