అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం…సామాన్యునికి ఒక వరం
నిరుపేద కుటుంబాలలో కోటి వెలుగులు పంచుతున్న 2బిహెచ్కె
రూ.19,329 కోట్ల వయ్యంతో 2,91,057 ఇళ్ళ నిర్మాణం
సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికీ ఓ అందమైన కల, ఎందరో నిరుపేదల సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు నేనున్నాను అంటూ నిలబడ్డ మన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఓ వరం… డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు. ఇళ్ళు లేని నిరుపేదల మీద ఒక్క పైసా కూడా భారం మోపకుండా ఉచితంగా ఇంటిని అందించే సంకల్పంతో చేపట్టిన ఓ బృహత్తర పథకం. పగలు పనికి పోయినా రాత్రి మనది అనే ఓ చిన్న గూడు ఉంటే చాలు అనుకునే నిరుపేద కుటుంబాలకు కోటి వెలుగులు పంచుతూ…560 చదరపు అడుగుల వైశాల్యంలో విశాలమైన రెండు పడక గదులు, ఒక వంట గది, ఒక హాల్‌తో పాటు రెండు బాత్ రూమ్‌లతో, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళని ప్రభుత్వం ఉత్తమ ప్రమాణాలతో నిర్మిస్తున్నది. రాష్ట్రంలో తొలివిడతగా 19,329 కోట్ల రూపాయల వ్యయంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధితో సహ 2,97,057 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణాలను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వ కృషిని జాతీయ స్ధాయి నాయకులు పార్లమెంటు సాక్షిగా ప్రశంసించడం దేశ చరిత్ర లోనే ఓ ప్రత్యేకతగా చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు పడకల గృహ నిర్మాణ పథకంలో ఇప్పటి వరకు 2,91,057 గృహములను మంజూరీ చేయడం జరిగినది. మంజూరు చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు చాలా వరకు నిర్మాణాలు పూర్తి చేశారు. కొన్ని చోట్ల లబ్దిదారులకు అందజేయడం కూడా పూర్తి అయ్యింది. రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణాలు చాలా వరకు పూర్తయ్యాయి. వీటిపై ఇప్పటివరకు రూ.10,806.728 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది.
బిల్లుల విడుదలలో పారదర్శకత మరియు జవాబుదారితనం
కాంట్రాక్టర్లు బిల్లులు సమర్పించిన 15 పని దినాలలో జిల్లా కలెక్టర్ల ద్వారా బిల్లులు విడుదల చేయడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా బిల్లుల చెల్లింపులో జవాబుదారితనం మరియు పారదర్శకత కోసం ‘ఆన్లైన్ ప్రాజెక్ట్ మానిటరింగ్ సిస్టమ్(ఓపిఎంఎస్)ను ప్రవేశపెట్టడం జరిగింది. ఓపిఎంఎస్ ద్వారా కాంట్రాక్టర్లు వారికి రావలిసిన బిల్లు వివరములు ఆన్లైన్ నందు వారికి కేటాయించిన లాగిన్ నందు పొందుపర్సిన వెంటనే సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఏఇ/డిఇ లకు బిల్ రికార్డు, జరిగిన పనిని పరిశీలించి ఎంబీస్ పంపవలసిందిగా ఎప్ఎంఎస్ ద్వారా ఆదేశాలు జారీ చేస్తారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ద్వారా పంపబడిన బిల్లులను జిల్లా నోడల్ అధికారి పరిశీలించిన వెంటనే జిల్లా కలెక్టర్ల ద్వారా కాంట్రాక్టర్ల బ్యాంక్ అక్కౌంట్ లో నేరుగా నగదు జమ చేయబడుతుంది. ఇట్టి ప్రక్రియ మొత్తం 15 రోజులలో పూర్తి అవుతుంది. ఓపిఎంఎస్ ద్వారా కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు రాష్ట్ర స్థాయి నుండి క్షేత్ర స్థాయి వరకు నిరంతర పర్యవేక్షణ మరియు నియంత్రణ చేయడం జరుగుతుంది.
జిల్లా కలెక్టర్ల నుండి నిధుల విడుదల కోసం వొచ్చిన ప్రతిపాదనలు వెంటనే పరిశీలించి రాష్ట్ర స్థాయిలో కూడా నిధుల విడుదల వెంటనే సంబంధిత కలెక్టర్ల బ్యాంకు అకౌంట్సుకి జమ చేయడం జరుగుతుంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ డిజైన్, లే-ఔట్లలో, సృజనాత్మకత మరియు ఇండ్ల నిర్మాణంలో మెరుగైన పనితీరు కనబర్చినందుకు మరియు పారదర్శకత పాటించుచున్నందుకు ఓపిఎంఎస్కు జాతీయ స్థాయిలో ఇటీవల హడ్కో అవార్డులు కూడా ప్రభుత్వం దక్కించుకోవడం జరిగింది. ఈ పథకం అమలును అధ్యయనం చేయడానికి రాష్ట్రాన్ని సందర్శించిన జాతీయస్థాయి, ఇతర రాష్ట్రాల అధికారులు మరియు నిపుణులు ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. ఇటీవల కొన్ని రాష్ట్రాల అధికారులు అధ్యయనం నిమిత్తం రాష్ట్రంలో పర్యటించి ఉన్నత ప్రమాణాలతో నూతన సాంకేతిక పరిజ్ఞానముతో నిర్మిస్తున్న ఇళ్లను పరిశీలించి, ప్రశంసిస్తూ వారి రాష్ట్రాలలో కూడా అమలు పరుచుటకు చర్యలు తీసుకొంటున్నారు.


