ఆత్మప్రబోధంతోనే వోటువేయండి

రాష్ట్రపతి ఎన్నికల్లో ఆత్మప్రబోధంతోనే వోటు వేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టిఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆర్హులైన తమ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. గతంలో వివి గిరి రాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భంగా ఇందిరాగాంధి పిలుపునిచ్చినట్లుగానే ఆత్మప్రబోధంతో తమ వోటును సద్వినియోగం చేసుకోవాలంటూ ఎంపిలకు, ఎంఎల్‌ఏలకు కెసిఆర్‌ ‌ప్రబోధించారు. రాష్ట్రపతి డాక్టర్‌ ‌జాకీర్‌ ‌హుసేన్‌ అకస్మాత్తుగా 1969 మే 3న మృతి చెందడంతో రాష్ట్రపతి ఎన్నిక నాడు అనివార్యమయింది. ఆనాడు కాంగ్రెస్‌పార్టీకి తిరుగులేని మెజార్టీ ఉండింది. రాష్ట్రపతి అభ్యర్థిగా నీలం సంజీవరెడ్డిని కాంగ్రెస్‌ ‌పార్టీ ఎంపిక చేసింది. స్వతంత్ర అభ్యర్థిగా వివి గిరి ఆయనతో పోటీ పడుతున్న సందర్భం.

వివి గిరితోపాటు మరికొందరుకూడా నామినేషన్‌ ‌దాఖలు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్నా నాటి ప్రధాని ఇందిరాగాంధీ తమ కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం సంజీవరెడ్డి పక్షాన ప్రచారం చేయకపోవడం ఆనాడు దేశ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశ మయింది. అయితే ఎన్నికలు మరో నాలుగు రోజులు ఉన్నప్పుడు ఇందిరాగాంధీ చేసిన బహిరంగ ప్రకటన యావత్‌ ‌దేశాన్ని ఆశ్చర్యంలో ముంచింది. ఈ ఎన్నికల్లో ఎంపిలు, ఎంఎల్‌ఏలు తమ ఆత్మప్రబోధం మేరకు వోటు హక్కును వినియోగించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేసింది. అంతే నాలుగు రోజుల్లో ప్రక్రియ మొత్తం మారిపోయింది. నీలం సంజీవరెడ్డికన్నా దాదాపు పదిహేను వేల వోట్ల మెజార్టీతో వివి గిరి గెలుపొందారు. ఇందిరాగాంధీ తీసుకున్న ఈ నిర్ణయం కాంగ్రెస్‌తోపాటు దేశరాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఆనాడు ఇందిరాగాంధీ చెప్పిన మాటనే కెసిఆర్‌ ఈనాడు పునరుద్ఘాటించారు.

తమ రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకోవాలంటే ప్రాంతీయ పార్టీల మద్దతు బిజెపికి అవసరం. ఈ ఎన్నికల్లో బిజెపి బలం 48 వోట్ల శాతం మాత్రమే. ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీల బలం కలిపి 51 వోట్ల శాతంగా ఉంది. అయితే తమతో కలిసి వొచ్చే ప్రాంతీయ పార్టీలకు గాలం వేసే పనిలో ఇప్పుడు బిజెపి ఉంది. ముఖ్యంగా ఏపి, ఒడిసా రాష్ట్రాలు తమకు అనుకూలిస్తాయని, దానితో తమ అభ్యర్థిని గెలుపు సులభమవుతుందన్న ఆలోచన బిజెపికి ఉంది. బిజెపిని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కలిసి బలపరుస్తున్న అభ్యర్థి యశ్వంత్‌ ‌సిన్హా గెలపు ఇప్పుడు అంత సులభంగా కనిపించడంలేదు. అయితే గెలపు ఓటములు పక్కకు పెట్టి బిజెపి పాలనలో దేశం ఎంత ఆధోగతి పాలవుతున్న విషయాన్ని ప్రజలకు తెలియజెప్పి, దేశాన్ని ఇలాంటి పాలకులనుండి కాపాడుకోవాలన్నదే తమ ప్రయాస అంటున్నారు ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ ‌సిన్హా. ఇదిలాఉంటే దేశ రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పు తీసుకురావాలని ఇంతకాలం చెబుతున్న కెసిఆర్‌కు రాష్ట్రపతి ఎన్నిక అందివొచ్చిన ఆయుధమయింది. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తన అభిప్రాయాన్ని దేశ ప్రజలతో పంచుకునే అవకాశం లభించినట్లైంది.

రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ ‌సిన్హా నామినేషన్‌ ‌వేసిన తర్వాత ఆయన్ను తెరాస తెలంగాణకు ఆహ్వానించింది. శనివారం ఒక పక్క దేశ ప్రధాని తమ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు వొచ్చిన సందర్భంలోనే యశ్వంత్‌ ‌సిన్హా హైదరాబాద్‌కు రావడం విశేషం. అయితే గతంలో ప్రధాని తెలంగాణ పర్యటన సందర్భంగా ఆయన్ను ఆహ్వానించడానికి వెళ్ళనట్లుగానే, ఈ రోజుకూడా కెసిఆర్‌ ‌ప్రధానిని కలువకుండా, యశ్వంత్‌ ‌సిన్హాకు బ్రహ్మరథం పట్టారు. నగర వీధుల్లో గులాబీ శ్రేణులతో బ్రహ్మాండమైన ర్యాలీలో తాను స్వయంగా పాల్గొని యశ్వంత్‌ ‌సిన్హాతోపాటు జలవిహార్‌కు చేరుకున్నారు. యశ్వంత్‌ ‌సిన్హా ఒక నిఖార్సైన రాజకీయ నాయకుడని, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉందని చెబుతున్న కెసిఆర్‌ ఇలాంటి వ్యక్తిని గెలిపించుకోవడం ప్రస్తుత పరిస్తితిలో మనకు అవసరమన్న విషయాన్ని ఈ సందర్భంగా టిఆర్‌ఎస్‌ ‌పార్టీ శ్రేణులతో ఏర్పాటు చేసిన సమావేశంలో నొక్కిచెప్పారు. దేశం అనిశ్చిత పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నది, ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడుతున్నది. బిజెపి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రపంచ దేశాల మధ్య తలెత్తుకుని తిరిగే పరిస్థితి లేదు.

మన కన్నా ఆర్థికంగా వెనుకబడిన దేశాలు పురోగతిని సాధిస్తుంటే, మన దేశం మరింత దిగజారుతోంది. దేశ ఆభివృద్ధిలో పరిశ్రమల పాత్ర ప్రధానమయినది. అలాంటిది ఉన్న పరిశ్రమలుకూడా దేశం ఎల్లలు దాటుతున్నాయంటే కేంద్ర ప్రభుత్వ పాలనాతీరు ఏవిధంగా ఉందన్నది అర్థం చేసుకోవచ్చు. బిజెపి అధికారం చేపట్టిన ఈ ఎనిమిది ఏళ్ళ కాలంలో గద్దెను ఎక్కేముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కదాన్ని కూడా ఈనాటికి పూర్తి చేయలేకపోయింది. పైగా ధరలు పెంచి ప్రజలపై అధిక ఆర్థిక భారాన్ని మోపుతున్నది. కేంద్రం తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం ప్రజలకు ఇబ్బందికరంగా, వ్యతిరేకంగా మారుతున్నది. దాంతో నిసిగ్గుగా వాటిని వెనక్కు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే పాలనలో మార్పు రావాల్సిన అవసరమున్నది. తమ పోరాటమంతా దానికోసమే. మార్పు రావాలంటే యశ్వంత్‌ ‌సిన్హాలాంటి ఉత్తమ వ్యక్తిని గెలిపించుకోవాల్సిన అవసరముంది. వీటిపై సమగ్రంగా ఆలోచించి ఆత్మప్రబోధంతో వోటు హక్కును వినియోగించుకోవాలంటూ కెసిఆర్‌ ‌చేసిన సుదీర్ఘ ప్రసంగం ఎంతమందికి ఆత్మప్రబోధాన్ని కలిగిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *