- తమిళి సై సౌందరరాజన్‌కు ఉద్యోగుల శుభాకాంక్షలు
- ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం శుభ పరిణామం..: మంత్రి హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14 : టీఎస్‌ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు, కార్మికులకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుకు నెల రోజుల తర్వాత గవర్నర్ ఆమోదం తెలిపారు. తాను చేసిన 10 సిఫారసుల విషయంలో ప్రభుత్వ స్పందనపై సంతృప్తి చెందినట్లు గవర్నర్ పేర్కొన్నారు. ఆరు దశాబ్దాలకు పైగా కార్పొరేషన్‌గా కొనసాగిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఈ నిర్ణయంతో 43 వేల 373 మంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. నెల రోజుల క్రితం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టి, ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలుపడంతో..ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న ఆర్టీసీ కార్మికుల ఆకాంక్ష ఫలించింది. కేసీఆర్ నాయకత్వంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉద్యమ చరిత్రలో మైలురాయిగా నిలిచిన సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. జీతాలు లేక వారి కుటుంబాలు ఎన్ని ఇబ్బందులు పడినా ఉద్యమానికి ఊపిరు లూదారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వని విధంగా ఆర్టీసీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చి వేతనాలు పెంచారు. ఇతరత్రా సదుపాయాలు కల్పించారు. ఆర్టీసీ మనుగడకు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి భరోసా కల్పించారు.
ఆర్టీసీ బిల్లు కు గవర్నర్ ఆమోదం శుభపరిణామం..: మంత్రి హరీష్ రావు
ఖమ్మం,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14:ఆర్టీసీని ప్రభుత్వం లో విలినాన్ని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం అని మంత్రి హరీష్ రావు అన్నారు.గురువారం ఖమ్మం నగరంలోని పాత కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు మీడియా తో మాట్లాడుతూ..నా ఆర్టీసి కార్మికులకు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు. ఇది కేసీఆర్ ఇచ్చిన బహుమతి.
మీ చిరకాల వాంఛ నెరవేర్చినది కేసీఆర్..ఇక నుండి ఆర్టీసీ కార్మికులు కాదు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు..అని మంత్రి హరీష్ రావు అన్నారు.ఇన్ని రోజులు పెండింగ్ లో పెట్టినప్పటి కి ఇవాళ ఆమోదం తెలిపింది..అని పేర్కొంటూ ధర్మం గెలుస్తుంది అనడానికి ఇదే నిదర్శనం..నాటి పాలకులు ఆర్టీసి అడ్రస్ లేకుండా చేయాలని కుట్రలు పన్నారు..మా ప్రభుత్వం ఆర్టీసీకి కార్మికులకు పట్టం కట్టింది. ప్రభుత్వ ఉద్యోగులను చేసింది..ఇకనుండి కార్మికులు కాదు వారు ప్రభుత్వ ఉద్యోగులు అని స్పష్టం చేసారు.




