ఆజంఖాన్‌ ‌పని అయిపోయింది

రామ్‌పుర, ఫిబ్రవరి 20 : సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ ‌నేత ఆజంఖాన్‌ ‌పై మాజీ ఎంపీ, భాజపా నేత జయప్రద విమర్శలు గుప్పించారు. ఇప్పటికే ఆయన చేసిన పనులకు తగిన శిక్ష పడిందన్న ఆమె.. తండ్రీకొడుకులు చేసిన పాపాలకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు. మేరఠ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జయప్రద.. సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ ‌నేత ఆజంఖాన్‌ ‌పని అయిపోయిందన్నారు. పలు కేసుల్లో శిక్ష ఖరారు కావడంతో ఆజంఖాన్‌, ఆయన కుమారుడు ఇటీవల శాసనసభ సభ్యత్వాలను కోల్పోవడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ జయప్రద ఇలా స్పందించారు. ‘రాజకీయాల్లో భిన్న పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు.

కానీ, అధికార గర్వం మాత్రం ఉండకూడదు. మహిళలను గౌరవించాలి. పేదలకు, అణగారినవర్గాల వారికి న్యాయం చేయాలి. వారికి (ఆజంఖాన్‌, ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజంలను ఉద్దేశిస్తూ) మాత్రం మహిళలను గౌరవించడం తెలియదు. ఆజంఖాన్‌ ‌చేసిన పనులకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు. ఇక ఆయన పని అయిపోయింది. వారు చేసిన పాపాలకు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది’ అని జయప్రద పేర్కొన్నారు. యూపీ రాజకీయాల్లో కీలక నేతలుగా ఉన్న ఆజం ఖాన్‌, ‌జయప్రద మధ్య ఇదివరకు ఎన్నో వివాదాలు కొనసాగాయి.

2019 ఎన్నికల సమయంలో రామ్‌పుర్‌ ‌నుంచి పోటీ చేసే క్రమంలో జయప్రదపై చేసిన అనుచిత వ్యాఖ్యలకుగాను ఆజంపై అప్పట్లో ఎఫ్‌ఐఆర్‌ ‌కూడా నమోదయ్యింది. ఇదే కాకుండా ఆజం ఖాన్‌పై ఎన్నో భూకబ్జాలు, బెదిరింపులు, పలు నేరాలకు సంబంధించి సుమారు 80కిపైగా కేసులు ఉన్నాయి. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రామ్‌పుర్‌ ‌సదర్‌ ‌నుంచి ఆజం ఖాన్‌, ‌స్వార్‌ ‌స్థానం నుంచి ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజంలు గెలుపొందారు. అయితే, పలు కేసుల్లో ఆజంకు మూడేళ్లు, అబ్దుల్లాకు రెండేళ్ళ శిక్ష పడటంతో తండ్రీ, కుమారులిద్దరూ శాసనసభ సభ్యత్వాలను కోల్పోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *