అంతర్జాతీయ డిమాండ్ ఉన్న పంట
సాగుతో రైతులకు ఉజ్వల భవిష్యత్తు
ప్రత్యేక శ్రద్ధ వహించేలా వినూత్న రీతిలో మంత్రి స్పెషల్ డ్రైవ్
లక్ష్యానికి అనుగుణంగా ఏఈవో, ఏవోలు పని చేయకపోతే వారిపై చర్యలు తప్పవని సుతిమెత్తగా మందలింపు
టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి హరీష్‌రావు దిశానిర్దేశం
బ్యాంకు రుణాలు పొందిన రైతులకు శుభవార్త
బ్యాంకు రుణ విముక్తికై వన్ టైమ్ సెటిల్‌మెంటు : మంత్రి హరీష్‌రావు
ఆయిల్ పామ్ సాగుకు.. సిద్ధిపేట జిల్లా లాభదాయకం, శ్రేయస్కరమని, అంతర్జాతీయ డిమాండ్ ఉన్న పంట ఆయిల్ పామ్ సాగు ఉన్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు దిశానిర్దేశం చేశారు.ఆయిల్ పామ్ తోటల సాగు పెరుగుదలతో జిల్లా రైతులకు ఉజ్వల భవిష్యత్తు ఉన్నదని, మొదటి ప్రాధాన్యత కింద ఆయిల్ పామ్ విరివిగా సాగు జరిగేలా చొరవ చూపాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖాధికారులకు మంత్రి హరీష్ రావు ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేట నుంచి జిల్లా వ్యవసాయ, ఉద్యాన పట్టు పరిశ్రమ, జిల్లాలోని అన్నీ మండలాలు, గ్రామ రైతు బంధు సమితి నాయకులు, జిల్లాలో 10 ఎకరాల భూ విస్తీర్ణం కలిగిన 3215 మంది రైతులతో కలిపి మొత్తం 4 వేల 200 మందితో రాష్ట్ర మంత్రి శ్రీ తన్నీరు హరీశ్ రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి వ్యవసాయ విస్తరణ అధికారులు, ఏఈవోలు క్లస్టర్ వారీగా ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యాలను నిర్దేశించారు. ఆయిల్ ఫామ్ సాగుపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ.. ఓ వైపు అధికారులు, మరోవైపు ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి ప్రత్యేక శ్రద్ధ వహించేలా మంత్రి హరీశ్ రావు వినూత్న రీతిలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 50 వేల ఎకరాలు ఆయిల్ ఫామ్ తోటలు నాటడం లక్ష్యం. కానీ ఇప్పటివరకు జిల్లాలో లక్ష్యానికి అనుగుణంగా అనుకున్న మేర ముందుకు సాగడం లేదని, ఆయిల్ ఫామ్ సాగు పుంజుకునేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆయా వ్యవసాయ అనుబంధ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులకు దిశానిర్దేశం చేశారు. ప్రత్యేకించి జిల్లా వ్యాప్తంగా ఒక్కొక్కరికీ 10 ఎకరాల భూమి విస్తీర్ణంలో కలిగి ఉన్న రైతులు 3215 మంది ఉన్నారని, వీరి మొత్తం భూమి 50 వేల 112 ఎకరాల మేర ఆయిల్ ఫామ్ తోటలు సాగుకు అనుకూలంగా ఉన్నట్లు, ఆయా రైతులంతా ఆయిల్ ఫామ్ తోటల సాగుకు ముందుకు వచ్చేలా చొరవ చూపాలని సూచనలు చేశారు. ఏఈవోలు వ్యవసాయ విస్తరణ అధికారులు పని చేయకపోతే వారిపై చర్యలు తప్పవని సుతిమెత్తగా మంత్రి మందలించారు. ఇంకా క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించి చైతన్యం చేయాల్సిన అవసరం ఉన్నదని, క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయ అధికారులు, రైతుబంధు సమితి నాయకుల సమన్వయంతో అనుకున్న ఆ లక్ష్యం దిశగా ముందుకు సాగాలని మంత్రి సూచనలు, ఆదేశాలు జారీచేశారు. ఆయిల్ ఫామ్ సాగు కోసం వంద శాతం రాయితీపై ఎస్సీ, ఎస్టీలకు డ్రిప్ అందిస్తున్నట్లు, 90 శాతం రాయితీపై డ్రిప్ అందిస్తున్నట్లు రైతులకు అర్థమయ్యేలా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించి ఆయిల్ ఫామ్ తోటల సాగుకై ముందుకు వచ్చేలా చూడాలని మార్గదర్శనం చేశారు. జిల్లా వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, ఆయా మండలాల్లోని ప్రజా ప్రతినిధులు అందరూ రైతులతో ఈ దీర్ఘకాలిక పంటలపై, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్న ఆయిల్ ఫామ్ సాగుపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగాలని గ్రామ, మండల, జిల్లా రైతుబంధు సమితి నాయకులకు మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. జిల్లాలోని వ్యవసాయ విస్తరణ, అధికారులు తమ తమ క్లస్టర్ పరిధిలోనీ రైతులతో సమావేశం నిర్వహించి , చైతన్యం చేసి ఆయిల్ ఫామ్ సాగు కోసమై రైతులు ముందుకు వచ్చేలా చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని మండలాలు, గ్రామాల వారీగా ఆయిల్ ఫామ్ సాగుకై చేసిన, చేపట్టిన లక్ష్యాలను, చేపట్టాల్సిన లక్ష్యాలను ఏఈవోలు, మండలాల వ్యవసాయ అధికారులు, రైతుబంధు సమితి నాయకులు మంత్రికి వివరించారు.
బ్యాంకు రుణాలు పొందిన రైతులకు శుభవార్త…బ్యాంకు రుణ విముక్తికై వన్ టైమ్ సెటిల్‌మెంటు
జిల్లాలోని పలు బ్యాంకులలో రుణాలు పొంది బాధపడే రైతులకు రాష్ట్ర మంత్రి హరీష్‌రావు శుభవార్త చెప్పారు. మంత్రి హరీశ్ రావు ప్రత్యేక చొరవతో జిల్లా వ్యాప్తంగా దాదాపు 12 వేల మంది రైతులకు రుణ విముక్తి కలుగనున్నది. జిల్లా బ్యాంకర్లతో సమావేశమై చర్చించిన అనంతరం ఆర్థిక మంత్రి ఆదేశాల మేరకే బ్యాంకర్లు స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు వివరించారు. జిల్లాలోని యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఏపీజీవీబీ బ్యాంకులు ముందుకొచ్చాయి. ఈ మూడు బ్యాంకులలో పాత మొండి బకాయిలు క్రాప్ లోన్, అగ్రిలోన్, గ్రూప్‌లోన్, ఇతరత్రా రుణాలు తీసుకుని మొండి బకాయిలుగా ఉన్న రుణాలకు వన్ టైమ్ సెటిల్మెంట్ చేసి రుణ విముక్తి చేయడం జరుగుతుంది. ఇందుకు సంబంధించిన జాబితాను సంబంధిత గ్రామ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, అధికారులకు త్వరలోనే అందజేయనున్నారు. అలాగే యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా రుణ విముక్తి పొందిన రైతులు రెండు నెలల్లో క్రాప్ లోన్లు తీసుకోవచ్చునని మంత్రి వివరించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివ ప్రసాద్, జిల్లా ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామలక్ష్మి, రైతుబంధు సమితి జిల్లా, మండల, గ్రామ నాయకులు, ఏఈవోలు, పంచాయతీ కార్యదర్శిలు తదితరులు పాల్గొన్నారు.




