- కలసికట్టుగా పోరాడితేనే విజయం
- పార్టీ మాజీ కార్యదర్శి శశికళ
చెన్నై, ఫిబ్రవరి 25 : అన్నాడీఎంకే సురక్షితులైన నాయకలు చేతుల్లో లేదని ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ అన్నారు. 2024 సాధారణ ఎన్నికలకు ముందు తమిళనాడు వ్యాప్తంగా పర్యటించి పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తానని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత జయంతి వేడుకల సందర్భంగా డియాతో శశికళ మాట్లాడారు. ఏఐఏడీఎంకే పరిస్థితి, పార్టీలో కొనసాగుతున్న సంక్షోభంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ’అతి త్వరలో అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీకి పాత వైభవాన్ని తీసుకువస్తాం. 2024 ఎన్నికలకు అందరం కలిసి పనిచేస్తాం’ అని శశికళ అన్నారు. పళనిస్వామి, పన్నీర్ సెల్వం మధ్య ఆధిపత్యపోరు, కోర్టు గొడవల నేపథ్యంలో అన్నాడీఎంకే సురక్షితుల చేతుల్లో లేదని ఆమె ఆందోళన చెందారు. ఏ పార్టీకి అయిన క్యాడర్ బలం ముఖ్యమని చెప్పారు. కేవలం 100-200 మందితో కూడిన గ్రూప్ పార్టీని నడపలేదని అన్నారు.
పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు చాలా చేయాల్సి ఉందన్నారు. దివంగత జయలలిత సజీవంగా లేనట్లుగా తాను ఏ రోజూ భావించ లేదని ఆమె నెచ్చెలి కూడా అయిన శశికళ అన్నారు. అమ్మ ఇప్పటికీ తనతోపాటు తమిళనాడు ప్రజలు, పార్టీ కార్యకర్తల హృదయాల్లో ఉన్నారని తెలిపారు. ఎల్లప్పుడూ జయలలిత వెంట ఉన్న తాను ఆమె బాటను అనుసరిస్తానని చెప్పారు. ఆమె వదిలేసిన పనులు పూర్తి చేయాలన్నది తన కోరిక అని అన్నారు. అందుకే ఎన్ని పోరాటాలు చేసైనా సరే పార్టీని ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. తన కోసం కాకపోయినా తమిళనాడు ప్రజలు, వారి రక్షణ కోసం పార్టీ క్యాడర్ అంతా ఏకం కావాల్సి ఉందన్నారు. ఇది ఖచ్చితంగా జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు ఎవరినీ కూడా తాను దూరంగా ఉంచలేదని శశికళ తెలిపారు. పన్నీర్ సెల్వం తనను కలుస్తాననడంలో ఎలాంటి సమస్య లేదన్నారు. అమ్మనిజాయతీగా, యథార్థంగా పనులు చేసేవారని చెప్పారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే అలా లేదని విమర్శించారు. ప్రజలను రక్షించాలి, వారికి మంచి మార్గం చూపాలని అన్నారు. అందుకే తమిళనాడులో అన్నాడీఎంకేకు అంత ప్రాధాన్యత ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలిచి ప్రజల గొంతు విని వారి అవసరాలు తీరుస్తామని ఆమె అన్నారు. అయితే పన్నీర్ సెల్వం, టీటీవీ, శశికళ తప్ప ఎవరినైనా పార్టీలోకి స్వాగతిస్తామని పళనిస్వామి వర్గం పేర్కొంది.




