- 6గురు మావోయిస్టు పార్టీ మిలీషియా, కమిటీ సభ్యుల లొంగుబాటు
- మీడియా సమావేశంలో ఏఎస్‌పి పారితోస్ పంకజ్ వెల్లడి
- లొంగిపోయిన వారు పలు విధ్వంసకర సంఘటనల్లో పాల్గొన్నట్లు వెల్లడి
భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : సరిహద్దులో ఉన్న ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని కిష్టారం పొలీస్ స్టేషన్ పరిధిలోని తెలంగాణ-ఛత్తీస్‌ఘడ్ సరిహద్దు గ్రామాలైన డోకుపాడు మరియు పుట్టపాడు గ్రామాల నుండి మావోయిస్టు పార్టీలో మిలీషియా డెప్యూటి కమాండర్ మరియు కమిటీ సభ్యులుగా పనిచేస్తున్న ఆరుగురు వ్యక్తులు భదాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు, 141 బెటాలియన్ సిఆర్పిఎఫ్ అధికారుల సమక్షంలో ఆదివారం లొంగిపోవడం జరిగిందని భద్రాచలం ఏఎస్‌పి పారితోష్ పంకజ్ విలేఖరులకు వివరాలు వెల్లడిరచారు.
లొంగిపోయిన మావోయిస్టు పార్టీ మిలీషియా మరియు కమిటీ సభ్యుల వివరాలను పరిశీలిస్తే..
1. డోకుపాడు గ్రామానికి చెందిన రవ్వ సన్న, 2. డోకుపాడు గ్రామానికి చెందిన ముసికి సన్న ఏ శ్రీను, 3. డోకుపాడు గ్రామానికి చెందిన మడకం జోగా కమిటీ సభ్యుడు, 4. డోకుపాడు గ్రామానికి చెందిన కోవాసి మంగ మిలీషియా సభ్యుడు.5. డోకుపాడు గ్రామానికి చెందిన రవ్వ లక్క కమిటీ సభ్యుడు.6. పుట్టపాడు గ్రామానికి చెందిన కర్టం పొజ్జా, మిలీషియా డిప్యూటి కమాండర్‌లు పోలీస్ అధికారుల సమక్షంలో లొంగిపోయారు. పై ఆరుగురు గత కొన్ని సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీ మిలీషియా మరియు కమిటీ సభ్యులుగా పని చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన చర్ల ఏరియా కమిటీ మరియు ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రానికి చెందిన కిష్టారం ఏరియా కమిటీ సాయుధ దళసభ్యులతో కలిసి తెలంగాణ- ఛత్తీస్‌ఘడ్ సరిహద్దు ప్రాంతంలో పలు విధ్వంసకర సంఘటనలు, పోలీసులను హత మార్చడానికి ఐఇడి బాంబ్‌లు అమర్చిన పలు సంఘటనలలో పాల్గొన్నట్లు ఏఎస్‌పి తెలిపారు.
కాలానుగుణంగా మావోయిస్టు పార్టీ సిద్ధాంతాల పట్ల విముఖత ఏర్పడి, తెలంగాణ-ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధిని గుర్తిస్తూ, తమ ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి కోసం గ్రామస్తులతో చర్చించి, నిర్ణయం తీసుకుని పోలీస్ అధికారులు ఎదుట లొంగిపోవడం జరిగిందని తెలిపారు. ఇటీవల భదాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు మరియు 141 బెటాలియన్ సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘‘ఆపరేషన్ చేయూత’’ కార్యక్రమంలో భాగంగా భదాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు మరియు 141 బెటాలియన్ సిఆర్పిఎఫ్ తెలంగాణ-ఛత్తీస్‌ఘడ్ సరిహద్దు గ్రామాలలో పర్యటిస్తూ నిర్వహించిన అవగాహన కార్యక్రమాల ద్వారా ఆకర్షితులై ఈ ఆరుగురు లొంగిపోవడం జరిగిందని వివరించారు.
అదే విధంగా లొంగిపోయి సాధారణ జీవనం గడపాలనుకునే దళ సభ్యులకు గానీ, మీలీషియా సభ్యులకు గానీ వారు స్వయంగా గాని, లేదా కుటుంబ సభ్యుల ద్వారా గాని వారికి సమీప పోలీస్ స్టేషన్ అధికారులను గానీ, లేదా జిల్లా పోలీస్ ఉన్నతాధికారులను గాని సంప్రదించగలరని భద్రాచలం పోలీస్ తరఫున విజ్ఞప్తి చేశారు. లొంగిపోయే దళ సభ్యులకు, మిలీషియా సభ్యులకు జీవనోపాధి, పునరావాసం కల్పించడం కోసం ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను అందించడానికీ భద్రాచలం పోలీస్ యంత్రాంగం కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సిఆర్‌పిఎఫ్ 141కమాండెంట్ రితేష్ టాకూర్, 141 2 ఇన్ కమాండెంట్ కమల్ వీర్ యాదవ్, 141 సిఆర్‌పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ రేవతి ఆర్జునన్, దుమ్ముగూడెం సిఐ అశోక్, చర్ల సిఐ రాజు వర్మ, దుమ్ముగూడెం ఎస్సై గణేశ్ ఉన్నారు.




