ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండలంలో అమలైన దళిత బంధు పైలట్ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయంటూ స్వయంగా దళిత బంధు లబ్ధిదారులు వివిధ మీడియా ఛానల్ లలో వారి సమస్యను వివరించిన విషయం తెల్సిందే. ఇటీవల దళిత బంధు పథకంలో అవినీతి అక్రమాలు జరిగాయంటూ, తమ వద్ద సమాచారం ఉందని రాష్ట్రాన్ని పరిపాలించే స్వయాన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బహిరంగంగా తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ప్రత్యక్షంగా అవినీతి జరిగిందని ప్రకటించిన మరుసటి దినాలలోనే తిరుమలగిరి మండలానికి చెందిన పలు గ్రామాలలోని దళిత బంధు లబ్ధిదారులు వారికి జరిగిన అక్రమాలపై వివిధ ఛానల్ లో తమ గోడును బలంగా విన్నవించు కున్నారు. అవినీతి అక్రమాలు జరిగితే ఒక కమిటీని స్వయాన ముఖ్యమంత్రి వేసి వాటిపైన సమగ్రమైన విచారణ చేపట్టి అవినీతి జరిగిన ఆ సొమ్మునంత రికవరీ చేసి లబ్ధిదారులకు అందించేంత బాధ్యత ముఖ్యమంత్రికి,స్థానిక ఎమ్మెల్యే కు ఉంటుంది. తుంగతుర్తి నియోజకవర్గంలో దళిత బందు పధకంలో అవినీతి జరగలేదని బీఆర్‌ఎస్ నేతలు కానీ స్థానిక ప్రజా ప్రతినిధులు కానీ ముఖ్యమంత్రిని అడిగిన దాఖలాలు లేవు.
అవినీతి అక్రమాలు జరగలేదని బహిరంగంగా చెబుతున్న స్థానిక ప్రజా ప్రతినిధులు విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రజలు అడుగుతున్నారు. పరిపాలన రంగంలో సంక్షేమ పథకంలో అవినీతి జరగడానికి అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ వారి బినామిలుగా చెలమణి అవుతున్న కొంతమంది వ్యక్తులు అయిన తప్పిదాలు చేసినట్లయితే విచారణలో తేలుతుంది అన్న కనీసం పరిజ్ఞానం లేదన్న వాదన వినిపిస్తోంది. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలు ఉంటుంది. ఎలాంటి విచారణకు ఆదేశాలు ఇవ్వకుండా ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్న వాళ్లను అదిరించి బెదిరించి అక్రమ కేసులు పెట్టి బనాయించి భౌతిక దాడులకు దిగి సమాధానం చెప్పుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతున్న ప్రజాప్రతినిధులు బాధ్యతయుతంగా ప్రజలు ప్రశ్నిస్తున్నప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు ఉంటుంది కానీ కనీస విజ్ఞత లేకుండా ఆరోపణలు చేస్తే దాడులు చేయడమే లక్ష్యంగా చేస్తున్న తీరును ప్రజలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ప్రజా ప్రతినిధులు ఇవాళ ప్రశ్నిస్తున్న వారిపై భౌతిక దాడులకు దిగుతూ బెదిరింపులకు పాల్పడుతూ, ఆరోపణలు చేసిన వారిని అంత మోదిస్తామంటూ చెప్పకనే చెబుతూ ఉకుం జారీ చేస్తున్న సంఘటనలు తుంగతుర్తి నియోజకవర్గంలో కొనసాగుతున్నాయని ప్రజలు వాపుతున్నారు.
ప్రధానంగా నియోజకవర్గంలో ఇసుక మాఫియా,భూ అక్రమణులు, గుర్తుతెలియని వ్యక్తులు హత్యలు , హత్యాయత్నం ,అవినీతి ఆరోపణలు తరచూ వింటూనే ఉన్నాము.వందలాది లారీలలో కళ్ళ ముందు ఇసుక తరలిస్తుంటే మౌనం వెనుక ఉన్న రహస్యం ఏంటో ప్రజలకు స్పష్టంగా అర్థం అవుతుందనే చెప్పుకోవచ్చు.ఈ ప్రాంతం వారు ఇంటిని నిర్మాణం చేసుకోవాలంటే ఇసుక దొరకని పరిస్థితి,కానీ వేలకు వేలు లారీలలో మాత్రం ఈ ప్రాంతం నుంచి ఇసుక మాఫియా కొనసాగుతుంది.ఇలాంటి ఆరోపణలపై స్పందించి విచారణకు ఆదేశించే ప్రయత్నం ప్రభుత్వం చేయలేదు.
ప్రజాస్వామిక బద్ధంగా ప్రజలకు సమాధానం చెప్పే ప్రయత్నం ఎన్నడూ చేయలేకనే దాడులు చేస్తున్నరని ప్రజల వాదన వినిపిస్తోంది. ఇటీవల కాలంలో బిఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో స్థానిక ఎమ్మెల్యే దళితులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై పెద్ద దుమారమే లేచింది. దళితులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని అఖిలపక్ష పార్టీల నాయకులు ఎమ్మార్పీఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తిరుమలగిరి కేంద్రంగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు. ఆ సమావేశం నుంచి ఇంటికి వెళ్తున్న అడ్వకేట్ యుగంధర్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది.గతంలో ఇదే నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమకారుడు పాల్వాయి నగేష్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.ఈ రెండు ప్రధాన సంఘటనలపై స్థానిక ప్రజా ప్రతినిధిపై ఆరోపణలు వచ్చాయి.బహిరంగంగా ఇద్దరు పై దాడులు సభ్య సమాజానికి తెలిసినవే కానీ అంతర్గతంగా జరిగిన దాడులు ఎన్నో లేకపోలేదు.ఇద్దరు కూడా మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో తుంగతుర్తి లో మాదిగలను రాజకీయంగా సామాజికంగా అంచి వేసే కుట్రలో భాగమే ఇలాంటి భౌతిక దాడులకు పాల్పడుతున్నారని పల్లెల్లోని మాదిగ వాడలో విస్తృతమైన చర్చ కొనసాగుతుంది.
మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు సామాజిక ఉద్యమకారులపై పట్టపగలే దాడులకు పాల్పడిన వ్యక్తులు ఎవరు ?? దాడులు వెనుక ఉన్నది ఎవరు ?? ప్రశ్నగానే మిగిలిపోతుంది కానీ బహిరంగంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అధికారంలో ఉన్నవారు భరోసా కల్పించడం లేదు. ఇది నియోజకవర్గంలో అడ్డగూడూరు మండల కేంద్రంగా మరియమ్మ సంఘటన దళిత సమాజాన్ని కదిలించింది.దళితులపై దాడులు జరుగుతుంటే దళిత ఎమ్మెల్యేగా ఎందుకు ప్రత్యేక చొరవ తీసుకోవడం లేదనే వాదన లేకపోలేదు.నియోజకవర్గంలో దాడులు అరాచకాలు,భూ దందాలు ,బెదిరింపులు ఫ్యాక్షనిజం ,రౌడీయిజం రోజురోజుకు మితిమీరిపోవడంతో మతాలకు కులాలకు పార్టీలకు అతీతంగా నిరసన కార్యక్రమానికి పూనుకున్న ప్రజాస్వామిక వాదులను అణిచివేస్తున్నారు.. పౌర ప్రజాస్వామిక హక్కులను తుంగతుర్తి నియోజకవర్గంలో లేకుండా పాలన కొనసాగుతుందంటే తెలంగాణ స్వరాష్ట్రం తెచ్చుకుంది ఇందుకేనా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.మాట్లాడితే ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం కనీసం మాట్లాడే హక్కు లేకుండా నియోజకవర్గంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కాలరాయబడుతుంది . సామాజిక మాధ్యమాలలో బహిరంగంగా ఫలానా వ్యక్తులను అంత మోదిస్తాం దాడులు చేస్తాం అంటూ ప్రకటించిన కూడా ఏలాంటి చర్యలు తీసుకోకపోవడమే , సామాజిక ,ప్రజా ఉద్యమకారులపై దాడులు జరగడానికి ప్రధాన కారణం.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కల్పించిన హక్కులలో భాగంగా ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో దళితులపై దాడులు అక్రమ కేసులు అక్రమ అరెస్టులు,పార్టీ ఫిర్యాయింపులు మూకుమ్మడిగా దాడులు చేయడం బెదిరింపులకు పాల్పడడం నిత్య కృత్యం అయింది. సామాజిక మాధ్యమాలలో వివిధ దినపత్రికల్లో ప్రతిరోజు ఏదో ఒకచోట సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. బయటికి వెళ్తే దాడులు తిరిగి ఇంటికి వస్తామా? లేదా? అనే సందిగ్ధంలో ప్రజానీకం ఉంది. ఉవ్వెత్తున ఎగిసి పడిన తెలంగాణ ఉద్యమంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎక్కడ నియోజకవర్గంలో కొనసాగలేదు.
అంగబలంతో అధికార యంత్రాంగం అండతో ఎక్కడ ఏం చేస్తారన్న భయాందోళనలో ప్రజలు ఉన్నారు.
తుంగతుర్తిలో ప్రజాస్వామ్యం ఏ విధంగా అమలు అవుతుందో ఒకసారి సభ్య సమాజం, యావత్తు తెలంగాణ సమాజం ఆలోచన చేసి తుంగతుర్తి,తెలంగాణ ప్రజలకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. తుంగతుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక దందా ,అవినీతి, అక్రమాలు , భూ దందాలు కొనసాగుతున్నప్పటికి ఎవరు వాటిని ప్రోత్సహిస్తున్నారు అనేదానికి ప్రశ్నగానే మిగిలిపోతుంది. సామాజిక ఉద్యమకారులపై దాడులకు పాల్పడుతున్న వారిపట్ల సమగ్ర విచారణ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. ప్రజలకు జవాబు దారితనం లేకుండా సమాధానం చెప్పుకోలేని స్థితిలోకి దిగజారిపోయి జాతుల మధ్య చిచ్చు పెట్టి ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులతో వైరుధ్యం ఏర్పరిచి దాడులను ప్రోత్సహించి చేస్తున్న విధానాలను ప్రజలు గమనిస్తున్నరు. తెలంగాణ వ్యాప్తంగా సభ్య సమాజం స్వరాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి సాధించుకున్నది ఇందుకేనా అనే ప్రశ్న పదేపదే ఉత్పన్నం అవుతుంది. ఆర్భాటంగా అధికారంలోకి వచ్చిన బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు పెద్దగా చేసింది ఏమీ లేదనే చెప్పుకోవచ్చు.
మహబూబ్నగర్ జిల్లాలో బాధ్యతయుతంగా ఉన్న మంత్రి దళితుల కించపరుస్తూ మాట్లాడిన దుస్థితి స్వరాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడడం సభ్య సమాజానికి సిగ్గుచేటుగా భావించాల్సి ఉంది. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం కోసం దళిత సామాజిక వర్గాల వారు తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పాత్ర పోషించారు. ప్రజలు ప్రజాస్వామ్యవాదులు బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు జరిగే పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి. రాష్ట్రంలో తమ హక్కులను తాము కాపాడుకునేందుకు ప్రతి పౌరుడు ప్రశ్నిస్తూ రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకునేందుకు ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది.
– వేముల గోపినాథ్, తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విద్యార్థి




