సరే, సుదీర్ఘమైన స్వాతంత్య్ర పోరాటం తర్వాత, రాజ్యాంగం కూడా రచించుకున్న తర్వాత న్యాయమూర్తుల ఎంపికలో పాత వలసవాద పద్ధతులనే కొనసాగించాలని మనం నిర్ణయించుకున్నాం. అలా న్యాయమూర్తులుగా నియమించబడేవారికి ప్రపంచం గురించి అవగాహన లేదు. చివరికి వారు రాజ్యాంగానికీ దాని తాత్విక దృక్పథానికీ, రాజ్యాంగ విలువలకూ ఏ మాత్రం కట్టుబడని వారు. రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, రాజ్యాంగబద్ధంగా నియమించబడే వ్యక్తులకు ఎటువంటి నైపుణ్యం, అర్హత ఉండనక్కరలేని ఏకైక వ్యవస్థ ఇదే.
ఆ ఆశ్రమంలోని యువతులలో ఏడుగురు శ్రీలంకకు చెందిన వాళ్లు కాగా మిగిలిన వాళ్లందరూ తమిళనాడుకు చెందిన వాళ్లు. వాళ్లందరూ రజస్వల కాకముందే ఆశ్రమంలో చేర్చబడ్డారు. వారు రజస్వల కాగానే వారిని ఆశ్రమంలో నిర్బంధంలో ఉంచి, ఆ తర్వాత ప్రేమానంద దగ్గరికి పంపేవారు. ఆ ఆశ్రమంలో కొందరు మధ్య వయసు స్త్రీలు కూడా పని చేసేవారు గాని లైంగిక అత్యాచారాల ఫిర్యాదులన్నీ ప్రధానంగా యువతుల నుంచి, బాలికల నుంచి మాత్రమే వచ్చాయి . వాళ్లందరూ అనాథలు, పూర్తిగా ఆశ్రమం మీదనే ఆధారపడి ఉన్నవారు.
వారి వయసు రీత్యా, ఆశ్రమంలో అనాథలుగా ఉన్న స్థితి దృష్ట్యా వారికి తమ మీద జరుగుతున్న అత్యాచారాలను ప్రతిఘటించే అవకాశం లేదు. కాని వారిలో కొందరు ప్రతిఘటించారు. అందుకు శిక్షగా ఒక బాలికను గుడ్డలూడదీసి మిగిలిన వారందరి ముందూ నగ్నంగా నిలబెట్టారు. అందరి ముందూ అవమానించారు.మరొక బాలికను అన్నం, నీళ్లు ఇవ్వకుండా కుక్కల దొడ్డిలో నిర్బంధించారు. మరొక బాలికను భోజనశాలలో అందిరి ముందూ కొట్టారు. కృష్ణవేణి అనే బాలిక ఆశ్రమం నుంచి పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు ఆమెను ఒక దూడకు కలిపి కట్టి ఆశ్రమంలో పరుగెత్తించారు.
మరొక బాలిక సురేష్ కుమారి భగవదవతారం ఇటువంటి దారుణాలకు పాల్పడడమేమిటని ప్రశ్నిస్తే ‘‘నేను మీ తండ్రి వంటి వాడిని. నేను మీతో సంభోగిస్తే మీకు గర్భం రాదు’’ అని ప్రేమానంద జవాబు చెప్పాడు. ‘‘నేను భగవంతుడి అవతారాన్ని. నేను నిన్ను పట్టుకుంటాను నంటే నువ్వు గత జన్మలో పుణ్యం చేసుకున్నావన్నమాట.’’ అని మరొక యువతితో అన్నాడు.
ప్రేమానంద చేసిన అకృత్యాలకు అద్దం పట్టే ఇటువంటి వాస్తవాలు ఎన్నో ఉన్నాయని, వాటన్నింటినీ తన తీర్పులో వివరించడమంటే అది బూతు పురాణం అవుతుందనే భయంతో మానేస్తున్నానని న్యాయమూర్తి భానుమతి రాశారు. రవి అనే శ్రీలంకకు చెందిన యువకుడిని అక్రమంగా నిర్బంధించి చివరికి కొట్టి చంపేశారు. ఆశ్రమంలో ఉన్న బాలికల, యువతుల రుతుక్రమం పరిశీలించడానికి, అవసరమైతే గర్భస్రావాలు జరపడానికి ప్రత్యేకంగా ఆశ్రమంలో ఒక మహిళా వైద్యురాలు ఉండేది.
కేసు మొదలై, ఆశ్రమంలోని బాలికలందరినీ అక్కడి నుంచి ప్రభుత్వాధీనంలోకి తీసుకొని ఒక మహిళా సంస్థ పర్యవేక్షణలో ఆశ్రయం కల్పించిన తర్వాత అరుళ్ జ్యోతి అనే బాలిక గర్భిణి అని బయట పడిరది. ఆమె అంగీకారం మీదనే ఆమెకు గర్భస్రావం జరిపి, ఆ పిండం నమూనాను, ఆ బాలిక రక్తాన్ని, ప్రేమానంద రక్తాన్ని డిఎన్‌ఎ పరీక్షల కోసం హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సిసిఎంబి)కి పంపడం జరిగింది. ఆ పరీక్షలలో గర్భస్థ శిశువుకు తండ్రి నిస్సందేహంగా ప్రేమానందేనని రుజువు అయింది.
న్యాయమూర్తి భానుమతి ఈ కేసులో నిందితులందరికీ వేర్వేరు శిక్షలు విధించారు. కాని ప్రేమానంద విషయంలో చేసిన నేరనిర్ధారణ, విధించిన శిక్షలు తప్పనిసరిగా చెప్పుకోవలసినవి. అతనికి రెండు యావజ్జీవ కారాగారవాస శిక్షలు విధించి, అవి ఒక దాని తర్వాత ఒకటి జరగాలని ఆమె తీర్పు ఇచ్చారు. అట్లాగే ఇంద్రజాలికుడు మరుదువత్తు సాక్ష్యం ప్రకారం, శూన్యం నుంచి కుంకుమ, విభూతి, చిన్న విగ్రహాలు సృష్టించి భగవదవతారంగా చెప్పుకునే గారడీ వాళ్లందరూ మోసానికి పాల్పడుతున్నట్టేనని, వారిని దగా అనే నేరం కింద విచారించవచ్చునని ఆమె అన్నారు. ఈ నిర్ధారణను సుప్రీంకోర్టు కూడా ధృవీకరించింది.
భగవదవతారంగా చెప్పుకునే వారిపట్ల వ్యవహరించవలసిన ప్రమాణంగా ఇది అంగీకరించబడినది. ఇటువంటి కింది కోర్టు తీర్పును హైకోర్టుకు తీసుకు వచ్చినప్పుడు, అక్కడ కేసును నడపడం, కింది కోర్టు తీర్పును ధృవీకరించడం బ్రహ్మా ప్రళయమయిపోతుంది. హైకోర్టులలో ఉండే న్యాయమూర్తులు విభిన్న నేపథ్యాల నుంచి వచ్చినవాళ్లు, విచిత్రమైన వాళ్లు ఉంటారు. వలసపాలనా కాలంలో ప్రభుత్వం న్యాయవాదులను ఎంపిక చేసి న్యాయమూర్తులుగా నియమించేది. న్యాయవాదులలో ఇంగ్లీష్ భాష, సాహిత్యం ఎవరికి బాగా తెలుసునో, ఎవరు తిరుగుబాటు భావాలు లేకుండా ఉంటారో ప్రభుత్వానికి బాగా తెలిసి ఉండేది. ఆ మాదిరిగా రంగూ రుచీ లేని న్యాయ వాదులను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించి పదోన్నతి కల్పించేవారు. మచ్చలేని వారిని, మంచివారిని, సమర్థులను, బాగా చదువుకున్న వారిని, నిపుణులను న్యాయమూర్తులుగా నియమించడం జరుగుతుండేది. అప్పుడు కూడా ఆశ్రిత పక్షపాతంతో న్యాయమూర్తులను నియమించడం జరుగుతుండేది.
మేం పని లేకుండా ఖాలీగా కూచున్నప్పుడు మాకంటే వయసులో పెద్దవారయిన న్యాయవాదులతో కూచున్నప్పుడు మా వృత్తికి సంబంధించిన రసవత్తరమైన కథలెన్నో మా చెవిన పడుతుండేవి. ఆ కథల్లో ఇటువంటి న్యాయవాదుల, న్యాయమూర్తుల కథలు కూడా ఉండేవి. వాటిలో ఒకటి జస్టిస్ కె.పి. లక్ష్మణ రావు న్యాయమూర్తిగా ఎలా నియమించబడ్డారనే కథ. ఆయన మంచి టెన్నిస్ ఆటగాడు. ఆ క్రమంలో ఆయనకు అప్పటి గవర్నర్ భార్య లేడీ హోప్‌తో టెన్నిస్ ఆడే అవకాశం దొరికిందట. ఆమెతో టెన్నిస్ ఆడడమే ఏకైక అర్హతగా ఆయన న్యాయమూర్తిగా నియమితులయ్యారట.
సరే, సుదీర్ఘమైన స్వాతంత్య్ర పోరాటం తర్వాత, రాజ్యాంగం కూడా రచించుకున్న తర్వాత న్యాయమూర్తుల ఎంపికలో పాత వలసవాద పద్ధతులనే కొనసాగించాలని మనం నిర్ణయించుకున్నాం. అలా న్యాయమూర్తులుగా నియమించబడేవారికి ప్రపంచం గురించిన అవగాహన లేదు. చివరికి వారు రాజ్యాంగానికీ దాని తాత్విక దృక్పథానికీ, రాజ్యాంగ విలువలకూ ఏ మాత్రం కట్టుబడని వారు. రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, రాజ్యాంగబద్ధంగా నియమించబడే వ్యక్తులకు ఎటువంటి నైపుణ్యం, అర్హత ఉండనక్కరలేని ఏకైక వ్యవస్థ ఇదే.
ప్రతి న్యాయమూర్తి న్యాయవాదిగా తాను గడిపిన గతాన్ని వదులుకోవలసి, మరచిపోవలసి ఉంటుంది. న్యాయమూర్తిగా తన విధులను, బాధ్యతలను రాజ్యాంగంతో సంవదించుకోవలసి ఉంటుంది. తన అధికారాన్ని అంచనా వేసుకోవలసి ఉంటుంది. కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన నిర్మాణ వ్యవస్థ అనే రెండు సమస్కంధమైన నిర్మాణాల నిర్ణయాలను సమీక్షించడానికి తన అధికారం ఎంత వరకు ఉపయోగించవచ్చునో తేల్చుకోవలసి ఉంటుంది. అంటే ఒక న్యాయమూర్తి రాజ్యాంగ విలువల వ్యవస్థను అతిక్రమించని, వ్యతిరేకించని ఒక న్యాయ సంవిధానాన్ని తయారు చేసుకోవలసి ఉంటుంది. కాని ఇటువంటి ఆదర్శవంతమైన స్థితి దురదృష్ట వశాత్తూ ప్రస్తుతం ఉనికిలో లేదు. ఒక న్యాయమూర్తి వేర్వేరు కేసులలో ఎటువంటి వైఖరి తీసుకుంటారో దాదాపు అందరు న్యాయవాదులకూ తెలుసు. ఇదంతా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా అధ్యయనం చేసి, గమనంలో పెట్టుకుంటారు. నిజానికి కక్షిదారులు కూడా ఇటువంటి సమాచారాన్నంతా న్యాయవాదుల నుంచి అయినా అడిగి తెలుసుకుంటారు. అందువల్ల ఒక కేసు వాదించడం సంక్లిష్ట వ్యవహారం అయిపోతుంది. ఒక కేసు వాదించడానికి సరైన న్యాయమూర్తి ఎప్పుడు వస్తారో అని ఎదురు చూస్తూ ఉండవలసి వస్తుంది.
.-కె.జి. కన్నబిరాన్





ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల